USలో గర్ల్‌ఫ్రెండ్ మర్డర్.. పారిపోతుండగా జర్మనీలో భారత విద్యార్థి అరెస్ట్!
19 ఏళ్ల ప్రియురాలిని హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 20 ఏళ్ల భారతీయ విద్యార్థిని జర్మనీ పోలీసులు అరెస్ట్ చేశారు. అమెరికా నుంచి భారత్‌కు పారిపోయేందుకు ప్రయత్నించిన అతడిని జర్మనీలోని బెర్లిన్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో అతడిపై ఫస్ట్ డిగ్రీ హత్య, కిడ్నాప్ అభియోగాలు నమోదయ్యాయి..

అమెరికాలో తన 19 ఏళ్ల ప్రియురాలిని హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 20 ఏళ్ల భారతీయ విద్యార్థిని జర్మనీ పోలీసులు అరెస్ట్ చేశారు. అమెరికా నుంచి భారత్‌కు పారిపోయేందుకు ప్రయత్నించిన అతడిని జర్మనీలోని బెర్లిన్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో అతడిపై ఫస్ట్ డిగ్రీ హత్య, కిడ్నాప్ అభియోగాలు నమోదయ్యాయి. వరుణ్ బచ్చిగారి (20) అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ అరిజోనాలో బిజినెస్ అనలిటిక్స్ చదువుతున్నాడు. అతడి ప్రియురాలు జులిస్సా రూబీ సలాజర్ (19) ఆగస్టు 6న అరిజోనా రాష్ట్రంలోని టక్సన్‌లోని తన అపార్ట్‌మెంట్‌లో మృతిచెందింది. ఆమెను వరుణ్ హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సలాజర్ కుటుంబ సభ్యులు ఆమెకు ఫోన్ చేసినప్పటికీ స్పందన లేకపోవడంతో పోలీసులను సంప్రదించారు. దీంతో గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో యూక్లిడ్ అవెన్యూ, ఎల్మ్ స్ట్రీట్ సమీపంలోని అపార్ట్‌మెంట్‌కు పోలీసులు, అత్యవసర సిబ్బంది చేరుకున్నారు. టక్సన్ ఫైర్ డిపార్ట్‌మెంట్ సిబ్బంది సలాజర్‌ను అపస్మారక స్థితిలో గుర్తించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆమె శరీరంపై తీవ్ర గాయాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. హత్య జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించిన దర్యాప్తు అధికారులు.. ఆమెను గొంతు నులిమి చంపి ఉండొచ్చని అనుమానించారు.
తల్లి పేరుతో మెసేజ్‌లు.. పోలీసులకు అనుమానం
దర్యాప్తులో వరుణ్‌పై పోలీసులకు అనుమానాలు మరింత బలపడ్డాయి. సలాజర్ ఫోన్, క్రెడిట్ కార్డులను వరుణ్ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా, హత్యను కప్పిపుచ్చే ప్రయత్నంలో సలాజర్‌గానే నటిస్తూ ఆమె తల్లికి వరుసగా మెసేజ్‌లు పంపినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అయితే ఆ సందేశాలు సలాజర్ కుటుంబ సభ్యులకు అనుమానాస్పదంగా అనిపించాయి. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించడంతో అధికారులు అపార్ట్‌మెంట్‌కు వెళ్లి సలాజర్ మృతదేహాన్ని గుర్తించారు. సలాజర్ మృతి చెందిన రోజే వరుణ్ టక్సన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లినట్లు దర్యాప్తులో తేలింది. అక్కడి నుంచి హ్యూస్టన్‌కు విమానంలో వెళ్లాడు. అనంతరం జర్మనీలోని బెర్లిన్‌కు వెళ్లే కనెక్టింగ్ ఫ్లైట్ ఎక్కాడు. అక్కడి నుంచి చివరకు భారత్‌కు చేరుకోవాలని అతడు భావించినట్లు పోలీసులు తెలిపారు.
