జగన్, విజయ్.. మధ్యలో పీకే.. దళపతిని రాజకీయాల్లోకి రమ్మంటూ ఆహ్వానం.!
IT Raids On Vijay: అప్పుడు ఏపీలో.. రావాలి జగన్ కావాలి జగన్. ఇప్పుడు తమిళనాడులో రావాలి విజయ్..కావాలి విజయ్. ఇది ఇప్పుడు హాట్‌టాపిక్ గా మారిన నినాదం. మొన్నీమధ్య ఐటీ రైడ్స్‌తో తమిళనాట సంచలనంగా మారిన హీరో విజయ్.. తమిళ పాలిటిక్స్ లోకి రావాలని ఫ్యాన్స్ బీభత్సమైన స్వాగతాలు పలుకుతున్నారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ఏపీ సీఎం జగన్, వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తో పాటు మధ్యలో విజయ్ ఫొటోలు ముద్రించి పాలిటిక్స్‌లోకి వెల్కమ్ […]
IT Raids On Vijay: అప్పుడు ఏపీలో.. రావాలి జగన్ కావాలి జగన్. ఇప్పుడు తమిళనాడులో రావాలి విజయ్..కావాలి విజయ్. ఇది ఇప్పుడు హాట్‌టాపిక్ గా మారిన నినాదం. మొన్నీమధ్య ఐటీ రైడ్స్‌తో తమిళనాట సంచలనంగా మారిన హీరో విజయ్.. తమిళ పాలిటిక్స్ లోకి రావాలని ఫ్యాన్స్ బీభత్సమైన స్వాగతాలు పలుకుతున్నారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ఏపీ సీఎం జగన్, వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తో పాటు మధ్యలో విజయ్ ఫొటోలు ముద్రించి పాలిటిక్స్‌లోకి వెల్కమ్ చెబుతున్నారు. రాష్ట్రానికి ఇప్పుడు నీవే దిక్కంటూ విజయ్‌ని రా రమ్మని పిలుస్తున్నారు. ఏపీని మేము కాపాడుకున్నాం..కష్టాల్లో ఉన్న తమిళనాడుకు ఇక నీవే ఆధారం అని విజయ్‌కు జగన్ , ప్రశాంత్‌కిశోర్ సూచిస్తునట్టు పోస్టర్‌లో రాశారు. ఇప్పుడు తమిళనాడు అంతటా ఈ పోస్టర్లు చర్చనీయాంశంగా మారాయి..
Wht a craze of @actorvijay ? Kudos to the #VijayFans ? Never seen that much craze for any celebrity in whole nation. https://t.co/n8qEV3R07t
— ??Divergent??? (@UrmiIts) February 11, 2020
అయిదారు నెలల కిందట విజయ్ రాజకీయాల్లోకి రాబోతున్నాడన్న వార్తలు గుప్పుమన్నాయి.. ప్రశాంత్ కిశోర్‌తో చర్చలు జరిపారన్న కథనాలూ వచ్చాయి.. విజయ్ రాజకీయ ప్రవేశంపై అభిమానులు అప్పుడంత సీరియస్‌గా లేకపోయినా.. ఇప్పుడు మాత్రం వచ్చి తీరాల్సిందేనని పట్టుబడుతున్నారు.. ఇందుకు కారణం ఉంది.. రీసెంట్‌గా ఐటీ అధికారులు హీరో విజయ్ ఇంట్లో సోదాలు చేశారు.. బిగిల్ సినిమాకు సంబంధించి లెక్కలు సరిచూసేందుకు రెండు రోజుల పాటు సోదాలు నిర్వహించారు. సినీ నిర్మాతలు, ఫైనాన్షియర్ల ఇళ్లల్లోనూ సోదాలు చేసి భారీగా డబ్బు సీజ్ చేశారు. మాస్టర్ సినిమా షూటింగ్‌లో ఉన్న విజయ్‌ను షూటింగ్ నిలిపివేసి మరీ ఉన్నపళంగా ఇంటికి తీసుకెళ్లారు. గతంలో బీజేపీకి వ్యతిరేకంగా విజయ్ చేసిన కామెంట్స్‌ను దృష్టిలో పెట్టుకునే ఐటీ రైడ్స్ చేయిస్తున్నారనేది విజయ్ ఫ్యాన్స్ చేస్తున్న ఆరోపణ. అంతేగాక విజయ్ స్వయంగా ఐటీ అధికారుల ముందు విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు జారీచేశారు. .దీనికి తోడు నైవేలి లిగ్నైట్ గనిలో షూటింగ్ జరుగుతుండగా బీజేపీ కార్యకర్తలు అక్కడికి వెళ్లి ధర్నా చేయడం విజయ్ అభిమానులకు పుండు మీద కారం పూసినట్లయ్యింది. గనిలో సినిమా షూటింగ్ కు ఎలా పర్మిషన్ ఇస్తారంటూ బీజేపీ కార్యకర్తలు షూటింగ్ ను అడ్డుకునే ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే.
