AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Puducherry Politics: పుదుచ్ఛేరి అనూహ్య పరిణామాలు.. కుప్పకూలిన కాంగ్రెస్ సర్కార్.. నెక్స్ట్ జరిగేది ఇదే!

పుదుచ్ఛేరిలో నెక్స్టేంటి? బీజేపీ దన్నుగా వున్న విపక్షం అధికార పగ్గాలు చేపడుతుందా? లేక రాష్ట్రపతి పాలనలోనే మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలకు వెళతారా? ఈ చర్చ ఇపుడు పుదుచ్ఛేరిలో హాట్ హాట్‌గా జరుగుతోంది.

Puducherry Politics: పుదుచ్ఛేరి అనూహ్య పరిణామాలు.. కుప్పకూలిన కాంగ్రెస్ సర్కార్.. నెక్స్ట్ జరిగేది ఇదే!
Rajesh Sharma
| Edited By: |

Updated on: Mar 04, 2021 | 2:18 PM

Share

Political stunts in Puducherry Assembly: అనుకున్నంత పని అయ్యింది. పుదుచ్ఛేరిలో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలింది. నారాయణ స్వామి కొత్త లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసైకి రాజీనామా సమర్పించారు. దాంతో గత నెల రోజులుగా కొనసాగిన రాజకీయ నాటకానికి తెరపడింది. అయితే.. ఇప్పుడే అసలు గేమ్ మొదలైందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. పుదుచ్ఛేరికి ఇంఛార్జిగా వ్యవహరిస్తున్న తమిళి సై సౌందర్ రాజన్ తీసుకోబోయే తదుపరి నిర్ణయంపైనే తర్వాత గేమ్ తీవ్రత వెల్లడవుతుందని వారంటున్నారు.

కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేల రాజీనామాలతో మైనారిటీలో పడిన నారాయణ స్వామి ప్రభుత్వం.. చివరికి బలపరీక్షకు ముందే కాడి వదిలేసింది. నిన్నటి వరకు విపక్షంలో వున్న అన్నా డిఎంకే కూటమికిపుడు పుదుచ్ఛేరి అసెంబ్లీలో మెజారిటీ కనిపిస్తోంది. మొత్తం 33 మంది సభ్యులున్న అసెంబ్లీలో రాజీనామాల తర్వాత మిగిలిన సంఖ్య 26. కాగా.. ఎన్.ఆర్.కాంగ్రెస్-అన్నాడిఎంకే-బీజేపీ కూటమికి 14 మంది సభ్యుల బలం వుంది. మరి మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్నా డిఎంకే-బీజేపీ కూటమి అధికార పగ్గాలు చేపడుతుందా? లేక రాష్ట్రపతి పాలనలోనే ఎన్నికలు జరుగుతాయా ? ఈ రెండు దారులు కాకుండా మూడో దారి ఇంకోటి వుందా? అన్న విషయం ఇపుడు ఆసక్తికరంగా మారింది.

పుదుచ్చేరిలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రభుత్వం కుప్పకూలింది. అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవడంలో సీఎం నారాయణస్వామి విఫలమయ్యారు. సరైన సంఖ్యాబలం లేకపోవడంతో సోమవారం (ఫిబ్రవరి 22న) విశ్వాస పరీక్ష జరగలేదు. విశ్వాస పరీక్షకు వెళ్లకుండానే సభ నుంచి ముఖ్యమంత్రి నారాయణ స్వామి వెళ్ళి పోయారు. నేరుగా లెఫ్టినెంట్ గవర్నర్ తమిళి సైని కలిసి తన రాజీనామాను సమర్పించారు నారాయణ స్వామి.

నిజానికి అనూహ్య పరిణామాల మధ్య కొత్తగా లెఫ్టినెంట్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తెలంగాణ గవర్నర్ తమిళిసై.. సీఎం నారాయణ స్వామిని బల నిరూపణకు ఆదేశించారు. దాంతో బలపరీక్ష కోసం పుదుచ్చేరి అసెంబ్లీ ప్రత్యేకంగా సోమవారం సమావేశమైంది. సభ ప్రారంభమైన వెంటనే విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు సిఎం నారాయణ స్వామి. అయితే.. ఆ తీర్మానంపై ఓటింగ్‌ జరగకముందే సభ నుంచి సీఎం బయటికి వెళ్ళిపోయారు. దాంతో విశ్వాస తీర్మానం వీగిపోయినట్లు స్పీకర్‌ వీపీ శివకొలుందు ప్రకటించారు. ఆ వెంటనే పరిణామాలు వేగంగా చోటుచేసుకున్నాయి. తన పదవికి రాజీనామా చేస్తూ లేఖను సిఎం నారాయణ స్వామి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళి సైకు అందజేశారు.