అయితే అమెరికా పోలీసులు సకాలంలో చర్యలు తీసుకున్నారు. టక్సన్ పోలీస్ డిపార్ట్‌మెంట్, ఎఫ్‌బీఐ టక్సన్ కార్యాలయం, బెర్లిన్‌లోని ఎఫ్‌బీఐ లీగల్ అటాచే కార్యాలయం పరస్పర సమన్వయంతో వరుణ్‌ను జర్మనీలోకి చేరుకున్న వెంటనే అదుపులోకి తీసుకున్నారు. దీంతో అతడు భారత్‌కు వెళ్లే అవకాశం లేకుండా చేశారు. వరుణ్‌పై గతంలోనూ ఆరోపణలు ఉన్నట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. యూనివర్సిటీ ఆఫ్ అరిజోనా పోలీస్ డిపార్ట్‌మెంట్ గతంలో అతడికి సంబంధించిన ఓ దాడి కేసును దర్యాప్తు చేసినట్లు అరెస్ట్ వారెంట్‌లో పేర్కొన్నారు. పలువురు సాక్షులు అతడి గత హింసాత్మక ప్రవర్తన గురించి వివరించినట్లు కూడా వారెంట్‌లో ఆరోపణలు ఉన్నాయి. మే నెలలో పిమా కౌంటీలో వరుణ్‌పై మరో దాడి కేసు నమోదైనట్లు కోర్టు రికార్డులు వెల్లడిస్తున్నాయి. యూనివర్సిటీ ఆఫ్ అరిజోనాలో చదువుతున్న సమయంలో జరిగిన గొడవ కారణంగా అతడిని యూనివర్సిటీ నుంచి బహిష్కరించినట్లు సమాచారం.
బ్రేకప్ తో వివాదం
దర్యాప్తులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఆగస్టు 5న సలాజర్ రూమ్‌మేట్స్ ఆమె బెడ్‌రూమ్ నుంచి పెద్దగా అరుపులు వినిపించడాన్ని గమనించారు. అనంతరం ఆమెకు మెసేజ్ చేసి ఏం జరిగిందని అడిగారు. అందుకు సలాజర్ తాను బాగానే ఉన్నానని, ఆ శబ్దాలు తమ మధ్య జరిగిన వాగ్వాదం కారణంగా వచ్చాయని సమాధానం ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. అయితే సలాజర్ అప్పటికే వరుణ్‌తో తన సంబంధాన్ని ముగించాలని నిర్ణయించుకున్నట్లు దర్యాప్తు అధికారులు తెలుసుకున్నారు. హత్య జరిగిన సమయంలో వరుణ్ అమెరికాలో చట్టబద్ధమైన ఇమ్మిగ్రేషన్ స్టేటస్‌లో ఉన్నట్లు సమాచారం. అయితే అప్పటికే అతడు యూనివర్సిటీ నుంచి బహిష్కరణకు గురయ్యాడు. ఇటీవల ఉద్యోగాన్ని కూడా కోల్పోయినట్లు, దీంతో అద్దె చెల్లించడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు స్థానిక కథనాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం వరుణ్ జర్మనీ అధికారుల అదుపులో ఉన్నాడు. అతడిని అమెరికాకు అప్పగించే (ఎక్స్‌ట్రడిషన్) ప్రక్రియ కొనసాగుతోంది. జర్మనీ నుంచి అరిజోనాకు తీసుకువచ్చిన అనంతరం పిమా కౌంటీ అడల్ట్ డిటెన్షన్ కాంప్లెక్స్‌లో అతడిని ఉంచి, అరెస్ట్ వారెంట్‌లో పేర్కొన్న ఫస్ట్ డిగ్రీ హత్య, కిడ్నాప్ ఆరోపణలపై తదుపరి న్యాయ ప్రక్రియ చేపట్టనున్నారు.




