శ్రీలంకలో కొనసాగుతున్న కరోనా కల్లోలం.. ఒక్కరోజే 66 మంది భారతీయ వలస కూలీలకు పాజిటివ్
కొలంబోలో శుక్రవారం కార్మికులకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో 66 మందికి పాజిటివ్‌గా తేలిందని ఆ దేశ వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.
ప్రపంచవ్యాప్తంగా కరోనా తీవ్రత కొనసాగుతుంది. ప్రముఖుల నుంచి సామాన్యుల దాకా వైరస్ ధాటికి విలవిలలాడుతున్నారు. బతుకు దెరువు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వలసకూలీలు కొవిడ్ కాటుకు గురవుతున్నారు. తాజాగా శ్రీలంకలో భవన నిర్మాణరంగంలో పనిచేసే 66 మంది భారతీయ కార్మికులు కరోనా బారిన పడ్డారు. దేశ రాజధాని కొలంబోలో శుక్రవారం కార్మికులకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో 66 మందికి పాజిటివ్‌గా తేలిందని ఆ దేశ వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.
నార్త్ కొలంబో ప్రాంతంలో నివాసముండే ఈ కార్మికులకు చేపల మార్కెట్ క్లస్టర్ ద్వారా వైరస్ సోకినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయిందని కొలంబో నగర చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా. రువాన్ విజేముని తెలిపారు. ప్రస్తుతం ఈ 66 మంది దర్గా టౌన్‌లోని తాత్కాలిక వైద్య కేంద్రం ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కాగా, శ్రీలంకలో ఈ చేపల మార్కెట్ క్లస్టర్ ఇప్పుడు కరోనా కేంద్రంగా మారిందని.. దేశంలో అత్యధిక కేసులు ఈ క్లస్టర్‌తోనే సంబంధం కలిగి ఉంటున్నాయని రువాన్ పేర్కొన్నారు. ఇక శుక్రవారం నాటికి శ్రీలంక వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 15,722 నమోదైతే.. వీటిలో ఒక్క ఈ చేపల మార్కెట్ క్లస్టర్ పరిధిలో 9,120 మందికి కరోనా సోకడం గమనార్హం.