కేంద్ర భద్రతా దళాల పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహించాలి : చంద్రబాబు
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి గత ప్రక్రియను పూర్తిగా రద్దు చేసి మళ్లీ తాజా నోటిఫికేషన్ ఇవ్వాలని... టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి గత ప్రక్రియను పూర్తిగా రద్దు చేసి మళ్లీ తాజా నోటిఫికేషన్ ఇవ్వాలని… టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. పార్టీ ముఖ్య నేతలతో ఆన్లైన్ ద్వారా రివ్యూ నిర్వహించిన చంద్రబాబు… గతంలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గత స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో వైసీపీ బెదిరింపులకు పాల్పడి, తప్పుడు కేసులు పెట్టి బలవంతంగా అభ్యర్థుల చేత విత్డ్రా చేయించిందని ఆరోపించారు. ఆన్లైన్ నామినేషన్లకు అనుమతించటంతో పాటు కేంద్ర భద్రతా దళాల పర్యవేక్షణలో ఎన్నికలు జరపాలన్నారు.
ఎస్ఈసీ ఇటీవల రాష్ట్రంలో వివిధ పార్టీలతో నిర్వహించిన సమావేశంలోనూ… మెజారిటీ పార్టీలు అవే అభిప్రాయాలను వెల్లడించాయని గుర్తుచేశారు. ఈ క్రమంలో సీఎం జగన్‌పై తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు చంద్రబాబు. అమరావతిలో పనులు ఆపిన జగన్ రాష్ట్రానికి, ప్రజలకు మొదటి ద్రోహం చేశారని… పోలవరం ప్రాజెక్టు పనులు నిర్లక్ష్యంగా ఆపేయడం రెండవ ద్రోహమని పేర్కొన్నారు. ఇక ప్రత్యేక హోదా తెస్తానని నమ్మించి మోసం చేయడం జగన్ చేసిన మూడో ద్రోహమని బాబు వెల్లడించారు. 25 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్న వ్యక్తి… 28మంది ఎంపీలు(రాజ్యసభతో కలిపి) ఉన్నా నోరు తెరవక పోవడాన్ని ప్రజలే నిలదీయాలని సూచించారు. తిరుపతి పార్లమెంటు ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని… జగన్మోహన్ రెడ్డి పతనం తిరుపతి నుంచే ప్రారంభం కావాలని నాయకులకు, కార్యకర్తలకు బాబు పిలుపునిచ్చారు.