పెరిగిన పెట్రో ధరలు, జీఎస్టీ సమస్యలపై గళమెత్తిన వ్యాపారులు.. భారత్ బంద్ పాటిస్తున్న అఖిల భారత ట్రేడర్స్ సమాఖ్య

పెరిగిన పెట్రో ధరలు, జీఎస్టీ నియమాల్లో మార్పులు, ఈ-వే బిల్లుంగ్‌లకు నిరసనగా అఖిల భారత ట్రేడర్ల సమాఖ్య (సీఏఐటీ) శుక్రవారం దేశవ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చాయి.

 • Balaraju Goud
 • Publish Date - 12:14 pm, Fri, 26 February 21
పెరిగిన పెట్రో ధరలు, జీఎస్టీ సమస్యలపై గళమెత్తిన వ్యాపారులు.. భారత్ బంద్ పాటిస్తున్న అఖిల భారత ట్రేడర్స్ సమాఖ్య

Bharat Bandh today : పెట్రో భగ భగ… ప్రైవేట్‌ పొగ.. జీఎస్టీ సెగ..ఇది దేశంలో పరిస్థితి. ఎటు చూసినా నిరసనల భారతమే. కేంద్రం తీరును నిరసిస్తూ కోట్లాది మంది రోడ్డెక్కారు. పెరుగుతున్న పెట్రోల్‌ ధరలు, జీఎస్టీలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతమయ్యాయి.

రోజు రోజు పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు, కొత్త ఈ-వే బిల్లును వ్యతిరేకిస్తూ ది కన్ఫడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) ఇవాళ భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ బంద్‌కు ఆల్ ఇండియా ట్రాన్స్‌పోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ , సంయుక్త కిసాన్ మోర్చాతో పాటు పలు ప్రజా సంఘాలు, వ్యాపార సంఘాలు మద్దతు తెలిపాయి.

సీఏఐటీ పిలుపుతో దేశవ్యాప్తంగా 40వేల వ్యాపార సంఘాలు, 8 కోట్ల మంది వ్యాపారులు బంద్‌కు మద్దతు తెలుపుతున్నారు. మరోవైపు, దేశవ్యాప్తంగా చక్కా జామ్ నిర్వహిస్తున్నారు. దీంతో దేశవ్యాప్తంగా సుమారు 80 లక్షల రవాణా వాహనాలు ఎక్కడిక్కడ నిలిచిపోనున్నాయి. దేశవ్యాప్తంగా 15వందల ప్రాంతాల్లో నిరసనలు తెలుపుతున్నాయి. అయితే, మెడికల్‌, నిత్యావసరాలను బంద్‌ నుంచి మినహాయించారు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
 • 26 Feb 2021 12:14 PM (IST)

  విజయవాడలో బంద్‌ ప్రశాంతం

  విజయవాడలోనూ భారత్‌ బంద్‌ ఎఫెక్ట్‌ కనిపిస్తోంది. అతిపెద్ద ట్రాన్స్‌పోర్టు సిటీలో రవాణా వాహనాలు ఆగిపోయాయి. రామవరప్పాడు, భవానీపురం, ఇబ్రహీపట్నం, తాడేపల్లిలో భారీగా లారీలు నిలిచిపోయాయి. ఇంధన ధరల పెరుగుదల, కొత్త ఈ-వే బిల్లుల రద్దు కోసం ట్రాన్స్‌పోర్టు వర్గాలు దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. దీంతో విజయవాడలోనూ రోడ్లు బోసిపోయాయి.

 • 26 Feb 2021 12:14 PM (IST)

  గాజువాక యార్డులో నిలిచిన ట్రాన్స్‌పోర్ట్ లారీలు

  గాజువాక యార్డులోనూ ట్రాన్స్‌పోర్ట్ లారీలు నిలిచిపోయాయి. స్లాగ్‌ అండ్‌ బల్క్ మెటీరియల్‌ ట్రాన్స్‌పోర్ట్ ఓనర్స్ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. గాజువాక లారీ యార్డు నుంచి డాక్‌ యార్డు వరకు ఈ యాత్ర కొనసాగనుంది.

 • 26 Feb 2021 10:35 AM (IST)

  పశ్చిమ బెంగాల్‌లో బంద్ సంపూర్ణం

  పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని బీర్భంలో భారత్ బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. వ్యాపారులు వాణిజ్య సంస్థలను మూసి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. పెట్రో ధరలను తగ్గించి, జీఎస్టీ సవరణ చేపట్టాలని ట్రేడ్ యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి.

 • 26 Feb 2021 10:10 AM (IST)

  రైతు సంఘాల మద్దతు

  వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న యునైటెడ్ కిసాన్ మోర్చా (ఎస్‌కెఎం) ‘భారత్ బంద్’‌కు మద్దతు పలికింది. దేశవ్యాప్తంగా రైతులు శాంతియుతంగా బంద్‌లో పాల్గొనాలని రైతు సంఘాల నేతలు విజ్ఞప్తి చేశారు.

 • 26 Feb 2021 10:06 AM (IST)

  భువనేశ్వర్‌లో బంద్ ప్రశాంతం

  . ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో భారత్ బంద్ ప్రభావం కనిపించింది. వర్తక, వాణిజ్యసంఘాలు దుకాణాలు మూసివేసి భారత్ బంద్‌కు మద్దతు తెలిపాయి. చాలా తక్కువ వాహనాలు రోడ్లపై కనిపిస్తున్నాయి.

 • 26 Feb 2021 09:36 AM (IST)

  వాణిజ్య మార్కెట్లు మూసివేత

  దేశవ్యాప్తంగా అన్ని వాణిజ్య మార్కెట్లు మూసివేసి బంద్‌లో పాల్గొంటున్నాయి

 • 26 Feb 2021 09:28 AM (IST)

  బంద్‌కు మద్దతివ్వని రెండు సంఘాలు

  బంద్‌లో తాము పాల్గొనబోవడం లేదని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా వ్యాపార్‌ మండల్‌, భారతీయ ఉద్యోగ్‌ వ్యాపార్‌ మండల్‌ స్పష్టం చేశాయి. ఈ రెండు సంఘాల కింద కూడా వందల సంఖ్యలో యూనియన్లున్నాయి.

 • 26 Feb 2021 09:27 AM (IST)

  బంద్‌కు మద్దతు తెలిపిన 40 వేల సంఘాలు

  దేశవ్యాప్తంగా 8 కోట్ల మందికి ప్రాతినిథ్యం వహిస్తున్న 40,000 సంఘాలు ఈ బంద్‌లో పాల్గొంటాయని సీఏఐటీ సెక్రటరీ జనరల్‌ ప్రవీణ్‌ ఖండేల్వాల్‌ ప్రకటించారు. దాదాపు కోటి మంది దాకా ఉన్న లారీ యజమానుల సంఘం, అఖిల భారత రవాణా సంక్షేమ సంఘం కూడా ఈ బంద్‌కు మద్దతిస్తున్నాయని ఆయన తెలిపారు