కల్తీక కమాల్‌, పైన పెట్రోల్‌.. కింద వాటర్‌.! నీచపు పనులకు అప్ డేట్ అయిన పెట్రోల్‌ బంక్‌ ఓనర్స్‌

పెట్రోల్‌ బంక్‌ ఓనర్స్‌ అప్ డేట్ అయ్యారు. ఇన్నిరోజులు కిరోసిన్‌ కలిపి పెట్రోల్ విక్రయించిన బంకులు.. ఇప్పుడు టెక్నాలజీ వాడి వినియోగదారులను..

కల్తీక కమాల్‌, పైన పెట్రోల్‌.. కింద వాటర్‌.! నీచపు పనులకు అప్ డేట్ అయిన పెట్రోల్‌ బంక్‌ ఓనర్స్‌
Follow us

|

Updated on: Dec 20, 2020 | 8:39 AM

పెట్రోల్‌ బంక్‌ ఓనర్స్‌ అప్ డేట్ అయ్యారు. ఇన్నిరోజులు కిరోసిన్‌ కలిపి పెట్రోల్ విక్రయించిన బంకులు.. ఇప్పుడు టెక్నాలజీ వాడి వినియోగదారులను నిండా ముంచుతున్నారు. మిషన్‌లలో చిప్‌లను అమర్చి చీట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 22 బంకులను, తెలంగాణ 13 బంకులను సీజ్‌ చేశారు పోలీసులు. ఏపీ, తెలంగాణలోని పెట్రోల్‌ బంకుల్లో జరుగుతున్న ఘరానా మోసాన్ని బయటపెట్టారు. ఈ కేసులో నలుగురు సభ్యులు గల అంతరాష్ట్ర దొంగల ముఠాతో పాటు రెండు రాష్ట్రాల్లో కలిపి 31 మంది యజమానులను అరెస్టు చేశారు. తెలంగాణలో ఇంకా ఐదుగురు యజమానులు పరారీలో ఉండగా వారి కోసం గాలింపు చేపట్టారు.. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు ఈ మోసంలో ముంబాయి నుంచి చిప్‌లు విక్రయిస్తునట్లు తెలిసింది..విచారణ ముమ్మరం చేయగా తీగలాగితే డొంకంతా కదిలింది..ఇప్పుడు మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి 2014లోను పోలీసుల చేతికి చిక్కి మళ్లీ బయటికి వచ్చిన తరువాత ఇదే దందా కొనసాగిస్తున్నట్లు తేలింది.

పెట్రోల్‌బంకుల్లో మోసపూరితంగా చిప్‌లు అమర్చి వినియోగదారులను బురిడీ కొట్టిస్తున్న ముఠా సూత్రధారి శిబు థామస్‌ చాలా కాలంగా యథేచ్ఛగా ఇదే దందా సాగిస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల్లోని పలు పెట్రోల్‌బంకులకు ఏళ్ల తరబడి అతడు ఆ చిప్‌లను సరఫరా చేస్తున్నాడు.. తాజా మోసంలో ముంబయి నుంచి చిప్‌లు విక్రయించింది ఇతడే అని సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసుల దర్యాప్తులో తేటతెల్లమైంది. ఇదే మోసానికి పాల్పడి అతడు 2014లో ఎస్‌వోటీ బృందానికి చిక్కాడు. తర్వాత ఆ వ్యవహారం మరుగున పడిపోవడంతో మళ్లీ ఈ అక్రమ దందా కొనసాగిస్తున్నాడు. దాదాపు 70 బంకుల్లో మోసపూరిత చిప్‌లు అమర్చారని అప్పట్లో సైబరాబాద్‌ పోలీసులు ప్రాథమికంగా గుర్తించడంతో రాష్ట్రవ్యాప్తంగా తూనికల విభాగం వారు సోదాలు చేశారు. కానీ పోలీసుల దర్యాప్తునకు భిన్నంగా రంగారెడ్డి, మెదక్‌ జిల్లాలోని రెండు బంకుల్లో మాత్రమే చిప్‌లు అమర్చారని వారు తేల్చారు. మొత్తం మీద అప్పటి కేసు నీరుగారిపోయింది.

దీంతో శిబు మరోసారి యథేచ్ఛగా దందా సాగించాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, పెట్రోల్‌ బంకుల్లో హైటెక్‌ మోసాలకు పాల్పడుతున్నారు. తక్కువ పెట్రోలు వచ్చే విధంగా ఎలక్ట్రానిక్ చిప్స్ అమర్చి వాహనదారుల్ని మోసం చేస్తున్నారు. ఏపీ,తెలంగాణలో లీగల్ అండ్ మెట్రాలజీ శాఖ, పోలీసులు ఏక కాలంలో చేసిన దాడుల్లో ఈ గోల్‌మాల్‌ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. లీటర్ పెట్రోల్ పోయించుకుంటే రీడింగ్ కరెక్ట్‌గానే చూపించినా, బంకు యజమానులు అమర్చిన చిప్ వల్ల 40 మిల్లీలీటర్లు తక్కువగా వస్తోంది. ఈ విషయం తెలియని లక్షలాది మంది వినియోగదారులు దారుణంగా మోసపోతున్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి, చిత్తూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో పెట్రోల్‌ బంక్‌ యజమానులు ఇలా హైటెక్‌ మోసాలకు పాల్పడుతున్నారు.