Regional Ring Road: రంజుగా మారుతున్న రింగు రోడ్డు రాజకీయం.. పోటాపోటీగా వ్యూహాలు..ఎమ్మెల్సీ ఎన్ని‘కలలు’

ఆర్.ఆర్.ఆర్. ఇకపై ఇది తెలంగాణలో తరచూ వినిపించబోతున్న మాట. ప్లానింగ్ దగ్గర్నించి.. నిర్మాణం దాకా.. ప్రతీ సందర్భం ఇక పొలిటికలే. ఎమ్మెల్సీ ఎన్నికలతో ప్రారంభమై వచ్చే అసెంబ్లీ ఎలెక్షన్ల దాకా సాగనున్న వాదోపవాదాలకు ఈ అంశమిక కీలకం కానున్నదనడానికి సోమవారం బీజం పడింది.

  • Rajesh Sharma
  • Publish Date - 7:53 pm, Mon, 22 February 21
Regional Ring Road: రంజుగా మారుతున్న రింగు రోడ్డు రాజకీయం.. పోటాపోటీగా వ్యూహాలు..ఎమ్మెల్సీ ఎన్ని‘కలలు’

Politics on Regional Ring Road: తెలంగాణ రాజకీయం రోజు రోజుకు మహా రంజుగా మారుతోంది. తాజాగా రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రోడ్డు రాజకీయాలు మొదలయ్యాయి. అదే రింగు రోడ్డు రాజకీయం జోరందుకుంది. తెలంగాణ భవిష్యత్తుకు ఎంతో కీలకంగా మారుతున్న రీజినల్ రింగు రోడ్డు ఘనత తమదంటే తమదని చాటుకునేందుకు ప్రయత్నాలు మెల్లిగా మొదలయ్యాయి. ఇప్పటికిప్పుడు రీజినల్ రింగు రోడ్డు ప్రస్తావన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కనిపించనప్పటికీ తాజాగా జరిగిన పరిణామాలు మాత్రం దీనిని ఎన్నికల అస్త్రంగా మార్చుకునే ప్రయత్నాలు మొదలైనట్లు సంకేతాల్నిచ్చాయి.

తెలంగాణ రాజధాని హైదరాబాద్ మహానగరానికి ఇప్పటికే రెండు రింగు రోడ్డులున్నాయి. ఇందులో ఒకటి ప్రస్తుతం సిటీ రోడ్లలో అంతర్భాగం కాగా.. మరొకటి కూడా పలు చోట్ల సిటీ ఎక్స్‌పాన్షన్‌లో నగరానికి చేరువుతోంది. జాతీయ రహదారులు పయనించే మార్గాలలో ఇప్పటికే రింగు రోడ్డు దాకా సిటీ విస్తరించింది. దాంతో నగరానికి మరో పెద్ద రింగు రోడ్డు అవసరమని ప్రభుత్వం భావించింది. నిజానికి రీజినల్ రింగు రోడ్డు ప్రస్తావని పదేళ్ళ క్రితమే వచ్చినా.. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వంలో దీని ప్రస్తావన పెరిగింది. ప్రయత్నాలు కూడా ఊపందుకున్నాయి.

మహానగరానికి దాదాపు 50 కిలో మీటర్ల రేంజ్‌తో రీజినల్ రింగు రోడ్డు ప్రతిపాదనలు రూపొందాయి. మహానగరానికి ఉత్తరం వైపున సంగారెడ్డి-చౌటుప్పల్ వయా నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, జగదేవ్‌పూర్, భువనగిరి పట్టణాల మీదుగా ప్లాన్ చేశారు. దీని నిర్మాణానికి సుమారు పది వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని అంఛనాలు రూపొంచారు. దీనికి జాతీయ రహదారిగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ విషయమై ఢిల్లీ వెళ్ళిన ప్రతీ సారి ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రానికి నివేదించి వచ్చారు.

అదే సమయంలో తెలంగాణ బీజేపీ నేతలు కూడా హైదరాబాద్ మహానగరానికి ఉత్తరం వైపున నిర్మాణమయ్యే సంగారెడ్డి-చౌటుప్పల్ రీజినల్ రింగు రోడ్డును జాతీయ రహదారిగా గుర్తించాలని కేంద్ర ఉపరితల రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని పలు సందర్భాలలో కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నమైతేనేం.. బీజేపీ నేతలే చొరవ అయితేనేం రీజినల్ రింగు రోడ్డు ఉత్తర భాగాన్ని జాతీయ రహదారిగా కేంద్రం గుర్తించింది. ఈ మేరకు 2017లోనే ఉత్తర్వులు జారీ అయ్యాయి. జాతీయ రహదారి 161ఏఏ (NH-161AA) నెంబర్‌ను కూడా అప్పట్లోనే కేటాయించారు.

