అదిగో పులి…ఇదిగో టెన్షన్.. జనావాసాల్లోకి వన్యమృగాలు.. గుంపులు గుంపులుగా దాడి..!
జంగిల్ రాజ్..! ఇది తెరపై కనిపించే సినిమా కాదు.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్న రియల్ వైల్డ్ అలర్ట్ స్టోరీ..! తెలుగు రాష్ట్రాల నలుమూలలా పులుల గాండ్రింపులు వినిపిస్తున్నాయి! అరణ్యంలో గర్జించాల్సిన క్రూర మృగాలు.. జనారణ్యంలో గాండ్రిస్తున్నాయి. అడవి హద్దులు దాటి.. ఊరి గుమ్మం ముందుకు వచ్చి నిలబడ్డ ఈ క్రూర మృగాలతో జనం వణికిపోతున్నారు.

జంగిల్ రాజ్..! ఇది తెరపై కనిపించే సినిమా కాదు.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్న రియల్ వైల్డ్ అలర్ట్ స్టోరీ..! తెలుగు రాష్ట్రాల నలుమూలలా పులుల గాండ్రింపులు వినిపిస్తున్నాయి! అరణ్యంలో గర్జించాల్సిన క్రూర మృగాలు.. జనారణ్యంలో గాండ్రిస్తున్నాయి. అడవి హద్దులు దాటి.. ఊరి గుమ్మం ముందుకు వచ్చి నిలబడ్డ ఈ క్రూర మృగాలతో జనం వణికిపోతున్నారు. గోదావరి తీరం నుంచి రాయలసీమ కొండల వరకు, ఏలూరు ఏజెన్సీ నుంచి సిరిసిల్ల అడవుల వరకు.. ఇప్పుడు ఎటు చూసినా ‘పులి’ భయం ప్రజలను వెంటాడుతోంది.
గోదావరి తీరంలో సాగుతున్న ఆ ‘పెద్దపులి’ వేట ఒక హై-వోల్టేజ్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. రెండ్రోజుల క్రితం సీతానగరం మండలం పెదపూడి దగ్గర్లో మొక్కజొన్న తోటలో సంచరించిన పెద్దపులి తర్వాత తొర్రేడు వైపు వచ్చింది. అక్కడ రెండు ఆవుల్ని చంపేసింది. దీంతో.. జనం పొలాల్లోకి వెళ్లాలంటేనే హడలిపోతున్నారు. ప్రస్తుతం పులి జాడ కనిపెట్టేందుకు 15 ట్రాప్ కెమెరాలు, 2 బోన్లు ఏర్పాటు చేశారు. ఇది ఛత్తీస్‌గఢ్ వైపు నుంచి వచ్చినట్టు ఫారెస్ట్ అధికారుల అంచనా చేస్తున్నారు. ఈ పెద్దపులి వయసు రెండు – మూడు ఏళ్లు ఉంటుందని అధికారులు చెప్తున్నారు. పాదముద్రలను బట్టి ఇంకా ఈ ప్రాంతంలోనే పులి తిరుగుతున్నట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజలను మరికొద్ది రోజులు అప్రమత్తంగా ఉండాలంటున్నారు. ఈ పులి భయం కారణంగా స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. నిన్న రాత్రి పులి రోడ్డుదాటి మరోవైపు వెళ్లినట్టు ఫారెస్ట్ అధికారులు గుర్తించారు.
ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో పెద్దపులి గాండ్రింపులు గడగడలాడిస్తున్నాయి. తెలంగాణ నుంచి జీలుగుమిల్లి మీదుగా ప్రవేశించిన ఈ పులి, ప్రస్తుతం బుట్టాయగూడెం, కొయ్యలగూడెం మండలాల్లో వరుస దాడులతో హడలెత్తిస్తోంది. గత ఐదు రోజుల్లోనే ఆరు ఆవులు, నాలుగు గేదె దూడలపై దాడి చేసి చంపేసింది. మంచులవారిగూడెం క్రాస్ రోడ్ సమీపంలో పులి కనిపించినట్లు ప్రయాణికులు చెబుతున్నారు. పులి కదలికలను కనిపెట్టేందుకు అటవీశాఖ అధికారులు ఇప్పటికే 40 ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. అలాగే, పులిని బంధించేందుకు రెండు బోన్లను సిద్ధం చేస్తున్నారు.
