MLA Seethakka: సీతారాం తండాలో మైనర్ బాలిక అత్యాచారం, హత్య.. నిందితులను కఠినంగా శిక్షించాలిః ఎమ్మెల్యే సీతక్క డిమాండ్
మహబూబాబాద్ జిల్లాలోని మరిపెడ మండలం సీతారాం తండాలో అత్యాచారం, హత్యకు గురైన బాలిక కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు.
Mahabubabad Minor Girl Rape Murder Case: మహబూబాబాద్ జిల్లాలోని మరిపెడ మండలం సీతారాం తండాలో అత్యాచారం, హత్యకు గురైన బాలిక కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించిన సీతక్క రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండాపోయిందన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా మహిళల హత్యలు, లైంగిక వేధింపులే కనిపిస్తున్నాయన్నారు. అత్యాచారం చేసిన నిందితులను ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా త్వరితగతిన ఉరిశిక్ష విధించాలని ఆమె డిమాండ్ చేశారు.
కాగా, మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తండాధర్మారం శివారు సీతారాం తండాలో చోటు చేసుకుంది. సీతారాం తండాకు చెందిన మైనర్ బాలిక(17) ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది. తన ఇంటి నుండి కిరాణ దుకాణానికి వెళ్లిందని.. గంట సేపటి తర్వాత గుట్టల్లో అచేతనంగా పడి ఉందని బంధువులు తండా వాసులకు సమాచారం అందించారు. తండావాసులు, బంధుమిత్రులు గుట్టల వద్దకు వెళ్లి చూడగా బాలిక రక్తస్రావంతో పడి మృతి చెందిన దృశ్యం కనపడింది.
వెంటనే స్థానికులు మరిపెడ పోలీసులకు సమాచారం అందించారు. తండా ధర్మారంకు చెందిన ధరమ్ సోతు రాజేష్ అనే యువకుడు అత్యాచారం చేసి హత్య చేశాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, దర్యాప్తు చేపట్టారు. కాగా, మైనర్ బాలికపై హత్యాచారం కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు మహబూబాబాద్ ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ప్రకటించారు. నిందితుడిని ధరమ్ సోత్ రాజేశ్(22)గా గుర్తించారు. రాజేశ్‌ను మరిపెడ మండలం ధర్మారం తండాకు చెందిన యువకుడిగా పోలీసులు గుర్తించారు.
ఈ అత్యాచార ఘటనపై రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్రంగా స్పందించారు. ఈ దుర్మార్గానికి పాల్పడిన నేరస్తుణ్ని వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని జిల్లా కలెక్టర్, ఎస్పీతో మాట్లాడి ఆదేశాలు జారీ చేశారు. పేదరికం నుంచి వచ్చి ఉన్నతావిద్యాభ్యాసం చేస్తున్న అమ్మాయి పట్ల ఇలాంటి దారుణం జరగడం క్షమించరానిదని మంత్రి అన్నారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అమ్మాయి తండ్రితో మాట్లాడి ఓదార్చారు. కుటుంబానికి ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.Read Also… Viral Video: చిరుత ఎరను ఎత్తుకెళ్లింది.. హైనాకు చిర్రెత్తుకొచ్చింది.. అంతలోనే షాకింగ్ సీన్!