J&J Covid-19 Vaccine: జాన్సన్ అండ్ జాన్సన్ వారి సింగిల్ డోస్ టీకాతో అరుదైన సమస్య.. హెచ్చరించిన ఎఫ్‌డీఏ!
ప్రముఖ ఔషధ తయారీ సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్ రూపొందించిన సింగిల్ డోసు కరోనా టీకాతో కాస్త జాగ్రత్త అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
FDA Warns J&J Covid-19 Vaccine Raises Risk: ప్రపంచాన్ని కుదేలు చేస్తున్న కరోనా మహమ్మారి నుంచి విముక్తి కలిగించేందుకు అందుబాటులో ఎన్నో రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇదే క్రమంలో ప్రముఖ ఔషధ తయారీ సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్ రూపొందించిన సింగిల్ డోసు కరోనా టీకాతో కాస్త జాగ్రత్త అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో చాలా అరుదుగా నరాలపై రోగనిరోధక వ్యవస్థ దాడి చేస్తున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఈ టీకా వినియోగానికి సంబంధించిన అనుమతుల పత్రంలో హెచ్చరికను జోడిస్తున్నామని అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ(ఎఫ్‌డీఏ) సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది.
సింగిల్ వ్యాక్సిన్ తీసుకున్నవారిలో వెలుగుచూస్తున్న సైడ్ ఎఫెక్ట్‌ను గిలియన్-బారే సిండ్రోమ్‌గా పేర్కొంటున్నారు నిపుణులు. ఇప్పటి వరకు అమెరికాలో 12.8 మిలియన్ల మంది జాన్సన్ సంస్థ రూపొందించిన టీకాను తీసుకున్నారు. వీరిలో 100 కేసుల్లో ఈ దుష్ప్రభావం తలెత్తినట్లు తమ దృష్టికి వచ్చిందని ఎఫ్‌డీఏ తెలిపింది. వీరిలో 95 శాతం మంది ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఏర్పడిందని పేర్కొంది. దీని వల్ల ఒకరు మరణించినట్లు వెల్లడించింది. టీకా తీసుకున్న 42 రోజుల్లోపు ఈ దుష్ప్రభావం వెలుగులోకి వచ్చినట్లు తెలిపింది. ఎక్కువగా 50 ఏళ్లు పైబడిన పురుషుల్లో ఈ సమస్య తలెత్తినట్లు పేర్కొంది.
సాధారణంగా ఏటా సీజనల్ ఫ్లూ, పుండ్లకు సంబంధించిన టీకాలు తీసుకున్న వారిలో 3,000-6,000 మందిలో గిలియన్-బారే సిండ్రోమ్‌ను గుర్తిస్తామని ఎఫ్‌డీఏ తెలిపింది. వీరిలో చాలా మంది కోలుకుంటారని తెలిపింది. దీని వల్ల కండరాల్లో బలహీనతతో మొదలై పక్షవాతం వరకు దారితీసే ప్రమాదం ఉందని పేర్కొంది. అయినప్పటికీ.. జాన్సన్ అండ్ జాన్సన్ సహా ఇతర కరోనా టీకాలను తీసుకోవడం మాత్రం మానొద్దని అమెరికా సీడీసీ స్పష్టం చేసింది. తాజాగా గుర్తించిన దుష్ప్రభావం చాలా అరుదని తెలిపింది. జాన్సన్ టీకా వల్ల తలెత్తే సమస్యలతో పోలిస్తే ప్రయోజనాలే అధికమని స్పష్టం చేసింది.
Read Also… TTD Devotees: ఫేక్ లెటర్‌తో తిరుమల దర్శనానికి వచ్చిన భక్తులు.. ఐదుగురిపై పోలీసుల కేసు నమోదు