హైదరాబాద్ వాసులకు అలర్ట్.. తాగునీటి సరఫరాలో అంతరాయం.. పూర్తి వివరాలు ఇదిగో!
హైదరాబాద్ నగరానికి తాగునీటిని సరఫరా చేసే మంజీరా ఫేజ్-2 ప్రధాన పైప్‌లైన్‌లో రుద్రారం సమీపంలో భారీ లీకేజీ ఏర్పడటంతో పలు ప్రాంతాల్లో నీటి సరఫరా అంతరాయం కలగనుంది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించాలని జలమండలి సూచించింది. మరమ్మత్తు పనులు వేగంగా కొనసాగుతున్నాయని, అవసరమైన చోట్ల ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తామని అధికారులు తెలిపారు.

హైదరాబాద్ నగరవాసులకు జలమండలి (HMWSSB) కీలక సూచనలు చేసింది. పలు ప్రాంతాలకు తాగునీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని.. ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచించింది. హైదరాబాద్ నగరానికి తాగునీరు సరఫరా చేసే మంజీరా ఫేజ్-2 లోని కలబ్‌గూర్–పటాన్‌చెరు పంపింగ్ మెయిన్‌కు చెందిన 1500 మి.మీ. వ్యాసం గల ప్రధాన పైప్‌లైన్‌లో రుద్రారం గ్రామం సమీపంలో భారీ లీకేజీ ఏర్పడింది. ఈ భారీ లీకేజీలను అరికట్టడానికి జలమండలి అధికారులు అత్యవసర మరమ్మత్తు పనులు చేపట్టారు. దీనికి కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయాలు ఏర్పడతాయి. పనులు పూర్తి కాగానే యధావిధిగా నీటి సరఫరా పునరుద్ధరణ జరుగుతుందని జలమండలి ప్రకటనలో తెలిపింది..
జలమండలి ఎండీ అశోక్ రెడ్డి మరమ్మతుల పనులపై తాజా పరిస్థితి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్, ట్రాన్స్‌మిషన్ అధికారులు సమన్వయంతో పనులు చేపట్టాలన్నారు. సాధ్యమైనంత తొందరగా పనులు పూర్తి చేసి నీటి సరఫరాను పునరుద్ధరించాలని ఎండీ అధికారులను ఆదేశించారు. లీకేజీ వల్ల నీటి సరఫరాలో అంతరాయం కలిగిన ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగడకుండా ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయాలని సూచించారు. సాధ్యమైనంత తొందరగా పనులు పూర్తి చేసి నీటి సరఫరాను పునరుద్ధరించాలని ఎండీ అధికారులను ఆదేశించారు.
తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడే ప్రాంతాలు:
1. ఓ అండ్ ఎం డివిజన్ 17: ఆర్సీ పురం, అశోక్ నగర్, జ్యోతి నగర్, లింగంపల్లి, చందానగర్, గంగారం, మదీనాగూడ, మియాపూర్.
2. ఓ అండ్ ఎం డివిజన్ 22: బీరంగూడ, అమీన్ పూర్, భాగ్యనగర్ కాలనీ.
3. ట్రాన్స్ మిషన్ డివిజన్ 2: ఆఫ్ టేక్ పాయింట్స్, బల్క్ కనెక్షన్లు.
4. ఓ అండ్ ఎం డివిజన్ 6: ఎర్రగడ్డ, ఎస్.ఆర్.నగర్, అమీర్ పేట్.
5. ఓ అండ్ ఎం డివిజన్ 9: కేపీహెచ్ బీ కాలనీ, కూకట్ పల్లి, భాగ్యనగర్ కాలనీ ప్రగతి నగర్
కాబట్టి.. పైన పేర్కొన్న ప్రాంతాల వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోవాలని వాటర్ బోర్డు అధికారులు సూచించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
