యూపీలోని ఘాజీపూర్ లో గంగానది కలుషితం, నీటిలో తేలియాడుతున్న వందలాది మృతదేహాలు, స్థానికుల్లో భయాందోళనలు
బీహార్ లోని బక్సర్ జిల్లాలో గంగానది ఒడ్డున, నదిలోనూ డజన్లకొద్దీ మృతదేహాలు తెలియాడుతూ ప్రజలను భయాందోళనకు గురి చేయగా.. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లోని ఘాజీపూర్ జిల్లాలో కూడా అదే పరిస్థితి కనిపించింది.
బీహార్ లోని బక్సర్ జిల్లాలో గంగానది ఒడ్డున, నదిలోనూ డజన్లకొద్దీ మృతదేహాలు తెలియాడుతూ ప్రజలను భయాందోళనకు గురి చేయగా.. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లోని ఘాజీపూర్ జిల్లాలో కూడా అదే పరిస్థితి కనిపించింది. ఇక్కడ గంగానదిలో తేలియాడుతున్న వందలాది మృత దేహాలను చూసి స్థానికులు హడలిపోయారు. తీవ్ర దుర్వాసన రావడంతో అవి కుళ్లిపోయి ఉంటాయని భావిస్తున్నారు. ఇవన్నీ బహుశా కోవిడ్ రోగుల మృతదేహాలై ఉంటాయని వారు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో డెడ్ బాడీల దహనం లేదా ఖననానికి సంబంధించి ఎలాంటి గైడ్ లైన్స్ లేనందున వీటిని వీరి బంధువులు నదిలో విసరివేసి ఉంటారని ఘాజీపూర్ వాసులు అంటున్నారు. ఈ మృత దేహాల వల్ల నదినీరు చాలా కలుషితమై పోయిందని, దీంతో కోవిడ్ వైరస్ మరింత వ్యాప్తి చెంది తమకు పెను ముప్పు ఏర్పడుతుందని వీరు భయపడుతున్నారు. ఈ మృత దేహాలు ఎక్కడి నుంచి కొట్టుకు వచ్చాయన్న దానిపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
వీటిని దహనం చేయడానికి కూడా ఎవరూ ముందుకు రావడంలేదని అధికారులు పేర్కొన్నారు. వందల సంఖ్యలో ఉన్న వీటిని అసలు నది నుంచి బయటకు వెలికి తీయడమే కష్టమని, పైగా కోవిడ్ రోగులవైనందున ఒక్కరు కూడా సాహసించడం లేదని పేర్కొన్నారు. ఈ ‘విపత్కర’ పరిస్థితిని ఎలా ఎదుర్కొవాలోనని వారు తలలు పట్టుకుంటున్నారు. కాగా మోదీ ప్రభుత్వం పవిత్ర గంగానదిని ఎలా కలుషితం చేస్తోందో చూడాలని స్థానిక కాంగ్రెస్ నాయకులు ఎద్దేవా చేశారు. ఇలాంటి పరిస్థితిని గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. కోవిడ్ అదుపు విషయంలో ప్రభుత్వానికి ఒక పాలసీ అంటూ లేదని వారు విమర్శించారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Work From Homeకే ఉద్యోగినుల మొగ్గు…తాజా సర్వేలో ఆసక్తికర విషయాలు
Actress Pooja Hegde: పవర్ స్టార్ ను ఫాలో అవుతున్న బుట్టబొమ్మ పూజా.. ఏం చేసిందో తెలుసా…