కన్నడ రాజకీయం..ఆసక్తికరంగా మిషన్‌ 7+

కర్ణాటక రాజకీయం మళ్లీ రసవత్తరంగా మారింది. 15మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించడంతో డిసెంబర్‌ 5న జరగనున్న ఉప ఎన్నికలు హీట్‌ పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా కమలం పార్టీకి ఇవి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎలక్షన్స్‌. కన్నడనాట అధికారం నిలుపుకోవాలంటే 7కు పైగా స్థానాల్లో గెలిచి తీరాల్సిన పరిస్థితి. ఐతే ఆ పార్టీని రెబల్స్‌ బెడద వెంటాడుతోంది. కాంగ్రెస్‌- జేడీఎస్‌ నుంచి వచ్చిన వారికి టికెట్లివ్వడంతో అసంతృప్త నేతలు..శరత్‌ బచ్చెగౌడ, కవిరాజ్‌, అశోక్‌ పూజారిలు రెబల్‌ అభ్యర్థులుగా పోటీకి దిగారు. నామినేషన్స్‌ […]

కన్నడ రాజకీయం..ఆసక్తికరంగా మిషన్‌ 7+
Pardhasaradhi Peri

| Edited By: Srinu Perla

Nov 22, 2019 | 8:46 PM

కర్ణాటక రాజకీయం మళ్లీ రసవత్తరంగా మారింది. 15మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించడంతో డిసెంబర్‌ 5న జరగనున్న ఉప ఎన్నికలు హీట్‌ పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా కమలం పార్టీకి ఇవి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎలక్షన్స్‌. కన్నడనాట అధికారం నిలుపుకోవాలంటే 7కు పైగా స్థానాల్లో గెలిచి తీరాల్సిన పరిస్థితి. ఐతే ఆ పార్టీని రెబల్స్‌ బెడద వెంటాడుతోంది. కాంగ్రెస్‌- జేడీఎస్‌ నుంచి వచ్చిన వారికి టికెట్లివ్వడంతో అసంతృప్త నేతలు..శరత్‌ బచ్చెగౌడ, కవిరాజ్‌, అశోక్‌ పూజారిలు రెబల్‌ అభ్యర్థులుగా పోటీకి దిగారు. నామినేషన్స్‌ విత్‌ డ్రా చేసుకోవాలని పార్టీ ఆదేశించినా.. బేఖాతరు చేయడంతో ఆ ముగ్గురిపై బహిష్కరణ వేటు పడింది.

చిక్ బళ్లాపుర ఎంపీ బీఎన్‌ బచ్చెగౌడ కుమారుడైన శరత్‌ బచ్చెగౌడ..బీజేపీ యువమోర్చా కార్యదర్శిగా పనిచేశారు. గతంలో ఆయన కర్ణాటక హౌసింగ్‌ బోర్డ్‌ ఛైర్మన్‌గా కూడా విధులు నిర్వర్తించారు. ఐతే 2018లో కాంగ్రెస్‌ బహిష్కృత నేత ఎంటీబీ నాగరాజు చేతిలో 7వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇప్పుడు ఆయన హోస్కోట్‌ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలవగా..శరత్‌ బచ్చెగౌడ ఇండిపెండెంట్‌గా నామినేషన్‌ వేసి నాగరాజుకు సవాల్‌ విసురుతున్నారు. ఇక్కడ జేడీఎస్‌ కూడా అభ్యర్థిని నిలపకుండా బచ్చెగౌడకు మద్దతిస్తోంది. విజయనగర నుంచి కవిరాజ్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. ఇక్కడ బీజేపీ నుంచి ఆనంద్‌ సింగ్‌ బరిలోకి దిగుతున్నారు. ఇక పూజారి..గోకక్‌ నుంచి జేడీఎస్‌ అభ్యర్థిగా బరిలో నిలిచారు.

మరోవైపు జేడీఎస్‌ పార్టీకి పెద్ద షాక్‌ తగిలింది. హీరేకరూర్, అథని నియోజకవర్గాల్లో జేడీఎస్‌ అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. హావేరి జిల్లా హీరేకరూర్‌లో అభ్యర్థి శివలింగ శివాచార్య స్వామిజీ నామినేషన్‌ విత్‌ డ్రా చేసుకున్నారు. అథణిలో ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ్‌ సవది జరిపిన చర్చల తర్వాత జేడీఎస్‌ అభ్యర్థి గురుదాస్యల్‌ పోటీ నుంచి తప్పుకున్నారు.

యడియూరప్ప ప్రభుత్వ మనుగడకు ఎంతో కీలకమైన ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలిచి అధికారం నిలుపుకునేందుకు ఆరాటపడుతోంది బీజేపీ. అలాగే అనర్హత ఎమ్మెల్యేలను ఓడించి ప్రభుత్వాన్ని కూల్చాలని లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నాయి కాంగ్రెస్‌, జేడీఎస్‌. ఈ నేపథ్యంలో కన్నడ నాట ఏం జరుగుతుందనేది సర్వత్రా ఉత్కంఠగా మారింది. విజయలక్ష్మి ఎవరిని వరిస్తుందో తెలియాలంటే డిసెంబర్‌ 9న వెలువడే ఫలితాల వరకూ వెయిట్‌ చేయాల్సిందే.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu