మత మార్పిడుల వ్యతిరేక చట్టం నీరు గారుతోందా ? అలహాబాద్ హైకోర్టు తీర్పుతో అయోమయం, జైలు నుంచి ఇద్దరి విడుదల

లవ్ జిహాద్ ను వ్యతిరేకిస్తూ..ఇదే సమయంలో మత మార్పిడులకు వ్యతిరేకంగా యూపీ ప్రభుత్వం తెచ్చిన ఓ చట్టంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.

మత మార్పిడుల వ్యతిరేక చట్టం నీరు గారుతోందా ? అలహాబాద్ హైకోర్టు తీర్పుతో అయోమయం, జైలు నుంచి ఇద్దరి విడుదల
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Dec 19, 2020 | 1:14 PM

లవ్ జిహాద్ ను వ్యతిరేకిస్తూ..ఇదే సమయంలో మత మార్పిడులకు వ్యతిరేకంగా యూపీ ప్రభుత్వం తెచ్చిన ఓ చట్టంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఈ చట్టం కింద యూపీలో 32 ఏళ్ళ ఓ ముస్లిం వ్యక్తిపై పోలీసులు కేసు పెట్టి జైలుకు తరలించగా..దీనికి అభ్యంతరం చెబుతూ అలహాబాద్ హైకోర్టు అతడిని విడుదల చేయాలని పోలీసులను ఆదేశించింది. అతనితో బాటు అతని సోదరుడు కూడా విడుదలయ్యాడు. నదీమ్ అనే ఈ వ్యక్తిని, ఇతని  సోదరుడు సల్మాన్ ను పోలీసులు సుమారు రెండు వారాల క్రితం అరెస్టు చేశారు. కానీ మత మార్పిడులను వీరు ప్రోత్సహించారనడానికి ఖాకీలు ఎలాంటి సాక్ష్యాధారాలనూ చూపలేకపోయారని కోర్టు పేర్కొంది.

ముజఫర్ నగర్ లో నివసించే అక్షయ్ కుమార్ త్యాగి  అనే వ్యక్తి లోగడ ..నదీంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నదీమ్ తన భార్య పరుల్ ను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడని, అయితే ఆమెను బలవంతంగా ఇస్లాంలోకి మార్చే అవకాశం ఉందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే నదీమ్ దీన్ని సవాల్ చేస్తూ పోలీసులు తనపై పెట్టిన ఎఫ్ ఐ ఆర్ ను కొట్టివేసేట్టు చూడాలని కోర్టును కోరాడు. అయితే  అప్పటికే పోలీసులు ఇతడిని, ఇతడి సోదరుడిని అరెస్టు చేసి  మొరాదాబాద్ జిల్లా కోర్టుకు తరలించారు. నదీమ్ పిటిషన్ ను విచారించిన కోర్టు.. ఈ సోదరులను విడుదల చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ జరిగేవరకు నదీమ్ కు రక్షణ కల్పించాలని సూచించింది.

తమ బాగోగులేవో చూసుకుంటామని విక్టిమ్ (పరుల్), పిటిషనర్ కూడా పేర్కొంటున్నారని, వీరు తమ ప్రైవసీకి హక్కు కలిగిఉన్నారని కోర్టు అభిప్రాయపడింది.  తమ రిలేషన్ షిప్ వల్ల కలిగే పరిణామాలపై వీరికి పూర్తి అవగాహన ఉందని వ్యాఖ్యానించింది. కాగా కోర్టు తీర్పు ఈ విధమైన ఇతర కేసులపై ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు. లవ్ జిహాద్ పేరిట ముస్లిం వ్యక్తులు హిందూ మహిళలను పెళ్ళాడి ఆ తరువాత వారిని బలవంతంగా మత మార్పిడులు చేయిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దీన్ని అరికట్టేందుకు యూపీ ప్రభుత్వమే మొదటిసారిగా మత మార్పిడుల వ్యతిరేక చట్టాన్ని తెచ్చింది. ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఈ విధమైన చట్టాలను తేవాలని యోచిస్తున్నాయి. కాగా… లవ్ జిహాద్ అనే పదాన్ని చట్టం డిఫైన్ చేయలేదని హోం శాఖ గత ఫిబ్రవరిలో పార్లమెంటుకు తెలిపింది. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇలాంటి కేసులను రిపోర్టు చేయలేదని గుర్తు చేసింది.