Indian Railways: రైళ్లలో విస్తృతంగా టికెట్ చెకింగ్ డ్రైవ్‌లు.. టికెట్ లేకుండా ప్రయాణికుల నుంచి రూ. 9.5 కోట్లు వసూలు
Indian Railways News: టిక్కెట్ కొని ట్రావెల్ చేసే రైల్వే ప్రయాణికులు మాత్రమే రైళ్లలో ప్రయాణించేలా ఇంటెన్సివ్ టికెట్ చెకింగ్ డ్రైవ్‌లను నిర్వహిస్తుంది..
Ticketless passengers: రైల్వే వినియోగదారులకు మెరుగైన సేవలను అందించడంతో పాటు టికెట్ లేని రైలు ప్రయాణాన్ని అరికట్టేందుకు భారతీయ రైల్వే కఠిన చర్యలు చేపట్టింది. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా టిక్కెట్ కొని ట్రావెల్ చేసే రైల్వే ప్రయాణికులు మాత్రమే రైళ్లలో ప్రయాణించేలా ఇంటెన్సివ్ టికెట్ చెకింగ్ డ్రైవ్‌లను నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా సెంట్రల్ రైల్వే జోన్ అయిన ముంబై డివిజన్ సబర్బన్, సబర్బన్ కాని ప్రాంతాలలో క్రమం తప్పకుండా రైళ్లలో తనిఖీలు చేపడుతోంది. ఈ క్రమంలో 2021 మే నెలలో టికెట్ లేని, లేదా సక్రమంగా ప్రయాణించని ప్రయాణీకులపై సెంట్రల్ రైల్వే 54,000 కేసులు మోపింది. తద్వారా రూ. 3.33 కోట్లు పెనాల్టీగా వసూలు చేశారు. వీటిలో సబర్బన్ విభాగంలో 32,000 కేసులు మోపడం ద్వారా 1.65 కోట్ల రూపాయలు, సబర్బన్యేతర విభాగంలో 22,000 కేసుల ద్వారా 1.68 కోట్ల రూపాయలు వసూలయ్యాయి.
ఇక, ఏప్రిల్ 1, 2021 నుండి 20 మే 2021 మధ్య సబర్బన్ కాని రైళ్లు, సబర్బన్ రైళ్ళలో జరిమానాల ద్వారా 9.50 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు సెంట్రల్ రైల్వే పేర్కొంది. టికెట్ లేని.. సక్రమంగా ప్రయాణించని ప్రయాణీకులపై మొత్తంగా 1.50 లక్షల కేసులు పెట్టినట్టు తెలిపింది.
కరోనా నేపథ్యంలో మాస్క్ లేకుండా రైళ్లలో ప్రయాణించిన వారిపై ఇదే సమయంలో 1269 కేసులు పెట్టి జరిమానాలు వసూలు చేసినట్టు ప్రకటించింది.