Hyderabad: వద్దురా నాయనా సర్కారీ దవాఖాన.. వైద్యం కోసం వచ్చిన రోగికి ఊహించని ట్విస్ట్!
అనారోగ్యం ఒకవైపు.. ఆర్థిక ఇబ్బందులు మరోవైపు.. ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకునే స్థోమత లేక ప్రభుత్వ ఆస్పత్రిని ఆశ్రయిస్తే అక్కడ మరో కొత్త సమస్య ఎదురైందంటూ ఓ రోగి ఆవేదన వ్యక్తం చేశాడు. హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో తనకు ఎదురైన అనుభవాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.

తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో రోగులు ఉస్మానియా ఆస్పత్రికి వస్తుంటారు. ముఖ్యంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ప్రభుత్వ ఆస్పత్రులే ప్రధాన ఆధారం. అలాంటి ఆస్పత్రిలో చికిత్స కోసం వచ్చిన ఓ రోగి నుంచి డబ్బులు డిమాండ్ చేశారన్న ఆరోపణలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల ఓ వ్యక్తి ఉస్మానియా హాస్పిటల్‌లో వైద్యం చేయించుకునేందుకు వచ్చాడు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో అక్కడి సిబ్బందిలో ఒకరు తనను డబ్బుల కోసం ఇబ్బంది పెట్టారని.. ఏకంగా రూ.2 వేల వరకు ‘దక్షిణ’ ఇవ్వాలని, ఆ డబ్బులతో దావత్ చేసుకుంటానని అడిగినట్లు బాధితుడు వీడియోలో ప్రస్తావించాడు.
ఇప్పటికే అనారోగ్యంతో బాధపడుతూ, వైద్యం కోసం ఇబ్బందులు పడుతున్న సమయంలో ఇలా డబ్బులు అడగడం తనను మరింత బాధకు గురిచేసిందని రోగి ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు ఎదురైన పరిస్థితిని మొబైల్‌లో రికార్డు చేసి సోషల్ మీడియాలో పంచుకున్నాడు.
వద్దురా నాయనా సర్కారీ దవాఖాన’ అంటూ ఆవేదన
ప్రభుత్వ ఆస్పత్రిలో ఉచితంగా లేదా తక్కువ ఖర్చుతో వైద్యం అందుతుందనే ఆశతో వచ్చిన తనకు ఇలాంటి పరిస్థితి ఎదురైందంటూ బాధితుడు కన్నీటి పర్యంతమయ్యాడు. ‘వద్దురా నాయనా సర్కారీ దవాఖాన’ అంటూ తన ఆవేదనను వ్యక్తం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
వైద్యం కోసం వచ్చినవారి నుంచి ‘దక్షిణ’ ఎందుకు..?
అయితే సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన జనాలు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స ఖర్చులు భరించలేక.. ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే పేద, మధ్యతరగతి కుటుంబాల నుంచి సిబ్బంది ఇలా డబ్బులు డిమాండ్ చేయడం దారుణమని.. ఇలాంటి ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
