Covid-19: వారు మా రాష్ట్రానికి వస్తే.. కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ చూపించాల్సిందే: రాజస్థాన్ ప్రభుత్వం ఆదేశాలు

Rajasthan: దేశంలో కరోనా కేసుల ఉధృతి నానాటికీ పెరుగుతూనే ఉంది. ఇటీవల తగ్గిన కేసులు కాస్త.. మళ్లీ పెరుగుతుండంటంతో పలు రాష్ట్రాల ప్రభుత్వాలు..

Covid-19: వారు మా రాష్ట్రానికి వస్తే.. కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ చూపించాల్సిందే: రాజస్థాన్ ప్రభుత్వం ఆదేశాలు
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 26, 2021 | 9:47 AM

Rajasthan: దేశంలో కరోనా కేసుల ఉధృతి నానాటికీ పెరుగుతూనే ఉంది. ఇటీవల తగ్గిన కేసులు కాస్త.. మళ్లీ పెరుగుతుండంటంతో పలు రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధిస్తూ ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీంతోపాటు మహారాష్ట్ర, కేరళల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో అక్కడి నుంచి వచ్చే ప్రయాణికులపై పలు రాష్ట్రాలు ఆంక్షలు విధించాయి. ఆయా రాష్ట్రాల నుంచి వచ్చేవారు తప్పనిసరిగా కరోనా ( covid-19) నెగిటివ్ సర్టిఫికేట్ చూపించాలని ఢిల్లీ, మధ్యప్రదేశ్, తదితర రాష్ట్రాలు ఆదేశాలు జారీచేశాయి. ఈ క్రమంలో రాజస్థాన్ (Rajasthan) రాష్ట్ర ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా.. రాజస్థాన్ ప్రభుత్వం ముందు జాగ్రత్తచర్యగా కఠిన ఆంక్షలు విధించింది. కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల నుంచి ప్రయాణికులు రాజస్థాన్ రాష్ట్రంలోకి అడుగుపెట్టాలంటే.. తప్పనిసరిగా కోవిడ్-19 పరీక్షలు చేయించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులకు కరోనా నెగిటివ్ (coronavirus negative) అని రిపోర్టు వస్తేనే వారిని రాజస్థాన్ రాష్ట్రంలోకి అనుమతిస్తామని అధికారులు ప్రకటించారు. రాజస్థాన్ రాష్ట్రానికి వచ్చే మహారాష్ట్ర, కేరళ వాసులు 72 గంటల ముందు కరోనా పరీక్ష చేయించుకొని నెగిటివ్ రిపోర్టును సమర్పించాలని ప్రభుత్వ (Rajasthan govt) అధికారులు సూచించారు. కరోనా కేసులు పెరుగుతున్న మహారాష్ట్ర, కేరళతోపాటు చత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్, గుజరాత్, పంజాబ్, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమబెంగాల్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ అధ్యయనం చేసేందుకు తన బృందాలను పంపించింది. అంతేకాకుండా ఎప్పటికప్పుడు సలహాలతోపాటు సూచనలు కూడా జారీ చేస్తోంది.

అయితే ఇప్పటికే పెరుగుతున్న కేసులు పలు రాష్ట్రాల్లో భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఉన్నట్టుండి ఒకేసారి కేసులు పెరుగుతుండంటంతో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. కరోనా నిబంధనలు పాటించకుండా, మాస్క్ ధరించకుండా వెళ్లే వారిని పట్టుకుని జరిమానాలు సైతం విధిస్తున్నాయి. అంతేకాకుండా మహారాష్ట్రలో కోవిడ్ నియంత్రణకు ప్రత్యేక మార్గదర్శకాలను జారీచేశారు. ఏమైనా కార్యక్రమాలు నిర్వహించాలంటే ముందస్తుగా పర్మిషన్ తీసుకోవాలని.. కరోనా నిబంధనలు పాటించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే కొత్త పలు రాష్ట్రాల్లో కొత్త రకం కరోనా కేసులు గుర్తించడంతో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు పలు సూచనలు చేసింది.

ఇదిలాఉంటే.. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ పక్రియ కూడా వేగవంతంగా కొనసాగుతోంది. గురువారం రాత్రి వరకు దేశవ్యాప్తంగా 1.30కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్లు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటివరకూ.. ఆరోగ్య కార్యకర్తలకు, ఫ్రంట్ లైన్ సిబ్బందికి వ్యాక్సిన్ ఇస్తున్నారు. మార్చి 1 నుంచి 60ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు ఇటీవల కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

Also Read:

పెరిగిన పెట్రో ధరలు, జీఎస్టీ సమస్యలపై గళమెత్తిన వ్యాపారులు.. భారత్ బంద్ పాటిస్తున్న అఖిల భారత ట్రేడర్స్ సమాఖ్య

Hyderabad: కోడలిపై మామ లైంగిక దాడి.. ఢిల్లీ నుంచి దుస్తుల వ్యాపారం కోసం వచ్చి..

Midnapore: పట్టణంలోకి ప్రవేశించిన ఏనుగు.. సురక్షితంగా కాపాడిన అటవీ అధికారులు