ఇక హైదరాబాద్ మహానగరానికి దక్షిణ భాగాన చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి (కంది) వరకు నిర్మాణమయ్యే రీజినల్ రింగు రోడ్డు సౌత్ పార్ట్‌ను కూడా జాతీయ రహదారిగా గుర్తించాలన్న డిమాండ్‌ను కేంద్రం ముందుంచారు టీఆర్ఎస్ ఎంపీలు, బీజేపీ నేతలు. చౌటుప్పల్ (జాతీయ రహదారి 65) , షాద్ నగర్ (జాతీయ రహదారి 44), సంగారెడ్డి (జాతీయ రహదారి 65) వరకు దక్షిణ భాగ రీజినల్ రింగు రోడ్డు నిర్మాణానికి 6 వేల 481 కోట్లు ఖర్చవుతాయని అంఛనా వేస్తున్నారు. దీనిని జాతీయ రహదారిగా నోటిఫై చేయాల్సి వుంది. హైదరాబాద్ మహానగరం చుట్టూ రీజినల్ రింగు రోడ్డు నిర్మాణానికి మొత్తం 17 వేల కోట్ల రూపాయలు (ఉత్తర భాగానికి పదివేల కోట్లకు పైగా + దక్షిణ భాగానికి 6,481 కోట్లు కలిపి) ఖర్చు అవుతాయని ప్రాథమిక అంఛనా. అయితే, మొత్తం రింగు రోడ్డును ఒక యూనిట్‌గా మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం దక్షిణ భాగానికి ఇంకా జాతీయ రహదారిగా గుర్తింపు నివ్వకపోవడమేంటని టీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో కేంద్రాన్ని వారు తప్పుపడుతున్నారు. దాంతో రీజినల్ రింగు రోడ్డు వ్యవహారం ఎమ్మెల్సీ ఎన్నికల అంశంగా మారుతోంది.

రాజకీయ ప్రచారాస్త్రంగా ఆర్.ఆర్.ఆర్.

రీజనల్ రింగ్ రోడ్డుతో తెలంగాణ ముఖచిత్రం మారుతుందన్నది నిర్వివాదాంశం. మొత్తం దాదాపు 17 వేల కోట్ల రూపాయల ఖర్చుతో ఆర్.ఆర్.ఆర్. ప్రాజెక్ట్ నిర్మాణం జరుగనున్నది. అయితే ఈ విషయం ఇపుడు ఎమ్మెల్సీ ఎన్నికల అంశంగా మారబోతున్న సంకేతాలు సోమవారం వ్యక్తమయ్యాయి. న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి సారథ్యంలో కలిసిన తెలంగాణ బీజేపీ నేతల బృందం రీజినల్ రింగు రోడ్డును మంజూరు చేసినందుకు ఆయనకు కృతఙ్ఞతలు తెలిపారు. కిషన్ రెడ్డి సారథ్యంలోని ఈ బృందంలో బీజేపీ ఓబీసీ సెల్ జాతీయ కన్వీనర్ డా. కే. లక్ష్మణ్, మాజీ మంత్రి డీకే అరుణ వున్నారు.  ఇదే క్రమంలో బంతిని రాష్ట్ర ప్రభుత్వం కోర్టులోకి నెట్టారు కమలనాథులు. తెలంగాణ ప్రభుత్వం భూసేకరణ చేసిస్తే, మూడేళ్ళలో ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి గడ్కరీ చెప్పినట్లు కిషన్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. తద్వారా ఆర్.ఆర్.ఆర్. నిర్మాణంలో జాప్యం జరిగితే అది రెండు పార్టీల మధ్య సమస్య మీరంటే మీరన్న వాదనకు దారి తీయడం ఖాయంగా కనిపిస్తోంది.

ప్రస్తుతం పట్టభద్రుల ఎన్నికలు జరుగుతున్న ఏరియాలోనే ఈ రీజినల్ రింగు రోడ్డు వుంది. ఈ రోడ్డు నిర్మాణంతో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాలతోపాటు నల్గొండ, వరంగల్, మెదక్ ఉమ్మడి జిల్లాలకు ఉపయోగకరంగా వుంటుంది. ఈ ప్రాంతంలోని గ్రాడ్యుయేట్లకు ఉపాధి కల్పించడంలో ఈ ఆర్.ఆర్.ఆర్. కీలకం కాబోతోంది. ఈ క్రమంలో దీని ప్రతిపాదనను టీఆర్ఎస్.. మంజూరును బీజేపీ తమకు అనుకూలంగా మలచుకునే సంకేతాలు ప్రస్తుతం ప్రస్ఫుటమయ్యాయి. ఒకవేళ వచ్చే ఎన్నికల (2023 అసెంబ్లీ) నాటికి ఈ రీజినల్ రింగు రోడ్డు నిర్మాణం పూర్తి కాకపోతే అప్పటికీ కూడా ఇదే ఎన్నికల అంశంగా మారే పరిస్థితి వుంది. భూసేకరణను సకాలంలో పూర్తి చేస్తే నిర్మాణ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించని కేంద్రాన్ని తప్పు పట్టొచ్చు. అదే సమయంలో భూసేకరణ నిర్ణీత కాలంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయకపోతే.. బీజేపీకి అదో అస్త్రంగా మారే పరిస్థితి వుంది.

మొత్తానికి ఆర్.ఆర్.ఆర్. (రీజినల్ రింగు రోడ్డు) నిర్మాణం ఇకపై తెలంగాణలో వచ్చే ప్రతీ ఎన్నికలోను రాజకీయ పార్టీలకు ప్రచారాస్త్రంగా మారే సంకేతాలు కనిపిస్తున్నాయి. నిర్మాణం పూర్తయితే అభివృద్ధికి ఎంత మేరకు ఉపయోగపడుతుందో.. నిర్మాణం పూర్తయ్యే దాకా రాజకీయ పార్టీలకు ఆర్.ఆర్.ఆర్. ప్రచారాస్త్రంగా ఉపయోగపడే పరిస్థితి ప్రస్ఫుటంగా కనిపిస్తూవుంది.

Also Read: ఏపీ పంచాయితీ పోరులో సిత్రాలెన్నో!

Also Read: ఓకే అడ్రస్‌తో ఏకంగా 70 పాస్‌పోర్టులు.. షాకింగ్ విషయమేంటంటే?

Also Read: ఆయుధ సంపత్తిలో దూసుకెళ్తున్న భారత్.. సామర్థ్యం తెలిస్తే షాకే!