అనంతపురం జిల్లాలో చిరుత పులి దాడి కలకలం రేపుతోంది. బుక్కరాయసముద్రం మండలంలో పొలంలో పని చేసుకుంటున్న ఆదిలక్ష్మమ్మ అనే మహిళపై చిరుత ఒక్కసారిగా పంజా విసిరింది. ఈ దాడిలో ఆమె చేతికి తీవ్ర గాయాలవ్వగా, స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడ చికిత్స పొందుతున్నారు. ఇక శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు మండలం పట్రవాండ్లపల్లి చెరువు కట్ట సమీపంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఒక వ్యక్తికి చిరుత కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. చిరుత సంచరించిన ప్రాంతాల్లో అటవీ శాఖ అధికారులు పాదముద్రలను గుర్తించారు. అటవీ ప్రాంతాలకు సమీపంలో ఉండేవారు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఇటు తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల అడవుల్లో సీన్ మరింత హారర్‌గా మారింది. ఇక్కడ కనిపిస్తున్నది ఒకటో రెండో చిరుతలు కాదు.. ఏకంగా ఒక గుంపు! సుమారు 38 వేల ఎకరాల అటవీ ప్రాంతాన్ని తన అడ్డాగా మార్చుకున్న ఐదు నుంచి ఆరు చిరుతలు, ఇప్పుడు తమ కూనలకు వేట నేర్పిస్తున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి తదితర మండలాల్లో చిరుతల సంచారం ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. గ్రామాల సమీపంలోని పశువుల పాకలపై దాడులు చేస్తుండటంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇవి ముఖ్యంగా నీటి వసతి ఉన్న చోట మాటువేసి ఆవులు, మేకలు, గొర్రెలపై దాడులు చేస్తుండటంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పొలాలకు వెళ్లే రైతులు ఒంటరిగా వెళ్లకుండా గుంపులుగా వెళ్లాలని, చేతిలో కర్రలు ఉంచుకోవాలని అధికారులు సూచించారు. పశువులను బహిరంగ ప్రదేశాల్లో కట్టేయవద్దని కోరుతూ, అటవీశాఖ గస్తీని ముమ్మరం చేసింది.
అటవీ ప్రాంత గ్రామాల్లో రైతులు పొలాల్లో పాకలు వేసి పశువులను కట్టేస్తుండగా.. కొన్ని చోట్ల ఖాళీగా ఉన్న వ్యవసాయ క్షేత్రాల్లోనే మూగజీవాలను వదిలేస్తున్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్న చిరుతలు.. ఆవులు, గేదెలతో పాటు గొర్రెలు, మేకలపై దాడులకు తెగబడుతున్నాయి. దీంతో రైతులు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు ప్రజలకు అప్రమత్తత సూచనలు జారీ చేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో గత వారం రోజులుగా పెద్దపులి సంచారం స్థానికులను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. వారం రోజుల క్రితం తుర్కపల్లి, రాజపేట మండలాల్లో తిరిగిన పులి, ఆ తర్వాత యాదగిరిగుట్ట మండలం రాళ్ల జనగాం పరిధిలోకి ప్రవేశించింది. కిష్టయ్య అనే రైతుకు చెందిన లేగదూడపై దాడి చేసి భయాందోళనకు గురి చేసింది. ఇప్పుడు తుర్కపల్లి మండలంలోని తిర్మలపూర్, శ్రీనివాస్పూర్ మీదుగా సిద్దిపేట జిల్లాలోని పీర్లపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌లోకి ప్రవేశించినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. అంతకుముందు ధర్మారం గ్రామ శివారులో ఒక రైతు కంటపడటంతో ఒక్కసారిగా కలకలం రేగింది. తిర్మలపూర్ శివారులో లభించిన పాదముద్రల ఆధారంగా పులి కదలికలను నిరంతరం పర్యవేక్షించిన అధికారులు, అది ఇప్పుడు ఎటు వైపు వెళ్తుందో ట్రాక్ చేస్తున్నారు. పొలాలకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా వెళ్లకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు. అడవికి ఆనుకుని ఉన్న గ్రామాల్లో గస్తీని పెంచారు.
చిరుత పాదం సుమారు 9 సెంటీమీటర్ల విస్తీర్ణంలో ఉంటుందని.. పెద్దపులి పాదం 15 సెంటీమీటర్లకు పైగా ఉంటుందని అధికారులు తెలిపారు. చిరుత పులి గుంపులుగా ఉన్న పశువులు, మేకలు గొర్రెల మందలో దృఢంగా ఉన్న చిన్నపాటి దూడలను ఆహారంగా తీసుకుంటుంది. ముఖ్యంగా నీటి వసతులు ఉన్న దగ్గర చిరుతల సంచారం ఎక్కువగా ఉంటుందన్నారు. రైతులు పొలాలకు ఒంటరిగా వెళ్లకుండా గుంపులుగా వెళ్లాలి. చేతిలో కర్రలు పట్టుకోవాలి. చిరుత కనిపిస్తే గట్టిగా కేకలు వేయాలి. అలా చేస్తే చిరుత భయపడి అడవిలోకి పారిపోతుందని అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు. చిరుత సంచార ప్రాంతాల్లో అటవీశాఖ గస్తీని ముమ్మరం చేసింది. ప్రజలు భయాందోళనకు లోనుకాకుండా అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి సమాచారం ఉన్నా వెంటనే అటవీశాఖకు తెలియజేయాలని అధికారులు కోరుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
