మహరాష్ట్రలో ఆగస్టు 31 వరకు లాక్‌డౌన్

కరోనా వ్యాప్తి కారణంగా లాక్ డౌన్ దిశగా నగరాలు అడుగులు వేస్తున్నాయి. ఒకవైపు కరోనా టెస్టులు వేగంగా చేపడుతూనే మరోవైపు కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న నగరాలను గుర్తించి లాక్ డౌన్ ఆంక్షలను అమలు చేస్తున్నాయి.

  • Balaraju Goud
  • Publish Date - 3:42 pm, Mon, 10 August 20
మహరాష్ట్రలో ఆగస్టు 31 వరకు లాక్‌డౌన్

ప్రపంచమంతా కరోనా వైరస్ విస్తరించింది. కరోనా విజృంభణతో ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. రాష్ట్రాల వారీగానూ కరోనా వైరస్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతున్నాయి. భారతదేశంలోనూ కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటివరకూ భారత్‌లో కరోనా కేసుల సంఖ్య ఇరవై లక్షలు దాటేసింది. కరోనా నియంత్రణకు ఎన్ని చర్యలు తీసుకున్నా కొత్త పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా కట్టడి చేసేందుకు మరోసారి లాక్ డౌన్ విధించక తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్రాలు లాక్ డౌన్ విధించాలనే నిర్ణయంతో చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నాయి.

లాక్ డౌన్ దిశగా నగరాలు అడుగులు వేస్తున్నాయి. ఒకవైపు కరోనా టెస్టులు వేగంగా చేపడుతూనే మరోవైపు కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న నగరాలను గుర్తించి లాక్ డౌన్ ఆంక్షలను అమలు చేస్తున్నాయి. వ్యవసాయ పనులు, అత్యవసర సర్వీసులు, సేవలకు మాత్రం మినహాయింపు ఇస్తున్నాయి. తాజాగా మహరాష్ట్రలో ఆగస్టు 31 వరకు లాక్‌డౌన్ కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అధికంగా కరోనా కేసులు నమోదుకావడమే ఇందుకు కారణమని, వాటిని అదుపు చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు తేల్చి చెప్పారు. పూణే, ముంబై, సోలాపూర్, మాలేగావ్, ఔరంగాబాద్, నాసిక్, ధులే, జల్‌గావ్, అకోలా, అమరావతి, నాగ్‌పూర్‌లలో లాక్‌డౌన్‌ పొడిగించనున్నట్లు పేర్కొంది ఆ రాష్ట్ర ప్రభుత్వం.

రాష్ట్రంలో లాక్‌డౌన్ అమలులో ఉన్నప్పటికీ ప్రజల అవసరాల దృష్ట్యా మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్‌లు తెరిచేందుకు అనుమతిస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7గంటల వరకు వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని చెప్పారు. అయితే రెస్టారెంట్లు, సినిమా థియేటర్లకు మాత్రం అనుమతిలేదని ప్రకటించారు. అత్యవసరాలకు మాత్రమే జనం బహిరంగ ప్రదేశాల్లోకి రావాలని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు నిబంధనలు పాటించని వారిపట్ల కఠినంగా వ్యవహారించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇదిలావుంటే ఇక, మహారాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం కేసులు 5 లక్షల పైగా నమోదయ్యాయి. కరోనా బారిన పడి దాదాపు 17,367 మంది మృత్యువాతపడ్డారు.