AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Passport Scam: ఓకే అడ్రస్‌తో ఏకంగా 70 పాస్‌పోర్టులు.. తీగ లాగితే కదులుతున్న డొంక.. షాకింగ్ విషయమేంటంటే?

తెలంగాణలో ఓ పాస్ పోర్టు స్కామ్ వెలుగు చూసింది. వివరాలను పరిశీలించిన తెలంగాణ పోలీసులు ఉలిక్కి పడ్డారు. ఈ స్కామ్‌లో ఏకంగా ఇద్దరు పోలీసు అధికారులను అరెస్టు చేశారు. పలువురు బంగ్లాదేశీలకు సహకరించినట్లు వారిపై అభియోగాలు నమోదయ్యాయి.

Passport Scam: ఓకే అడ్రస్‌తో ఏకంగా 70 పాస్‌పోర్టులు.. తీగ లాగితే కదులుతున్న డొంక.. షాకింగ్ విషయమేంటంటే?
Rajesh Sharma
|

Updated on: Feb 22, 2021 | 4:50 PM

Share

Passport scam jolts Telangana police: తీగ లాగితే డొంక కదులుతోంది. పాస్‌పోర్టుల జారీలో పోలీసు లింకులు వెల్లడవుతున్నాయి. తప్పుడు పత్రాలతో బంగ్లాదేశీయులకు తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచి పాస్‌పోర్టులిప్పించిన అవినీతి పోలీసు అధికారుల గుట్టు రట్టవుతోంది. ఈ విషయాలను ఏకంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జన్నార్ స్వయంగా బయట పెట్టడం విశేషం. హైదరాబాద్ సహా తెలంగాణ అక్రమంగా దేశంలోకి చొరబడ్డ బంగ్లాదేశీయుల అడ్డాగా మారిందన్న సంకేతాలు తాజా పాస్‌పోర్టుల కుంభకోణంతో వెలువడుతున్నాయి. ఈ వ్యవహారంలో వెల్లడైన, వెల్లడవుతున్న అంశాలతో పోలీసు ఉన్నతాధికారులే నివ్వెర పోతున్నారు.

నిజామాబాద్ జిల్లా బోధన్‌లో రట్టయిన పాస్‌పోర్టుల స్కామ్‌ వివరాలను సీపీ సజ్జన్నార్ సోమవారం హైదరాబాద్‌లో మీడియాకు వెల్లడించారు. ‘‘ తప్పుడు పత్రాలు పెట్టి పాస్ పోర్టులను తీసుకున్నారు.. ఓకే ఇంటిపై 70కి పైగా పాస్ పోర్ట్ జారీ అయ్యాయి.. పోలీస్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే పాస్ పోర్టులు జారీ అయినట్టుగా గుర్తించాం.. పాస్ పోర్టుల జారీలో పోలీసుల పాత్రపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నాం.. ఇప్పటికే ఇద్దరు పోలీసు అధికారులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించాము.. నలుగురు బంగ్లాదేశీయులను కూడా అరెస్టు చేశాం.. తప్పుడు పత్రాలతో బంగ్లాదేశీయులు తెలంగాణలోని పలు ప్రాంతాలలో పాస్ పోర్టులు తీసుకున్నారు .. శంషాబాద్ విమానాశ్రయం నుంచి విదేశాలకు వెళ్లి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా పాస్ పోర్టులను గుర్తించాం.. పాస్ పోర్టులను సీజ్ చేసి విచారించడంతో బోధన్ లింకు బయటపడింది.. నిజామాబాద్ జిల్లా బోధన్‌లో ఇంకా ఎవరెవరు తప్పుడు పత్రాలతో పాస్ పోర్టులు తీసుకున్నారన్న దానిపై విచారణ జరుపుతున్నాం.. తప్పుడు పత్రాలతో పాస్ పోర్టులు తీసుకున్న వారు దేశం దాటి బయటికి వెళ్లకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నాం.. ఇప్పటికే కొన్ని లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేశాం..’’ అని సీపీ సజ్జన్నార్ వివరించారు.

తప్పుడు పత్రాలతో పాస్ పోర్టుల జారీ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోంది. ఇందు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు. పాస్‌పోర్టుల వ్యవహారంలో ఇప్పటివరకు ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో నలుగురు బంగ్లాదేశీయులుకాగా.. ఒకరు బెంగాల్, ఒకరు ఏజెంట్, ఇద్దరు స్పెషల్ బ్రాంచ్ అధికారులు అరెస్ట్ అయ్యారు. నిజానికి బంగ్లాదేశ్ నుంచి అక్రమ మార్గాల్లో హైదరాబాద్ చేరుకునే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోందని పలు మార్లు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. తాజాగా వెల్లడైన పాస్ పోర్టుల వ్యవహారంతో ఇది ధృవీకరణ అయ్యింది. అక్రమంగా బంగ్లా బోర్డర్ దాటే వారికి అక్కడే ఆధార్ కార్డులు జారీ చేసేంతటి వ్యవస్థ వుందని పలు సందర్భాలలో వెల్లడైంది.

తాజాగా వెల్లడైన వ్యవహారానికి సంబంధించి మొత్తం 72 పాస్‌పోర్టులను ఇప్పటివరకు గుర్తించారు. తప్పుడు పత్రాలతో పాస్‌పోర్టులను పొందినట్లు వెల్లడైంది. ఇమ్మిగ్రేషన్, రీజనల్ పాస్‌పోర్టు అధికారులను పోలీసులు అప్రమత్తం చేశారు. ఇప్పటి వరకు ఎంత మంది దేశం దాటి వెళ్ళారు.. ఎంత మంది పాస్‌పోర్టులను పొందారు అనే కోణంలో పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు జరుపుతున్నారు. అరెస్టు చేసిన వారిని కస్టడీకి తీసుకుని విచారిస్తే మరిన్ని వివరాలు వెల్లడవుతాయని పోలీసు అధికారులు చెబుతున్నారు. అధికారులు, స్థానికుల పాత్రపై కూడా పోలీసులు దృష్టి సారించారు. బంగ్లాదేశ్ నుంచి అక్రమ మార్గంలో తెలంగాణకు వచ్చి.. ఇక్కడ ధృవీకరణ పత్రాలు పొందిన వారికి స్థానికంగా సహకరించిన అధికారులు, ప్రజల గురించి కూడా పోలీసులు కూపీ లాగుతున్నారు.

అయితే, పాస్‌పోర్టుల వెరిఫికేషన్ వ్యవస్థలో లోపాలు తాజా ఉదంతంతో మరో సారి బట్టబయలైంది. తూతూ మంత్రంగా వెరిఫికేషన్ చేస్తున్న స్పెషల్ బ్రాంచ్ పోలీసులపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాస్‌పోర్టు వెరిఫికేషన్ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళణ చేయాలని ఉన్నతాధికారులు కసరత్తు మొదలు పెట్టినట్లు సమాచారం. అక్రమార్కులను ఆదిలోనే గుర్తించేలా పాస్‌పోర్టు వెరిఫికేషన్ విభాగాన్ని అప్‌గ్రేడ్ చేయాలని పలువురు పోలీసు యంత్రాంగానికి సూచిస్తున్నారు.

Also Read: పంచాయితీ ఎన్నికల గణాంకాల కన్‌ఫ్యూజన్.. స్టేట్ ఎలెక్షన్ కమిషన్ క్లారిటీ.. తాజా లెక్కలివే!

Also Read: పుదుచ్ఛేరి అనూహ్య పరిణామాలు.. నెక్స్ట్ జరిగేది ఇదే!

Follow Us