Kurumurthy Brahmotsavalu: పేదల తిరుపతిలో బ్రహ్మోత్సవ వైభవం.. కురుమూర్తికి పోటెత్తిన భక్తజనం
పాలమూరు ప్రజల ఇలవేల్పు దైవం.. పేదల తిరుపతిగా పేరుగాంచిన కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. కార్తీకమాసం వేళ ఏడు కొండల మధ్య కొలువైన ఆ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు సిద్ధమయ్యారు. స్వామివారి కల్యాణోత్సవంతో జాతరలో ఆధ్యాత్మిక సందడి మొదలైంది. ఇక గోవింద నామస్మరణతో కురుమూర్తి కొండలు మారుమోగనున్నాయి. ఈ నెల 25వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనుండగా.. జాతర మాత్రం సుమారు నెలన్నర పాటు కొనసాగనుంది.

మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపురం సమీపంలోని కురుమూర్తి క్షేత్రం తెలంగాణలోని ప్రసిద్ధ ప్రాచీన పుణ్యక్షేత్రాల్లో ఒకటి. ఇక్కడి ప్రకృతి అందాలు, ఏడు కొండల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణం తిరుమల క్షేత్రాన్ని తలపిస్తాయి. దేవరగట్టుపై ఉన్న కాంచన గుహలో లక్ష్మీ సమేతంగా శ్రీ వేంకటేశ్వర స్వామి స్వయంభూగా కొలువుదీరాడు. ఇక్కడి స్వామివారి విగ్రహం తిరుమల శ్రీవారి మూర్తిని పోలి ఉండటం ఈ క్షేత్ర ప్రత్యేకతగా చెబుతారు. దాదాపు 900 ఏళ్లుగా స్వామివారు పూజలు అందుకుంటున్నట్లు స్థానిక చరిత్ర చెబుతోంది.
ఉద్దాల ఉత్సవం.. బ్రహ్మోత్సవ వైభవం:
కురుమూర్తి బ్రహ్మోత్సవాల్లో ఉద్దాల (పాదుకల) ఊరేగింపు అత్యంత ప్రధాన ఘట్టం. ఈ ఉత్సవం కోసం ప్రత్యేకంగా తయారు చేసే స్వామివారి పాదుకలకు ఎంతో విశిష్టత ఉంది. పల్లమర్రి నుంచి చాటను ఊరేగింపుగా వడ్డేమాన్ గ్రామానికి తీసుకువస్తారు. అక్కడ నియమనిష్ఠలతో స్వామివారి పాదుకలను తయారు చేస్తారు. అనంతరం వాటిని ఊరేగింపుగా కురుమూర్తి దేవస్థానానికి తీసుకొస్తారు. ఈ ఉద్దాల ఉత్సవాన్ని తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. స్వామివారి పాదుకలను దర్శించుకుంటే కష్టాలు తొలగి, మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం.
14న అలంకరణ.. 16న ఉద్దాల ఉత్సవం:
ఈ ఏడాది కురుమూర్తి బ్రహ్మోత్సవాలు నవంబర్ 10 నుంచి 25వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఇప్పటికే స్వామివారి కల్యాణోత్సవంతో వేడుకలు పూర్తయ్యాయి. ఈ నెల 14న స్వామివారి అలంకరణ ఉత్సవం, 16న అత్యంత వైభవంగా ఉద్దాల మహోత్సవం నిర్వహించనున్నారు. ఈ ప్రధాన ఘట్టాలను తిలకించేందుకు ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. బ్రహ్మోత్సవాల అనంతరం కూడా జాతర సందడి కొనసాగుతూ సుమారు నెలన్నర పాటు భక్తులతో క్షేత్రం కిటకిటలాడనుంది.
కార్తీకమాసంలో కురుమూర్తి స్వామిని దర్శించుకోవడం ఎంతో విశిష్టమని భక్తులు భావిస్తారు. స్వామివారికి కొత్తకుండలో తొలిపంట ధాన్యంతో నైవేద్యం(దాసంగం) తయారు చేసి సమర్పిస్తారు. స్వామివారిని దర్శించుకొని తమ కోర్కెలు కోరుకుంటారు. కొందరు భక్తులు రాత్రి వేళ క్షేత్రంలోనే బస చేస్తూ భజనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. బ్రహ్మోత్సవాల సమయంలో ఆలయ పరిసరాలు తాత్కాలిక దుకాణాలతో సందడిగా కనిపిస్తుంటుంది.
ఇక కురుమూర్తి స్వామి ఈ క్షేత్రానికి రావడానికి సంబంధించి రెండు పురాణగాథలు ప్రచారంలో ఉన్నాయి. కుబేరుడి అప్పుల బాధ నుంచి తప్పించుకునే క్రమంలో తిరుమల నుంచి ఉత్తర దిశగా ప్రయాణిస్తున్న శ్రీనివాసుడు.. ప్రకృతి అందాలు, సుగంధభరితమైన పండ్ల చెట్లు, పక్షులతో కళకళలాడుతున్న ఈ కొండపై కొద్దిసేపు విశ్రమించాలని లక్ష్మీదేవి కోరడంతో ఇక్కడ ఆగినట్లు ఒక కథనం చెబుతుంది. అప్పటి నుంచి స్వామివారు ఇక్కడ కొలువుదీరారని భక్తులు విశ్వసిస్తారు.
బ్రహ్మోత్సవాలకు లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో ఆలయ కమిటీ, జిల్లా యంత్రాంగం సమన్వయంతో ఏర్పాట్లు చేపట్టాయి. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని పోలీసు బందోబస్తు, సీసీ కెమెరాల పర్యవేక్షణ, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, తాగునీరు, పారిశుధ్యం వంటి సౌకర్యాలపై దృష్టి సారించారు. ముఖ్యంగా నవంబర్ 16న జరిగే ఉద్దాల మహోత్సవం సందర్భంగా భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో అదనపు రవాణా, భద్రతా ఏర్పాట్లకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు.
మొత్తానికి పాలమూరు ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలిచే కురుమూర్తి జాతర మరోసారి భక్తి పారవశ్యాన్ని నింపనుంది. స్వామివారి కల్యాణంతో మొదలైన బ్రహ్మోత్సవాలు.. అలంకరణ, ఉద్దాల మహోత్సవాలతో మరింత వైభవంగా సాగనున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