అయితే తాజాగా ఆయన అభిమానులతో కలిసి దిగిన సెల్ఫీ ఫొటో ఒకటి వైరల్ అయింది. ఐటీ రైడ్స్ పై ఇంతవరకూ నోరు మెదపని విజయ్..ఫొటో ద్వారా తన బలమేంటో చూపించాడని రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. . తాజా పరిణామాల నేపథ్యంలో విజయ్ ఫ్యాన్స్‌లో ఉరకలేసే ఉత్సాహం వచ్చేసింది.. తమ దళపతి వెంటనే రాజకీయాల్లోకి వచ్చేయాలని గట్టిగా కోరుకుంటున్నారు.. రాజకీయాల్లోకి వస్తారో రారో అన్న సందిగ్ధంలో ఉన్న తమిళప్రజలకు రజనీకాంత్ ఓ క్లారిటీ ఇచ్చేశాడు.. 2021లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోపే పార్టీ పెడతానంటూ ప్రకటించారు రజనీ.. రజనీ పార్టీ సిద్ధాంతాలను బయటపెట్టకపోయినా … ఆయనింకా కొంచెం కన్ఫ్యూజన్‌లోనే ఉన్నట్టు ఇటీవల ఆయన చేసిన కామెంట్స్ చెబుతున్నాయి. కాసేపు తనకు కాషాయం రంగు పులమకండి అంటారు.. అంతలోనే నరేంద్రమోదీ గ్రేట్ అంటారు.. బీజేపీకి బహిరంగంగా మద్దతు చెప్పకున్నా …రజనీ ఆవైపే మొగ్గుతారన్నది వాస్తవం..
ఇదే సమయంలో బీజేపీ తీసుకున్న నిర్ణయాల్లో కొన్నింటిని విజయ్ వ్యతిరేకిస్తూ ప్రకటనలు చేస్తున్నారు. ముఖ్యంగా జీఎస్టీని తప్పుపడుతూ మెర్సెల్ సినిమాలో ఆయన చెప్పిన డైలాగులు వివాదాస్పదం అయ్యాయి… అటు బీజేపీ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. అందుకే రజనీకాంత్ తర్వాత ఆ స్థాయిలో తమిళనాడులో క్రేజ్ ఉన్న విజయ్ కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తారని 2021ఎన్నికలు రజినీకాంత్ వర్సెస్ విజయ్ మధ్యే జరుగుతాయని అంటున్నారు విశ్లేషకులు..అందుకే ఫ్యాన్స్ మరింత ఉత్సాహంగా ఆయన ఫ్లెక్లీలను విపరీతంగా పెట్టేస్తున్నారు. మధ్యలో ఏపీ సీఎం జగన్, పీకే ఫొటోలను కలిపేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌తో విజయ్‌ను పోలుస్తూ పోస్టర్లు పెట్టారు బాగానే ఉంది… కానీ ప్రశాంత్‌కిశోర్ ఫోటోలు పెట్టడమే చర్చకు తావిస్తోంది.. ఎందుకంటే ఇప్పటికే ప్రశాంత్ కిశోర్‌తో డీఎంకే నేత స్టాలిన్ ఒప్పందం కుదుర్చుకున్నారట! రాబోయే ఎన్నికల్లో స్టాలిన్‌కు ప్రశాంత్‌కిశోరే వ్యహకర్తగా వ్యవహరించనున్నారు.. మరి విజయ్ ఫ్యాన్స్ ఆయనను ఎందుకు పోస్టర్లలోకి లాగారో ఎవరికీ అర్థం కావడం లేదు.
– అశోక్ వేములపల్లి(రాయలసీమ టీవీ9 బ్యూరో చీఫ్)