ముంబైలో రెడ్ అలర్ట్..!
మహారాష్ట్రలోని ముంబై, రత్నగిరి, థానే జిల్లాలకు ఐఎండీ శనివారం రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ముంబైలో శుక్రవారం ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుండటంతో నిండు కుండలా తయారైంది.

మహారాష్ట్రలోని ముంబై, రత్నగిరి, థానే జిల్లాలకు ఐఎండీ శనివారం రెడ్ అలెర్ట్ జారీ చేసింది. శుక్రవారం ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుండటంతో ముంబై నిండు కుండలా తయారైంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇవాళ కూడా అక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలుకురిసే ఛాన్స్ ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే 24 గంటల్లో ముంబై, పాల్‌గఢ్, రత్నగిరి, రాయ్‌గఢ్, థానేలలో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఈ క్రమంలో అధికారులంతా అప్రమత్తంగా వ్యవహరించాలని, ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించింది. రెండు రోజులు పాటు విద్యుత్, ట్రాఫిక్ వ్యవస్థకు అంతరాయం కలిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. శుక్రవారం కురిసిన వర్షాలకే అతలాకుతలమైన ముంబైలో.. ఉదయం 8.30 నుంచి రాత్రి 8.30 గంటల మధ్య 161.4 మి.మీ వర్షపాతం నమోదైనట్లు ఐఎండీ పేర్కొంది. సముద్రంలో భారీ స్థాయిలో అలలు ఎగిసిపడుతున్న నేపథ్యంలో ప్రజవెవరూ తీరంవైపు వెళ్లొద్దని హెచ్చరించింది.