Union Budget 2026: కేంద్ర బడ్జెట్‌పై అపోలో ఛైర్మన్ ప్రతాప్ సి. రెడ్డి రియాక్షన్.. ఏమన్నారంటే..?
కేంద్ర బడ్జెట్‌పై అపోలో హాస్పిటల్స్ ఛైర్మన్ ప్రతాస్ సి రెడ్డి స్పందించారు. ఈ మేరకు బడ్జెట్‌ను ఆయన స్వాగతించారు. భారత్ వృద్ది గురించి ఈ బడ్జెట్ సందేశాన్ని పంపుతుందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు బడ్జెట్‌ను ప్రశంసిస్తూ ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు,.

ఆదివారం కేంద్ర ప్రభుత్వం 2026-2027 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను పార్లమెంట్ ఉభయసభల్లో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ బడ్జెట్‌పై దేశవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బడ్జెట్‌ను కొంతమంది ప్రశంసిస్తుండగా.. మరికొంతమంది సరిగ్గా కేటాయింపులు లేవంటూ వ్యాఖ్యానిస్తున్నారు. వ్యాపారవేత్తలు, బిజినెస్ అనలిస్టుల నుంచి కూడా భిన్నమైన వ్యాఖ్యాన్యాలు వస్తున్నాయి. ఈ క్రమంలో అపోలో హాస్పిటల్స్ ఛైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి బడ్జెట్‌పై స్పందించారు. ఆయన కేంద్ర బడ్జెట్‌ను ప్రశంసిస్తూ కీలక ప్రకటన విడుదల చేశారు. దేశంలోని పౌరులందరికీ ఆరోగ్య భరోసా అందించే విధంగా బడ్జెట్ ఉందని అభివర్ణించారు. వికసిత్ భారత్ దార్శనికతకు అనుగుణంగా ప్రజారోగ్యం, వైద్య విద్య, ఆవిష్కరణలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని ప్రశంసించారు.
“భారత్ వృద్ది, ఆరోగ్యకరమైన పౌరులు, బలమైన ఆరోగ్య వ్యవస్థకు బలం చేకూర్చేలా 2026-27 కేంద్ర బడ్జెట్ ఉంది. ప్రజారోగ్య సామర్థ్యాన్ని విస్తరించడం, నివారణను బలోపేతం చేయడం, టైర్ 2, టైర్ 3 నగరాల్లో సౌకర్యాలు మెరుగుపర్చడంపై దృష్టి పెట్టడం వంటివి వికసిత్ భారత్ దార్శనికతకు అనుగుణంగా ఉంది. బయోఫార్మా శక్తి పథకం వల్ల దేశంలో జీవ శాస్త్రాలు, ఆవిష్కరణ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రాధాన్యత ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నా. కొత్త విద్య, పరిశోధనా సంస్థల ఏర్పాటు, ఉన్నవాటిని అప్‌గ్రేడ్ చేయడం, దేశ్యాప్తంగా వెయ్యి గుర్తింపు పొందిన క్లినికల్ ట్రయల్ సైట్ నెట్ వర్క్‌ల ఏర్పాటు వంటివి ఆహ్వానిస్తున్నా. ఈ నిర్ణయాలు దేశంలో అధునాతన చికిత్స అభివృద్దిని వేగవంతం చేస్తాయి. ఆరోగ్య సంరక్షణ, జీవ శాస్త్రాల్లో ప్రపంచ గమ్యస్థానంగా భారత్ స్థానం బలోపేతం చేయడానికి ఈ నిర్ణయాలు సహకరిస్తాయి” అని ప్రతాస్ సీ రెడ్డి పేర్కొన్నారు.
వెయ్యికిపైగా మెడికల్ సీట్లను కొత్తగా తీసుకురావడం, 1.5 లక్షల మంది వైద్య సిబ్బందికి ట్రైనింగ్ ఇవ్వడం వంటివి మంచి నిర్ణయాలుగా ప్రతాప్ సీ రెడ్డి తెలిపారు. వైద్య పర్యాటకం కోసం ఐదు కేంద్రాల ఏర్పాటు, నిమ్స్-2 స్థాపన, రాంచీ, తేజ్ పూర్‌లలో అత్యున్నత మానసిక ఆరోగ్య కేంద్రాలను అప్ గ్రేడ్ చేయడం వంటివి ఆహ్వానించదగ్గవన్నారు. ఇక జిల్లా ఆస్పత్రుల్లో అత్యవసర ఆరోగ్య కేంద్రాలు, ట్రామా కేర్ సామర్థ్యాన్ని 50 శాతం పెంచడం వంటి మంచి నిర్ణయాలుగా ప్రశంసలు కురిపించారు. ఇక ప్రాణాలను రక్షించే ఔషధాలపై సుంకాలను తగ్గించడం వల్ల రోగులపై ఆర్ధిక భారం తగ్గుతుందన్నారు. కేంద్ర తీసుకున్న నిర్ణయాలుగా అనుగుణంగా తమ హాస్పిటల్స్‌లో ఆరోగ్య సేవలను మెరుగపర్చేందుకు ప్రభుత్వాలతో కలిసి పనిచేసేందుకు సిద్దంగా ఉన్నట్లు ప్రతాప్ సి రెడ్డి స్పష్టం చేశారు.
