Godzilla El Nino: ప్రపంచాన్ని వణికిస్తున్న గాడ్జిల్లా ఎల్ నినో.. భారత్‌కు పెను ముప్పు తప్పదా..?
పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన అత్యంత శక్తివంతమైన ‘గాడ్జిల్లా ఎల్ నినో’ ప్రపంచ దేశాలకు కొత్త వాతావరణ సవాళ్లను విసురుతోంది. గత 150 ఏళ్లలోనే అత్యంత బలమైన ఎల్ నినోగా ఇది మారే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత్‌లో మాన్సూన్ వర్షాలు తగ్గడం, ఖరీఫ్ పంటలపై తీవ్ర ప్రభావం, నీటి కొరత, ఆహార ధరల పెరుగుదల వంటి పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉంది.

పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన అత్యంత శక్తివంతమైన ఎల్ నినో ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేస్తోంది. గత 150 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా అత్యంత బలమైన ఎల్ నినోగా ఇది మారనుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని తీవ్రత దృష్ట్యా, వాతావరణ శాస్త్రవేత్తలు దీనికి అనధికారికంగా గాడ్జిల్లా ఎల్ నినో అని పేరు పెట్టారు.కొద్ది నెలల క్రితం వరకు లా నినా ప్రభావంతో చల్లగా ఉన్న పసిఫిక్ ప్రాంతంలో, ఇప్పుడు అనూహ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి. యూఎస్ నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (NOAA) అధికారికంగా ఎల్ నినో ఏర్పడినట్లు ధృవీకరించింది.నవంబర్ – జనవరి మధ్య ఇది మరింత బలపడి, 1950 తర్వాత నమోదైన అత్యంత శక్తివంతమైన ఎల్ నినోలలో ఒకటిగా నిలిచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఎల్ నినో పరిస్థితులను ప్రపంచవ్యాప్తంగా వాతావరణ శాస్త్రవేత్తలు నిశితంగా గమనిస్తున్నారు.
మరింత ఆజ్యంపోయనున్న భూతాపం
ప్రస్తుత ఎల్ నినోకు, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భూతాపానికి దగ్గరి సంబంధం లేకపోయినా, ఈ రెండింటి కలయిక వినాశకరంగా మారుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూమి ఇప్పటికే వేడెక్కి ఉండటంతో, దానికి ఎల్ నినో వేడి తోడై, ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయికి చేరే ప్రమాదం ఉంది.
భారత్‌పై గాడ్జిల్లా ఎల్ నినో ప్రభావం
ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడుతున్న శక్తివంతమైన గాడ్జిల్లా ఎల్ నినో భారతదేశ వాతావరణం, వ్యవసాయం, ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.భారత వాతావరణ శాఖ 2026 మాన్సూన్ వర్షపాతం లాంగ్ పీరియడ్ యావరేజ్ (LPA)లో 90-92 శాతం మాత్రమే ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇది బీలో నార్మల్ వర్షపాతం. ఎల్ నినో కారణంగా మాన్సూన్ విండ్స్ బలహీనపడటం వల్ల సెప్టెంబర్ వరకు వర్షాలు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా జూలై-ఆగస్టు నెలల్లో వర్షపాతం బలహీనంగా ఉండే అవకాశం ఎక్కువ. ఇప్పటికే ఈ ఏడాది జూన్‌లోనే 40 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఎల్ నినో సంవత్సరాల్లో 60 శాతం కంటే ఎక్కువ సార్లు భారత్‌లో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదైంది. 2015-16 సూపర్ ఎల్ నినో సమయంలో వర్షాలు 86 శాతం మాత్రమే ఉండటంతో వ్యవసాయం తీవ్రంగా దెబ్బతింది..
ఈ ఎల్ నినో పరిస్థితుల వల్ల ఖరీఫ్ పంటలు (వరి, మొక్కజొన్న, పప్పులు, పత్తి, నూనెగింజలు) తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది.. ఇప్పటికే వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. ఇక వర్షాధార వ్యవసాయం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నీటి కొరత, పంటలు ఎండిపోయే ప్రమాదం ఎక్కువగా ఉండనుంది. రిజర్వాయర్లు, భూగర్భజలాలు తగ్గి రబీ సీజన్‌ను కూడా ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. ఆహార ధరలు పెరిగి ద్రవ్యోల్బణం ముప్పు ఏర్పడే అవకాశం ఉంది. రైతు ఆదాయాలు తగ్గడం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడే అవకాశం ఉంది. భారత దేశం వ్యవసాయ దేశం.. వ్యవసాయం GDPలో 14-18 శాతం ఉండటం వల్ల మొత్తం ఆర్థిక వృద్ధిపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది.. ఈ ఎల్ నినో పరిస్థితుల వల్ల ఉత్తర, మధ్య భారత్ రాష్ట్రాలు ఎక్కువగా ప్రభావితం అయ్యే అవకాశం ఉంది.
ఇతర ప్రాంతాలపై ఎలాంటి ప్రభావం?
ఎల్ నినో వల్ల ఆస్ట్రేలియా, ఆగ్నేయాసియా, ఇండోనేషియా ప్రాంతాలలో తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది. అమెరికాలో తుఫానులు సంభవించి, దక్షిణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు, తీరప్రాంత వరదలు వచ్చే ముప్పు ఉంది. ఎల్ నినో ప్రభావం గరిష్ట స్థాయికి చేరిన తర్వాత, 2027 నాటికి ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిని చేరే అవకాశం ఉంది. దీనివల్ల వ్యవసాయం, మత్స్య పరిశ్రమ పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.
ఆందోళన వద్దు.. అప్రమత్తత ముఖ్యం
ఈ అంచనాలు ఆందోళన కలిగించినప్పటికీ, వాతావరణ పరిస్థితులు నిరంతరం మారుతుంటాయని, కాబట్టి అనవసరమైన భయాందోళనలకు లోనుకావద్దని నిపుణులు సూచిస్తున్నారు. రైతులు నీటి సంరక్షణ, డ్రిప్ ఇరిగేషన్, తట్టుకునే మిల్లెట్స్ పంటలు, పంట బీమా సౌకర్యాలు సహా సకాలంలో ప్రభుత్వం ఇచ్చే సలహాలులను పాటించాలి. ఆధునిక సాంకేతికత, సాగునీటి సౌకర్యాలు గతంతో పోలిస్తే మెరుగైన పరిస్థితి ఉన్నా తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి. ప్రకృతి ప్రకోపించే అవకాశం ఉన్నందున ప్రభుత్వాలు, పరిశ్రమలు, ప్రజలు ముందుగానే విపత్తు నిర్వహణ ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ఈ గాడ్జిల్లా ఎల్ నినో వాతావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో చూడాలి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