సంఖ్యాబలంలో అనూహ్య మార్పు

ముగ్గురు నామినేటెడ్‌ ఎమ్మెల్యేలు సహా మొత్తం 33 మంది ఎమ్మెల్యేలు పుదుచ్చేరి శాసనసభలో వున్నారు. ఇందులో 15 మంది సభ్యులు కాంగ్రెస్ తరపున ప్రాతినిధ్యం వహించే వారు. వీరిలో ఏడుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. దాంతో మొత్తం సభ్యుల సంఖ్య 26కి పడిపోయింది. అదే సమయంలో కాంగ్రెస్ తరపున మిగిలిన వారి సంఖ్య 10కి (స్పీకర్ సహా) పడిపోయింది. నారాయణస్వామి ప్రభుత్వం గట్టెక్కాలంటే అవసరమైన 14 మంది ఎమ్మెల్యేల మద్దతు అనివార్యమైంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలతోపాటు డిఎంకేకు చెందిన మరో ఎమ్మెల్యే కూడా రాజీనామా చేయడంతో సభలో బలపరీక్ష నెగ్గడం నారాయణ స్వామికి కష్టతరమైంది. దాంతో అనివార్యమైన పరిస్థితిలో నారాయణ స్వామి తనతోపాటు తన కేబినెట్ సభ్యుల రాజీనామా లేఖలను లెఫ్టినెంట్ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్‌కు అంద జేశారు.

అయితే, నారాయణ స్వామి తన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు చివరి క్షణం దాకా ప్రయత్నించారు. ఆయనకు స్పీకర్ శివకొలుందు చక్కని సహకారం అందించారు. బీజేపీకి చెందిన ముగ్గురు నామినేటెడ్ సభ్యులను ఓటింగ్‌కు హాజరయ్యేందుకు స్పీకర్ అనుమతించలేదు. వారికి విశ్వాస పరీక్షలో ఓటేసే హక్కు లేదన్న ముఖ్యమంత్రి నారాయణ స్వామి మాటలతో స్పీకర్ శివకొలుందు ఏకీభవించారు. బీజేపీకి చెందిన నామినేటెడ్ సభ్యలను ఓటింగ్‌కు అనుమతించలేదు.

ఇక రాజీనామాల తర్వాత పుదుచ్ఛేరి శాసనసభలో ఆల్‌ ఇండియా ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ కూటమి మెజారిటీతో కనిస్తోంది. ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ 7, అన్నాడీఎంకే 4, నామినేటెడ్‌ భాజపా ఎమ్మెల్యేలు ముగ్గురు కలిపి సభలో ఈ కూటమి బలం 14గా వుంది. ఈ నేపథ్యంలో పుదుచ్చేరిలో తదుపరి ప్రభుత్వం ఎన్ఆర్ కాంగ్రెస్ కూటమిదా లేక ఎన్నికల తర్వాతనే కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతుందా? అన్నదిపుడు చర్చనీయాంశంగా మారింది. మరో రెండు నెలల కాలంలోనే తమిళనాడు, బెంగాల్, కేరళ రాష్ట్రాలతో కలిసి పుదుచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళబోతోంది. ఈ క్రమంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించడమా? లేక తన పాలనలోనే ఎన్నికలు జరిగేలా చూడడమా అన్నది ఎల్.టీ. తమిళి సై నిర్ణయం మీద ఆధారపడి వుంది.

గవర్నర్ ముందు మూడు అంశాలు

ముఖ్యమంత్రి నారాయణ స్వామి రాజీనామా చేయడంతో పుదుచ్ఛేరి భవిష్యత్తుపై నిర్ణయం తీసుకునే బాధ్యత లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌పై పడింది. ప్రస్తుతం ఎల్.టీ. ముందు ముందు దారులున్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. 26 మంది సభ్యులున్న పుదుచ్ఛేరి అసెంబ్లీలో 14 మందితో పెద్ద కూటమిగా వున్న ఎన్.ఆర్. కాంగ్రెస్-ఏఐఏడిఎంకే-బీజేపీ కూటమికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వడం తొలి దారిగా చెబుతున్నారు. అయితే ఈ రెండు నెలల కోసం ప్రభుత్వంలో కూర్చుని అపఖ్యాతి మూటగట్టుకునేందుకు ఈ కూటమి ప్రాధాన్యతనిస్తుందా అన్నది సందేహమే. అపుడు రెండో దారిగా పుదుచ్ఛేరిలో రాష్ట్రపతి పాలన విధించేలా చర్యలు తీసుకోవడం కనిపిస్తోంది. ఇక మూడో ప్రాధాన్యతగా పుదుచ్ఛేరి అసెంబ్లీని ఎన్నికలు ముగిసి తదుపరి అసెంబ్లీ ఏర్పాటయ్యే దాకా సుప్తచేతనావస్థలో వుంచడం. ఈ మూడు దారుల్లో తమిళి సై దేనికి మొగ్గు చూపుతారనేది త్వరలోనే తేలిపోనున్నది.

Also Read: పంచాయితీ ఎన్నికల గణాంకాల కన్‌ఫ్యూజన్.. స్టేట్ ఎలెక్షన్ కమిషన్ క్లారిటీ.. తాజా లెక్కలివే!