ఓటమిని ముందే అంగీకరించడమే కొంప ముంచిందా?

వరుసగా కొడుతున్న షాకులతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో ఓటమిని ఇంకా మరవక ముందే మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ తగిలింది. అధికారంలో వున్న పార్టీలే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ స్థానాలను గెలుచుకోవడం రివాజే అయినప్పటికీ.. విపక్షాలు కూడా మెరుగైన ప్రదర్శనే చేస్తాయి. కానీ ఈసారి మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నడూ లేని విధంగా దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇందుకు కారణం ఆ పార్టీ నేతలేనని, […]

ఓటమిని ముందే అంగీకరించడమే కొంప ముంచిందా?
Follow us

|

Updated on: Jan 25, 2020 | 5:46 PM

వరుసగా కొడుతున్న షాకులతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో ఓటమిని ఇంకా మరవక ముందే మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ తగిలింది. అధికారంలో వున్న పార్టీలే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ స్థానాలను గెలుచుకోవడం రివాజే అయినప్పటికీ.. విపక్షాలు కూడా మెరుగైన ప్రదర్శనే చేస్తాయి. కానీ ఈసారి మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నడూ లేని విధంగా దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇందుకు కారణం ఆ పార్టీ నేతలేనని, వారంతా పరోక్షంగా ఓటమిని అంగీకరించడమే అధికార పార్టీకి భారీగా కలిసి వచ్చిందని పరిశీలకులు అంఛనా వేస్తున్నారు.

గత ఏడాది కాలంగా తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష బాధ్యతల నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డిని తప్పిస్తారని ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనప్పుడు మొదలైన ఈ చర్చ.. ఇటీవల హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో ఓటమి తర్వాత మరింత ఊపందుకుంది. దానికి తగినట్లుగానే.. ఉత్తమ్ కుమార్ ఎంపీగా ఎన్నికవడంతో ఢిల్లీలో కొత్త బాధ్యతలు చేపడతారన్న ప్రచారమూ కొనసాగింది. ఈ నేపథ్యంలో వచ్చిన మునిసిపల్ ఎన్నికల్లో ఈ ప్రచారమే శల్య సారథ్యానికి దారితీశాయని అంటున్నారు.

మునిసిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక కూడా ఎన్నికలను అడ్డుకునేందుకు కాంగ్రెస్ నాయకత్వం ప్రయత్నించింది. అందుకోసం న్యాయపోరాటానికి దిగింది. పార్టీని ప్రిపేర్ చేయాల్సిన టీపీసీసీ అధ్యక్షుడే స్వయంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయించారు. కోర్టు తీర్పు ప్రతికూలంగా రావడంతో అత్యంత స్వల్ప వ్యవధిలో ఎన్నికలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే, ప్రచారం మొదలైన తొలి రోజునే ఉత్తమ్ కుమార్ మునిసిపల్ ఎన్నికల తర్వాత తాను పీసీసీ బాధ్యతల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. ఈ ప్రకటన ప్రతీ ఒక్కరికి మహాభారత సమరానికి ముందు శల్యుడు ఆడిన మాటలనే గుర్తు చేశారు. ఈ ప్రకటన ద్వారా మునిసిపల్ ఎన్నికల్లో ఓటమిని ఉత్తమ్ కుమార్ ముందే అంగీకరించినట్లయ్యింది.

ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి ఉద్ధండ నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి నల్గొండలో కాంగ్రెస్ పార్టీ దారుణ పరాజయాన్ని చవిచూడగా.. వర్కింగ్ ప్రెసిడెంట్లు భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి మహబూబ్‌నగర్, ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లోను ఘోరంగా ఓటమి పాలైంది.

పార్లమెంటు ఎన్నికల్లో ఒకసీటును అధికంగా గెలుపొందిన బీజేపీ ఈ సారి కూడా కాంగ్రెస్ పార్టీ కంటే మెరుగైన ఫలితాలనే సాధించింది. నిజామాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌లో అతిపెద్ద పార్టీగా నిలిచిన బీజేపీ.. మేయర్ సీటుకు ఏడడుగుల దూరంలో ఆగిపోయింది. టెక్నికల్‌గా మూడు మునిసిపాలిటీలను గెలుచుకున్న బీజేపీ కంటే రెండు మునిసిపాలిటీలను ఎక్కువగా గెలుచుకుంది కాంగ్రెస్ పార్టీ. ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ సారథ్యంలో కీలక మార్పులు త్వరలోనే ఖాయమని తేలిపోయింది.