ఇది ‘రీల్’ కాదు.. రియలే!

మన వైపు న్యాయం ఉంటే కచ్చితంగా గెలుస్తాం. కాకపోతే కష్టమైనా దీర్ఘకాలం ఓపిక పట్టాలి. అలానే వెయిట్ చేసి రైల్వే శాఖ నుంచి తనకు రావాల్సిన రూ.33 ను సాధించుకున్నాడు ఓ సాప్ట్‌వేర్ ఇంజనీర్. ఓ సినిమాలోని డైలాగ్ మాదిరిగా “నాది కానిది కోటి రూపాయలు అయినా నాకొద్దు..నాది అన్నది అర్థ రూపాయి కూడా వదులుకోను” అన్నట్టు తనకు రావాల్సింది పట్టు వదలని విక్రమార్కుడిలా సాధించుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌లోని కోటాకు చెందిన సుజీత్ స్వామి అనే ఇంజినీర్.. […]

ఇది 'రీల్' కాదు.. రియలే!
Follow us

|

Updated on: May 09, 2019 | 4:27 PM

మన వైపు న్యాయం ఉంటే కచ్చితంగా గెలుస్తాం. కాకపోతే కష్టమైనా దీర్ఘకాలం ఓపిక పట్టాలి. అలానే వెయిట్ చేసి రైల్వే శాఖ నుంచి తనకు రావాల్సిన రూ.33 ను సాధించుకున్నాడు ఓ సాప్ట్‌వేర్ ఇంజనీర్. ఓ సినిమాలోని డైలాగ్ మాదిరిగా “నాది కానిది కోటి రూపాయలు అయినా నాకొద్దు..నాది అన్నది అర్థ రూపాయి కూడా వదులుకోను” అన్నట్టు తనకు రావాల్సింది పట్టు వదలని విక్రమార్కుడిలా సాధించుకున్నాడు.

వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌లోని కోటాకు చెందిన సుజీత్ స్వామి అనే ఇంజినీర్.. తనకు రావల్సిన రిఫండ్ కోసం రెండేళ్లుగా రైల్వేతో పోరాడుతున్నాడు. ఎట్టకేలకు రైల్వే దిగి వచ్చి.. అతనికి చెల్లించాల్సిన రిఫండ్‌ను ఇచ్చేసింది. ఇంతకీ ఆ మొత్తం ఎంతో తెలుసా? రూ.33. అదేంటీ రూ.33 కోసం అతడు రెండేళ్ల నుంచి పోరాడుతున్నాడా? అనే సందేహం మీకు కలగవచ్చు. సాధారణంగా మనలో చాలామంది తక్కువ మొత్తమే కదా అని వదిలేస్తుంటారు. కానీ, అతడు అలా కాదు.. రైల్వే ముక్కు పిండి మరీ తనకు రావల్సిన రిఫండ్‌ను వసూలు చేశాడు.

2017 జులైలో కోటా నుంచి న్యూఢిల్లీ వెళ్లేందుకు స్వామి ఏప్రిల్ నెలలో రూ.755 చెల్లించి టికెట్ కొనుగోలు చేశాడు. ఆ తర్వాత దాన్ని క్యాన్సిల్ చేయగా రూ.655 రిఫండ్ వచ్చింది. అప్పటికి ఆ టికెట్ వెయిటింగ్ లిస్టులోనే ఉంది. అయితే, రైల్వే క్యాన్సిలేషన్ ఛార్జ్ కింద రూ.65 కట్ చేయాల్సి ఉండగా.. అదనంగా రూ.35 సర్వీస్ ట్యాక్స్‌ విధించి రూ.110 కట్ చేసింది. దీంతో తనకు న్యాయంగా రావల్సిన రూ.35 కోసం రైల్వేను నిలదీశాడు. ఈ సందర్భంగా సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా వెయింటింగ్ లిస్ట్‌లో ఉన్న తన టికెట్ క్యాన్సిలేషన్‌కు సంబంధించిన వివరాలను అడిగాడు. అలా రెండేళ్లపాటు జాప్యం చేసిన రైల్వే.. చివరికి అతడికి సమాధానం ఇచ్చింది. జీఎస్టీ అమలుకు ముందు బుక్ చేసుకున్న టికెట్‌ను జీఎస్టీ తర్వాత క్యాన్సిల్ చేసుకున్నట్లయితే సర్వీస్ ట్యాక్స్ తిరిగి చెల్లించబోమని పేర్కొంది. అయితే, జీఎస్టీ అమలుకు ముందే టికెట్ క్యాన్సిల్ చేసుకున్నా.. రూ.35 సర్వీస్ ట్యాక్స్ విధించడంపై స్వామి అభ్యంతరం వ్యక్తం చేశాడు. దీంతో రైల్వే ఎట్టకేలకు అతడికి రిఫండ్ చెల్లించింది. మే 1న స్వామి అకౌంట్‌లో రూ.33 డిపాజిట్ చేసింది. డిసెంబరు 2018 నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు తన ఆర్టీఐ దరఖాస్తును ఒక డిపార్టుమెంట్ నుంచి మరో డిపార్టుమెంటుకు పది సార్లు తిప్పారని, గత రెండేళ్లుగా ఐఆర్‌సీటీసీ వేధింపులకు గురిచేసేందుకు త్వరలో కేసు పెట్టనున్నానని స్వామి తెలిపాడు.