ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్.. టెలిగ్రామ్‌లో ట్రైనింగ్.. కొత్త దందాకు తెరలేపిన కూరగాయల వ్యాపారి!
రాజ్‌కోట్‌లో భారీ నకిలీ కరెన్సీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కిషన్ సోలంకి అనే కూరగాయల వ్యాపారి ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూసి, టెలిగ్రామ్ ద్వారా నకిలీ రూ. 100, రూ. 500 నోట్లు తయారు చేయడం నేర్చుకున్నాడు. అప్పుల ఊబిలో కూరుకుపోయి ఈ నేరానికి పాల్పడిన అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ముద్రణకు వాడిన పరికరాలు, ₹65,500 విలువైన నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో శిక్షణ ఇచ్చిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు.

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో నకిలీ కరెన్సీ తయారీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ రీల్ చూసిన కూరగాయల వ్యాపారి.. ఆ తర్వాత టెలిగ్రామ్ ద్వారా నకిలీ నోట్లు తయారు చేయడం నేర్చుకుని వాటిని చలామణి చేసినట్లు పోలీసులు తెలిపారు. రాజ్‌కోట్ సిటీ క్రైమ్ బ్రాంచ్, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) సంయుక్తంగా నిర్వహించిన దాడిలో నిందితుడు కిషన్ సోలంకి అరెస్టయ్యాడు.
మండదుంగర్ ప్రాంతంలోని ఓ ఇంట్లో నకిలీ రూ.100, రూ.500 నోట్లను ముద్రిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అక్కడ సోదాలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 216 నకిలీ రూ.100 నోట్లు, మూడు నకిలీ రూ.500 నోట్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఒక సీపీయూ, మానిటర్, రెండు ప్రింటర్లు, లామినేటర్ హీటర్ మెషీన్, బటర్ పేపర్, నకిలీ నోట్ల ముద్రణకు ఉపయోగించిన కాగితాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం స్వాధీనం చేసుకున్న సామాగ్రి విలువ సుమారు రూ.65,500గా పోలీసులు వెల్లడించారు.
ప్రాథమిక విచారణలో సోలంకి తాను కూరగాయల వ్యాపారం చేస్తూ తక్కువ ఆదాయం కారణంగా అప్పుల్లో కూరుకుపోయినట్లు తెలిపినట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ రూ.100, రూ.500 నోట్ల తయారీకి సంబంధించిన ఓ రీల్ చూసినట్లు చెప్పారు. ఆ వీడియో వెనుక ఉన్న వ్యక్తిని సంప్రదించగా.. టెలిగ్రామ్ ద్వారా నకిలీ కరెన్సీ తయారీ ప్రక్రియను నేర్పినట్లు పోలీసులు తెలిపారు. సోలంకి తన శిక్షకుడికి రూ.10 వేల విలువైన నకిలీ నోట్లు ఇచ్చినట్లు, అందుకు ప్రతిగా రూ.3 వేలు చెల్లించినట్లు విచారణలో వెల్లడైంది. ఈ వ్యవహారంలో శిక్షణ ఇచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
సోలంకి పెద్ద మొత్తంలో నకిలీ నోట్లను విక్రయించకుండా.. చిన్నచిన్న కొనుగోళ్ల ద్వారా వాటిని స్వయంగా చలామణి చేసినట్లు దర్యాప్తులో తేలింది. గత నాలుగు నుంచి ఐదు నెలల్లో సుమారు 40 నకిలీ రూ.100 నోట్లను చలామణి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటీవల జరిగిన జన్మాష్టమి జాతరను కూడా ఇందుకు ఉపయోగించుకున్నట్లు తెలిపారు. నకిలీ నోట్లు ఇంకా ఎక్కడెక్కడ చలామణి అయ్యాయో, ఇప్పటివరకు ఎన్ని నోట్లు ముద్రించాడో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో కోర్టు సోలంకికి మూడు రోజుల పోలీస్ రిమాండ్ మంజూరు చేసింది. నకిలీ కరెన్సీ వ్యవహారంలో మరెవరైనా ఉన్నారా అనే కోణంలోనూ విచారణ కొనసాగుతోంది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
