పానగల్‌ ఇంజినీరింగ్‌ కాలేజ్‌లో పెరిగిపోయిన పైత్యం.. మహిళా సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్

నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో లైంగిక వేధింపుల పర్వం. ఆ మృగాళ్లు తోటి సిబ్బందినే గాకుండా స్టూడెంట్స్‌నూ వదలడం లేదు.

పానగల్‌ ఇంజినీరింగ్‌ కాలేజ్‌లో పెరిగిపోయిన పైత్యం.. మహిళా సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్
Sexual Harassment
Follow us

|

Updated on: Dec 31, 2020 | 12:22 AM

University Sexual Harassment: విద్యాబుద్ధులు చెప్పి ఆదర్శంగా ఉండాల్సిన గురువులు కట్టు తప్పుతున్నారు. పాఠాలు చెప్పాల్సిన పంతుళ్లు.. పాడు పనులకు పాల్పడుతున్నారు. ఇది… నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో లైంగిక వేధింపుల పర్వం. ఆ మృగాళ్లు తోటి సిబ్బందినే గాకుండా స్టూడెంట్స్‌నూ వదలడం లేదు. అవినీతి అక్రమాలతో పాటు లైంగిక వేధింపులకు అడ్డాగా మహాత్మా గాంధీ యూనివర్సిటీ మారుతోందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. విద్యాబుద్ధులు చెబుతూ క్రమశిక్షణగా ఉండాల్సిన అధ్యాపకులే గీత దాటుతున్నారు. పానగల్‌లోని యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో వేధింపుల పర్వం ఎక్కువైంది. గత ఏడాది ఇంజనీరింగ్ కాలేజీలో వైస్ ప్రిన్సిపల్ గా పనిచేస్తున్న పునీత్ కుమార్ లైంగిక వేధింపులకు పాల్పడి జైలుపాలు అయ్యాడు.

ఈ ఘటన మరువక ముందే మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్ తోటి మహిళా సిబ్బందితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో బాధితురాలు పోలీసులతో పాటు.. యూనివర్సిటీ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్‌కు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ జరిపిన ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీనివాస్‌ను సర్వీస్ నుంచి తొలగించాలని సూచించింది. దీంతో యూనివర్సిటీ యాజమాన్యం శ్రీనివాస్‌తోపాటు పునీత్ కుమార్‌ను సర్వీస్ నుంచి తొలగిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. లైంగిక వేధింపులకు సంబంధించి ఉమెన్ ప్రొటెక్షన్ సెల్‌కు ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిని విచారించి బాధ్యులను సర్వీస్ నుంచి తొలగించాలని సిఫార్స్ చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. లైంగిక వేధింపులకు సంబంధించి బాధితులు సరైన ఆధారాలు చూపలేకపోతున్నారని పోలీసులు చెబుతున్నారు.

మరోవైపు, యూనివర్సిటీలో లైంగిక వేధింపులు కొనసాగుతున్నా అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశాయి. యూనివర్సిటీ ఉన్నతాధికారులు లైంగిక వేధింపులకు పాల్పడితే నామమాత్ర విచారణతో సరిపెడుతున్నారని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ఈ విషయంలో కాంట్రాక్టు అధ్యాపకులు, సిబ్బంది పైనే వేటు వేస్తున్నారని, పర్మినెంటు ఉద్యోగులపై మాత్రం చర్యలు ఉండడం లేదని చెబుతున్నారు. యూనివర్సిటీలో లైంగిక వేధింపులను అరికట్టాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఇదీ చదవండి…

పెద్ద అంబర్‌పేట్ ఔటర్ రింగురోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం…రెండు కార్లను ఢీ కొట్టిన లారీ.. ఐదుగురకి తీవ్ర గాయాలు..!