Suryapet Spurious Seeds: రైతులను నిలువన ముంచుతున్న కేటుగాళ్లు.. సూర్యాపేటలో రూ.13 కోట్ల విలువైన నకిలీ విత్తనాలు సీజ్
ప్రభుత్వం ఎన్ని పగడ్భందీ చర్యలు తీసుకున్నా .. కేటుగాళ్లు దొంగ దారి వెతుకుతూనే ఉన్నారు. అధికారుల అప్రమత్తంగా భారీ నకిలీ విత్తనాల ముఠా గుట్టురట్టైంది.
Suryapet Spurious Seeds Seized: ప్రభుత్వం ఎన్ని పగడ్భందీ చర్యలు తీసుకున్నా .. కేటుగాళ్లు దొంగ దారి వెతుకుతూనే ఉన్నారు. అధికారుల అప్రమత్తంగా భారీ నకిలీ విత్తనాల ముఠా గుట్టురట్టైంది. ఒకటి కాదు రెండు కాదు రూ.13కోట్ల విలువైన నకిలీ విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ విత్తనాల దందా చేస్తున్న పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. సూర్యాపేట జిల్లాల్లో దాడులు చేసి భారీ మొత్తంలో విత్తనాలను సీజ్ చేశారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు, లైసెన్స్ లేకుండా మిరప విత్తనాలను విక్రయిస్తున్న ముఠాను గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిర్చి నకిలీ విత్తనాలు వాటి విలువ సుమారుగా రూ.13 కోట్ల ఉంటుందని పోలీసులు తెలిపారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా విత్తనాలను రైతులకు అంటగడితే చూస్తు ఊరుకోమని పోలీసులు హెచ్చరించారు.
ఆరుగాలం శ్రమకు ఫలితం దక్కాలంటే ఆది నుంచి అన్నదాత అన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. కొందరు డీలర్లు నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు విక్రయిస్తూ రైతులను నట్టేట ముంచుతున్నారు. వానాకాలం సాగుకు సన్నద్ధం అవుతున్న రైతులు జాగ్రత్తగా ఉండాలంటున్నారు వ్యవసాయాధికారులు, శాస్త్రవేతలు. అధికారులు కూడా నకిలీ విత్తనాలు, ఎరువుల విక్రయాలపై నిఘా పెంచారు. అయినా నకిలీ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ప్రభుత్వం కూడా నకిలీ విత్తనాల విక్రేతలపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని ఆదేశించింది. అయినా రైతుల అమాయకత్వాన్ని కొంత మంది సొమ్ము చేసుకుంటున్నారు.