కంగనా వర్సెస్‌ మహా సర్కారు.. హీటెక్కిన ముంబై

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ , మహారాష్ట్ర నేతల మధ్య వివాదం చినికి చినికి గాలివానగా మారుతోంది. ముంబైని పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌తో పోల్చిన కంగనాపై మహారాష్ట్ర నేతలు మండిపడుతున్నారు. కంగనాకు ముంబైలో ఉండే హక్కు లేదని శివసేన నేత సంజయ్‌ రౌత్ నిప్పులు చెరుగుతున్నారు‌.

కంగనా వర్సెస్‌ మహా సర్కారు.. హీటెక్కిన ముంబై
Follow us

|

Updated on: Sep 04, 2020 | 8:45 PM

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ , మహారాష్ట్ర నేతల మధ్య వివాదం చినికి చినికి గాలివానగా మారుతోంది. ముంబైని పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌తో పోల్చిన కంగనాపై మహారాష్ట్ర నేతలు మండిపడుతున్నారు. కంగనాకు ముంబైలో ఉండే హక్కు లేదని శివసేన నేత సంజయ్‌ రౌత్ నిప్పులు చెరుగుతున్నారు‌. ముంబైకి రావద్దని ఆయన అల్టిమేటం జారీ చేశారు.

మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌ కూడా కంగనాకు ముంబైలో ఉండే హక్కు లేదన్నారు. దీంతో వాళ్లకు గట్టి కౌంటరిచ్చారు కంగనా. ఈనెల 9వ తేదీన తాను ముంబైకి వస్తున్నానని, దమ్ముంటే ఎవరైనా ఆపాలని ట్వీట్‌ చేశారు. బాలీవుడ్‌ స్టార్‌ సుశాంత్‌ సూసైడ్‌పై కంగనా సంచలన ఆరోపణలు చేస్తున్నారు. చాలామంది బాలీవుడ్‌ ప్రముఖులను ఆమె టార్గెట్‌ చేశారు. కంగనా తీరును నిరసిస్తూ శివసేన కార్యకర్తలు భారీ ఆందోళన చేపట్టారు.

శివసేన నేతలను టార్గెట్‌ చేస్తూ తాజాగా మరోసారి ట్వీట్‌ చేశారు కంగనా. మహారాష్ట్ర ఎవరి జాగీరు కాదని , ముంబైలో ఉండడానికి తనకు శివసేన అనుమతి అవసరం లేదని ట్వీట్‌ చేశారు. మహారాష్ట్ర అంటే తనకు ఎనలేని గౌరవమన్నారు. అంతకుముందు కంగనా , సంజయ్‌రౌత్‌ మధ్య మాటల యుద్దం నడిచింది. ముంబైలో వాక్‌ స్వాతంత్ర్యం లేకుండా పోయిందని , తనకు బెదిరింపులు వస్తున్నాయని కంగనా ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా సంజయ్‌ రౌత్‌ తీరుపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ముంబై ఇమేజ్‌ను దెబ్బతినే విధంగా తరచుగా కంగనా కామెంట్స్‌ చేస్తోందని సంజయ్‌ రౌత్ మండిపడుతున్నారు. మనాలిలోనే ఉంటే మంచిదని , ముంబైకి రావద్దని శివసేన అధికార పత్రిక సామ్నాలో ఆయన ఎడిటోరియల్‌ రాశారు. రౌత్‌ వ్యాఖ్యలను మహారాష్ట్ర హోంశాఖ మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ కూడా సమర్ధించారు.  దీంతో సెప్టెంబర్‌ 9వ తేదీన ముంబైలో ఏం జరుగబోతుందన్న విషయంపై ఆసక్తి నెలకొంది.

మనాలి నుంచి తాను సెప్టెంబర్‌ 9వ తేదీన ముంబైకి వస్తున్నానని , ఎయిర్‌పోర్టులో ఎవరు అడ్డుకుంటారో చూస్తానని అంటున్నారు కంగనా రనౌత్‌.  కంగనా రనౌత్‌ ముంబై పోలీసులను అవమానించడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు మహారాష్ట్ర హోంశాఖ మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌. కంగనా రనౌత్‌కు ముంబైలో ఉండే హక్కు లేదన్నారు. కంగనా వ్యాఖ్యలకు నిరసనగా శివసేన కార్యకర్తలు రోడ్డెక్కారు.

ముంబైతో పాటు మహారాష్ట్ర లోని పలు ప్రాంతాల్లో నిరసనలు చేపట్టారు. ముంబైలో శివసేన ప్రధాన కార్యాలయం ఎదుట మహిళా కార్యకర్తలు కంగనా ఫోటోలను దగ్ధం చేశారు. మహరాష్ట్ర సంస్కృతిని ముఖ్యంగా ముంబై కల్చర్‌ను కించపర్చారని ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు. మహారాష్ట్ర వ్యతిరేకులకు గుణపాఠం చెప్పాలని డిమాండ్‌ చేశారు. కంగనాపై దేశద్రోహం కేసు పెట్టాలని నినాదాలు చేశారు.