Suicide: కీసరలో దారుణం.. అవమానం భరించలేక.. కుటుంబం బలవన్మరణం..
Family suicide: మేడ్చల్ పరిధిలోని నాగారం మునిసిపాలిటీ కేంద్రం కీసరలో దారుణం చోటుచేసుకుంది. చేయని తప్పుకు తనను వేదిస్తున్నారనే అవమానంతో తన ఇద్దరు పిల్లలతో సహా..
Family suicide: మేడ్చల్ పరిధిలోని నాగారం మునిసిపాలిటీ కేంద్రం కీసరలో దారుణం చోటుచేసుకుంది. చేయని తప్పుకు తనను వేదిస్తున్నారనే అవమానంతో తన ఇద్దరు పిల్లలతో సహా.. భార్యాభర్తలు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ దారుణ సంఘటన కీసర పోలీస్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకున్నది. కీసర సీఐ జె.నరేందర్‌గౌడ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. యాదాద్రి జిల్లా రాజపేట మండలం రేణుకుంట గ్రామానికి చెందిన పల్ల పు భిక్షపతి, ఉష దంపతులు.. బతుకుదెరువు కోసం పదేళ్ల క్రితం నాగారం వచ్చారు. భిక్షపతి ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో నాలుగు నెలల కిందట నాగారంలోని వెస్ట్ గాంధీనగర్‌కు ఇంటిని మార్చి అక్కడే ఉంటున్నాడు.
ఈ క్రమంలో పక్కనే ఓ ఇంట్లో ఉన్న యువతి పట్ల భిక్షపతి అసభ్యంగా ప్రవర్తించాడని స్థానికులు ఆరోపించడంతో.. పాటు గురువారం రాత్రి భిక్షపతిపై దాడి చేశారు. శుక్రవారం ఉదయం పెద్దల సమక్షంలో మాట్లాడుదామని చెప్పి వెళ్లిపోయారు. అయితే కులం పంచాయతీ పెట్టి డబ్బులు వసూలు చేయడానికి స్థానికులు పూనుకున్నారు. యువతిని వేధించినందుకు రూ.5లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసిన్నట్లు సమాచారం. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన భిక్షపతి ముందు భార్య ఉష, ఇద్దరు పిల్లలు యశ్వంత్ (10), అక్షిత(7)లకు ఉరివేసిన అనంతరం భిక్షపతి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
శుక్రవారం ఉదయం గమనించిన స్థానికులు కీసర పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గమనించగా.. భార్య, ఇద్దరు పిల్లలు మంచంమీద మృతిచెంది ఉండగా.., భిక్షపతి ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు. ఈ మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు.
ఇదిలాఉంటే.. తప్పుడు ఆరోపణలు చేస్తూ.. తనను అవమానించారని, అంతేకాకుండా రూ.5 లక్షలు ఇవ్వాని డిమాండ్ చేస్తున్నారని భిక్షపతి సూసైడ్ నోట్‌లో వెల్లడించారు. అవమానం భరించలేకనే తన భార్య, పిల్లలతో పాటు తానుకూడా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు నోట్‌లో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
Also Read: