28 ఏళ్ల క్రితం పాక్ వెళ్లి జైలుపాలు.. బతికుండగా భారత వస్తాననుకోలేదంటూ కన్నీటి పర్యంతం
సరదాగా కొన్ని రోజులు పాకిస్తాన్ చూసి వద్దామనుకున్న వ్యక్తి, అనుకోకుండా.. అక్కడే ఇరుక్కుపోయాడు..
సరదాగా కొన్ని రోజులు పాకిస్తాన్ చూసి వద్దామనుకున్న వ్యక్తి, అనుకోకుండా.. అక్కడే ఇరుక్కుపోయాడు.. దీంతో.. అతనిని తీసుకువెళ్లి పాకిస్తాన్ జైలులో పడేశారు. ఎట్టకేలకు దాదాపు 30 సంవత్సరాల తర్వాత పాకిస్తాన్ వదిలి స్వదేశానికి రాగలిగాడు. భారత్‌కు తిరిగి వచ్చిన వ్యక్తికి స్థానికులు, పోలీసులు పూల మాలలతో ఘనస్వాగతం పలికారు. స్వదేశంలో తనకు లభించిన ఆత్మీయత, ఆదరణ చూసి ఆ వ్యక్తి ఏకధాటిగా కన్నీరు కార్చాడు.ఈ సంఘటన కాన్పూర్ లో చోటుచేసుకుంది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ ప్రాంతానికి చెందిన షంసుద్దీన్(70) 1992లో 90 రోజుల వీసా మీద పాకిస్తాన్ వెళ్లాడు. ఆ తర్వాత 1994లో పాక్ పౌరసత్వం పొంది అక్కడే స్థిరపడ్డాడు. కొన్నేళ్లు బాగానే గడిచింది. ఆ తర్వాత 2012లో జరిగిన అల్లర్లలో అనుహ్యంగా షంసుద్దీన్ అరెస్ట్ అయ్యాడు. గూఢచర్యం ఆరోపణలపై పాక్ అధికారులు అతడిని అదపులోకి తీసుకున్నారు. దీంతో అతన్ని కరాచీ జైలుకు తరలించారు. దాదాపు ఎనిమిదేళ్ల పాటు చేయని నేరానికి జైలుశిక్ష అనుభవించాడు. కాగా, ఈ ఏడాది అక్టోబర్ 26న విడుదల అయ్యాడు. అత్తారీ వాగా సరిహద్దు ద్వారా భారతదేశానికి చేరుకున్నాడు. కొవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో అమృత్‌సర్‌లో 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండి, స్వరాష్ట్రం చేరుకున్నారు షంసుద్దీన్.
కాన్పూర్ నగరంలోని బజారియా పోలీస్‌స్టేషన్ సర్కిల్ ఆఫీసర్ తిర్పురారీ పాండే, షంసుద్దీన్‌కు పూల మాలతో స్వాగతం పలికారు. అనంతరం పోలీసులు అతన్ని కంఘి మోహల్‌లోని తన ఇంటికి తీసుకెళ్లారు. ఆయన రాక కోసం ఎదురుచూస్తున్న స్థానికులు.. పూల మాలలతో ఘన స్వాగతం పలికారు. దశాబ్దాల తరువాత స్వదేశానికి తిరిగి వచ్చినందుకు ఆయనను అభినందించారు. దాదాపు 28 ఏళ్ల పాటు సొంత దేశానికి, పుట్టిన వారికి, ఇంటికి దూరంగా ఉన్న షంసుద్దీన్ స్వస్థలం చేరుకోగానే తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఆత్మీయులను చూసి ఆనందంతో ఏడ్చేశాడు.
పాకిస్తాన్‌లో భారతీయులను చాలా నీచంగా చూస్తారని షంసుద్ధీన్ మీడియాతో తెలిపాడు. వారు మనల్ని శత్రువుల్లా చూస్తారు. పాకిస్తాన్‌లో లంచం, అవినీతి భారీ ఎత్తున ఉందన్నారు. అంతేకాక పాక్ వెళ్లి చాలా పెద్ద తప్పు చేశానని, అక్కడే చనిపోతానేమో అనుకున్నానన్నారు. కానీ అదృష్టం బాగుండి బతికుండగానే నా వారి దగ్గరకు వచ్చాను అని కన్నీటి పర్యంతమయ్యాడు షంసుద్దీన్.