డిసెంబర్‌లో లక్ష్మణ్‌కు చెక్.. వారసుడెవరంటే?

తెలంగాణ బిజెపి అధ్యక్ష పదవి నుంచి డా.కె.లక్ష్మణ్‌ను మార్చడం ఖాయమైంది. డిసెంబర్ నెలాఖరులోగా లక్ష్మణ్‌ను మార్చి కొత్త అధ్యక్షున్ని నియమిస్తారన్న ప్రచారం ఊపందుకుంది. ఇటీవల రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంఛార్జి వచ్చి వెళ్ళిన తర్వాత.. అధ్యక్షుని మార్పు ఖాయమైందని పార్టీ వర్గాలంటున్నాయి. దీనికి డిసెంబర్ నెలాఖరే ముహూర్తమని చెప్పుకుంటున్నాయి. బిజెపి రాష్ట్ర అధ్యక్షునిగా హైదరాబాద్‌కు చెందిన డా. కె. లక్ష్మణ్ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. తాజాగా పార్టీకి వరుసగా ఎదురవుతున్న పరాజయాల కారణంగా రాష్ట్ర అధ్యక్షున్ని […]

డిసెంబర్‌లో లక్ష్మణ్‌కు చెక్.. వారసుడెవరంటే?
Rajesh Sharma

| Edited By: Srinu Perla

Nov 26, 2019 | 3:55 PM

తెలంగాణ బిజెపి అధ్యక్ష పదవి నుంచి డా.కె.లక్ష్మణ్‌ను మార్చడం ఖాయమైంది. డిసెంబర్ నెలాఖరులోగా లక్ష్మణ్‌ను మార్చి కొత్త అధ్యక్షున్ని నియమిస్తారన్న ప్రచారం ఊపందుకుంది. ఇటీవల రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంఛార్జి వచ్చి వెళ్ళిన తర్వాత.. అధ్యక్షుని మార్పు ఖాయమైందని పార్టీ వర్గాలంటున్నాయి. దీనికి డిసెంబర్ నెలాఖరే ముహూర్తమని చెప్పుకుంటున్నాయి.

బిజెపి రాష్ట్ర అధ్యక్షునిగా హైదరాబాద్‌కు చెందిన డా. కె. లక్ష్మణ్ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. తాజాగా పార్టీకి వరుసగా ఎదురవుతున్న పరాజయాల కారణంగా రాష్ట్ర అధ్యక్షున్ని మార్చాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. గత నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత పేలవమైన ప్రదర్శన చేసిన తెలంగాణ బిజెపి రాష్ట్ర నాయకత్వం.. ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికల్లో కాస్త మెరుగైన ఫలితాలను పొందింది.

అయితే లోక్‌సభ ఎన్నికల్లో వచ్చిన నాలుగు సీట్లు కూడా మోదీ చరిష్మాకు స్థానికంగా అభ్యర్థుల ప్రాబల్యం తోడవడంతో వచ్చినవే. దాంతో రాష్ట్ర నాయకత్వానికి ఏ మాత్రం క్రెడిట్ దక్కలేదు. కాగా, ఇటీవల జరిగిన హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో బిజెపి మరింత హీనమైన ప్రదర్శన చేసింది. కేవలం 2650 ఓట్లు మాత్రమే పొందగలిగింది. ఈ ప్రదర్శనపై బిజెపి అధిష్టానం.. రాష్ట్ర నాయకత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ నాయకత్వాన్ని మార్చేందుకు బిజెపి అధిష్టానం నిర్ణయం తీసుకుంది.

అధిష్టానం ఆదేశం మేరకు బిజెపి తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జి కృష్ణ దాసు ఇటీవల రాష్ట్రంలో పర్యటించి వెళ్ళారు. పలువురు సీనియర్ నేతలతో మాట్లాడారు. ఇటీవల పార్టీలోకి వచ్చిన కొంత మందితో ఆయన సమాలోచనలు జరిపారు. వీరిలో మొదట్నించి పార్టీలో వున్న చింతల రామచంద్రారెడ్డి, రామకృష్ణారెడ్డి, ఇంద్రసేనారెడ్డి, రాజాసింగ్, ఎన్.రామచంద్రరావు ఉండగా..ఇటీవల పార్టీలో చేరిన డి.కె. అరుణ, జితేందర్ రెడ్డి తదితరులు కూడా వున్నారు. ఈ నేపథ్యంలో అంగబలం, అర్ధబలం వున్న నేతకే బిజెపి తెలంగాణ అధ్యక్ష స్థానం అప్పగించనున్నట్లు సమాచారం.

ఢిల్లీకి తిరిగి వెళ్ళిన కృష్ణదాసు.. అధిష్టానానికి నివేదిక ఇచ్చారని, అధిష్టానం సూచనల మేరకు లక్ష్మణ్‌ను మరోసారి ఢిల్లీకి పిలిపించుకుని సమాలోచనలు జరిపారని పార్టీవర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో మరో నెల రోజుల వ్యవధిలో లక్ష్మణ్ స్థానంలో కొత్త అధ్యక్షుని ఎంపిక జరుగుతుందని చెప్పుకుంటున్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu