మూర్తి కొంచెం – కీర్తి ఘనం…
Dasaradhi Krishnamacharya Special Story: మూర్తి కొంచెమె అయినప్పటికీ ఆయన కీర్తి మాత్రం ఘనం. మీర్ ఉస్మాన్‌ఖాన్ పాలనలో తెలంగాణ ప్రజల దైన్యాన్ని, ఆవేదనను, కన్నీళ్లను అగ్నిధారగా మలచి ప్రజల గొంతును గట్టిగా వినిపించిన విప్లవకారుడు, నిరసనకారుడు, ఉద్యమకారుడు ఆయన! నా తెలంగాణ కోటి రతనాల వీణ అని సగర్వంగా చాటిన కవితా పయోనిధి ఆయన.. ఆయనే దాశరథి కృష్ణమాచార్య. ఇవాళ ఆయన జయంతి. ఈ సందర్భంగా ఆ కవితా పయోనిధిని స్మరించుకుంటూ …సంస్మరించుకుంటూ నాలుగు విషయాలను, […]
Dasaradhi Krishnamacharya Special Story: మూర్తి కొంచెమె అయినప్పటికీ ఆయన కీర్తి మాత్రం ఘనం. మీర్ ఉస్మాన్‌ఖాన్ పాలనలో తెలంగాణ ప్రజల దైన్యాన్ని, ఆవేదనను, కన్నీళ్లను అగ్నిధారగా మలచి ప్రజల గొంతును గట్టిగా వినిపించిన విప్లవకారుడు, నిరసనకారుడు, ఉద్యమకారుడు ఆయన! నా తెలంగాణ కోటి రతనాల వీణ అని సగర్వంగా చాటిన కవితా పయోనిధి ఆయన.. ఆయనే దాశరథి కృష్ణమాచార్య. ఇవాళ ఆయన జయంతి. ఈ సందర్భంగా ఆ కవితా పయోనిధిని స్మరించుకుంటూ …సంస్మరించుకుంటూ నాలుగు విషయాలను, విశేషాలను తెలుసుకుందాం!
జూలై 22, 1925న వరంగల్ జిల్లా చిన్న గూడూరులో జన్మించిన దాశరథి బాల్యమంతా ఖమ్మం జిల్లా మధిరలో గడిచింది. ఉర్దూ మీడియంలో మెట్రిక్యులేషన్ వరకు చదివారు కాబట్టే ఉర్దూలో గొప్ప పట్టును సంపాదించారు, ఉస్మానియాలో ఇంగ్లీష్‌లో డిగ్రీ కంప్లీట్ చేశారు. చిన్నప్పుడే పద్యాలు అల్లడంలో ప్రావీణ్యం సంపాదించిన దాశరథికి పారశీక భాషలోనూ ప్రవేశం ఉంది. సంస్కృతం, తెలుగు చెప్పనే అక్కర్లేదు. మెట్రిక్యులేషన్ అయ్యాక కొంతకాలం ఉపాధ్యాయునిగా పని చేసిన దాశరథి డిగ్రీ అయ్యాక పంచాయతీ తనిఖీ అధికారిగా పనిచేశారు. 1956 నుంచి 1963 వరకు ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలోను, 1963 నుంచి 1971 వరకు ఆకాశవాణి మద్రాసు కేంద్రంలోను, ప్రయోక్తగా బాధ్యతలు నిర్వర్తించారు. తెలంగాణా రచయితల సంఘాన్ని నెలకొల్పారు. అగ్నిధార తర్వాత రుద్రవీణ, మహా ఆంధ్రోద్యమం, పునర్నవం, కవితా పుష్పకం, తిమిరంలో సమరం లాంటి ఎన్నో కవితాగ్రంధాలు రచించారు. కథలు, నాటికలు కూడా అనేకం రాశారు. బిరుదులు, సత్కారాలు, సన్మానాలు అనేకం అందుకున్నారు కూడా!
దాశరథి రాసిన గాలిబ్ గీతాలను చదివిన నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావుకు ఆయన రచనా శైలి అమితంగా ఆకట్టుకుంది. దరిమిలా సినిమాల్లో పాటలు రాయమని దాశరథిని దుక్కిపాటి మధుసూదనరావు కోరారు. అక్కినేని నాగేశ్వరరావు కూడా ఇదే అభిలాషను వ్యక్తపరిచారు. అయితే తనకు సినిమా సంగీత పరిజ్ఞానం లేదని దాశరథి చెప్పినా వారు వదల్లేదు. అదేం పెద్ద విషయం కాదని, మీరు అంగీకారం తెలిపితే మిగతాది మేము చూసుకుంటామన్నారు. ఇక కాదనలేక దాశరథి మద్రాసుకు వెళ్లారు. అక్కడ దాశరథికి అన్నపూర్ణ సంస్థ ఆస్థాన సంగీతదర్శకుడు సాలూరు రాజేశ్వరరావు కొన్నిబాణీలు వినిపించారు. మీరు ట్యూనుకు పాట రాస్తారా, లేక ముందు పాట రాస్తే నేను ట్యూన్ కట్టనా అని దాశరథిని అడిగారు సాలూరు. అందుకు దాశరథి ..ట్యూను ఇవ్వండి. పాట రాసేందుకు ప్రయత్నం చేస్తాను అని వినయంగా చెప్పారు. రాజేశ్వరరావు ఒక ట్యూను వినిపించి పాట రాయమన్నారు. పది నిమిషాల్లో పాట రాసేశారు దాశరథి. ఆశ్చర్యపోయారు రాజేశ్వరరావు. ఆ పాట సాహిత్యాన్ని హార్మోనియం మీద పలికిస్తూ, రాగాలాపన చేసి సరిచూసుకుంటే ట్యూన్‌కు సరిగ్గా సరిపోయింది. సాలూరివారికి దాశరథి సామాన్యుడు కాదని అర్థమయ్యింది. అదే విషయాన్ని దుక్కిపాటికి కూడా చెప్పారు.. నిజానికి దాశరథికి ఇచ్చింది ఇచ్చింది చాలా కఠినమైన ట్యూను. ది కింగ్ స్టన్ ట్రయో ఆలపించిన హ్యాంగ్ డవున్ యువర్ హెడ్ టామ్ డూలీ పాట ఆధారంగా ఇచ్చిన బాణి అది…. అదే ఖుషీ ఖుషీగా నవ్వుతూ, చలాకి మాటలు రువ్వుతూ, హుషారు గొలిపేవెందుకే నిషా కనులదానా అన్న పాట… ఉర్దూ పదాల మేలవింపుతో దాశరథి రాసిన తొలి పాట. దాశరథి రాసిన తొలి పాటే సూపర్ హిట్‌గా నిలిచింది.
అసలు దాశరథి వచ్చాకే తెలుగుపాట హోయలు పోయింది. వెన్నెల స్నానాలు చేసింది. ఖుషీ ఖుషీగా నవ్వింది. చలాకి మాటలు రువ్వింది. ఇద్దరు మిత్రులు సినిమా కోసం ఖుషీ ఖుషీగా నవ్వుతూ పాట రాశాక…రాజేశ్వరరావుగారు దాశరథికి ఓ ట్యూన్ వినిపిస్తూ… ఈ బాణీకి సాహిత్యాన్ని సమకూర్చడం అంత సులభం కాదన్నారు. అవును కష్టమేనన్నారు చుట్టుపక్కలున్నవారు. టిపికల్ ట్యూన్.. పైగా కావాల్సింది కవ్వాలి. ఇంతకీ మీకు కవ్వాలే కదా కావాల్సింది అంటూ ఓ రెండు క్షణాలు ఆలోచించి… నవ్వాలీ నవ్వాలీ నీ నవ్వులు నాకే ఇవ్వాలి అన్నారు దాశరథి. ఆశ్చర్యపోయారంతా.. సాలూరివారిచ్చిన బాణీకి ఆణిముత్యమే దొరికిందనుకున్నారు నిర్మాత దర్శకులు. లిప్తకాలంలో దాశరథి పాటమొత్తం అల్లేశారు. హైదరాబాద్ దెబ్బంటే మజాకా మరి.
ఇద్దరుమిత్రులు సినిమా నిర్మాణ సమయంలోనే ఆచార్య ఆత్రేయ దర్శకత్వంలో వాగ్దానం సినిమా తీస్తున్నారు. దాశరథిని ఆత్రేయ ఆహ్వానించి ఒక పాట రాసిపెట్టమన్నారు. సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావు నవరంగ్ సినిమాలో మాల్‌కౌస్ రాగంలో స్వరపరచిన ఆదా హై చంద్రమా రాత్ ఆధీ అనే పాట ట్యూనుని వినిపించి..ఇంచుమించు ఇలాంటి బాణిలోనే పాటకావాలన్నారు దాశరథితో! కొన్ని నిమిషాలకే నాకంటి పాపలో నిలిచిపోరా, నీ వెంట లోకాల గెలువనీరా అంటూ అద్భుతంగా రాసి ఇచ్చారు. ఆ పాటలో దాశరథి పద ప్రయోగాలు అద్భుతం. దాశరథి తొలిపాటను ఇద్దరుమిత్రులు సినిమా కోసం రాసినా, వాగ్దానం సినిమా ముందుగా విడుదలైంది.
మూగమనసులు సినిమాలో గోదారి గట్టుంది అనే పాట గుర్తుండే వుంటుంది. ఇదీ అంతే..దీని వెనుక ఓ కథ వుంది. హైదరాబాద్‌లో కంపోజింగ్.. ఆదుర్తితో పాటు ఆత్రేయ, మహదేవన్, పుహళేంది వున్నారు. సిట్టింగ్‌లో దాశరథి వచ్చి చేరారు. అప్పట్లో తమిళంలో హిట్టయిన ఓ పాటను ఆదుర్తి చిన్నగా హమ్ చేస్తూ కావేరి కరై ఇరిక్కి.. అన్నారు. వెంటనే దాశరథి అందుకుని గోదారి గట్టుంది అన్నారు. ఆదుర్తి ఆగకుండా కరై మేలే మరమిరిక్కి అంటూ పాడారు. దాశరథి ఊరికే వుంటారా.. వెంటనే గట్టుమీద చెట్లుంది అనేశారు. ఆదుర్తి కాసేపు ఆగారు… మిగితాది చెప్పండి… సాహిత్యం చెప్పేస్తానన్నారు దాశరథి… గుర్తుకురావడం లేదండి.. అదే ఆలోచిస్తునన్నారు ఆదుర్తి…సర్లేండి… మిగతా పాటను నేనే చెప్పేస్తానంటూ… చెట్టుకొమ్మన పిట్టుంది.. పిట్ట మనసులో ఏముంది అంటూ పల్లవిని పూర్తి చేశారు దాశరథి. మరికాసేపటికే పాట పూర్తయింది. సినిమా వచ్చాక సూపర్ హిట్టయింది.
ఇలాంటిదే మంచి మనసులులోని నన్ను వదలినీవు పోలేవులే పాట. తమిళంలో హిట్టయిన కుముదం సినిమాలోని పాటకు ఇది అనుసృజన. దాశరథిని తమిళ ట్యూన్‌ను విని పాటరాయమన్నారు. దాశరథికి ఎక్కవసేపు పట్టలేదు. నిమిషాల్లో పాట వచ్చేసింది. వెంటనే మద్రాస్‌కు ట్రంకాల్ చేసి..మరీ పాట వినిపించారు. ఎక్కడా తమిళ వాసనలు లేకుండా అచ్చంగా తెలుగు సువాసలను వచ్చేలా పాట రాయడం దాశరథికి మాత్రమే చెల్లింది.
హైదరాబాద్ సోమాజిగూడలో అన్నపూర్ణ ఆఫీసుండేది. ఆత్మగౌరవం సినిమా పాటల కంపోజింగంతా ఇక్కడే జరిగింది. మద్రాస్ నుంచి రాజేశ్వరరావు బృందం వచ్చేసింది. టీమంతటికీ అక్కడే భోజనాలు.. మధ్యాహ్నం దాశరథి వచ్చారు. వచ్చి రాగానే రాజేశ్వరరావు ఓ రష్యన్ ట్యూన్ వినిపించి పాట రాసేయ్యమన్నారు. తెలుగు ట్యూన్ అయితే పదాలు ఈజీగా దొరుకుతాయి. రష్యన్ ట్యూనాయే. ఆలోచనలో పడ్డారు దాశరథి. సాయంత్రమైంది. పాట కుదరడం లేదు. చీకటి పడింది.. బండి కదలడం లేదు. రాత్రి భోజనాలయ్యాక ఆరుబయట మంచాలేసుకొని పడుకున్నారంతా.. దాశరథికి నిద్రపడితేగా… సవాల్‌గా స్వీకరించాకా..నిద్ర ఎలా పడుతుంది? ఆకాశం వంక చూస్తూ ఆలోచించసాగారు. పైన వెన్నెల కురిపిస్తూ చందమామ… అంతే పల్లవి వచ్చేసింది. వెంటనే రాజేశ్వరరావుకు వినిపించానుకున్నారు. ఉత్సాహం అలాంటిది మరి. అర్ధరాత్రి నిద్రలేపితే ఏమనుకుంటారోనన్న సందిగ్ధం. ఏమైతే అయిందిలేననుకుంటూ మెల్లిగా సాలూరిని నిద్రలేపారు. మాస్టారు మరోసారి ట్యూన్ వినిపిస్తారూ…అంటూ రిక్వెస్ట్ చేశారు దాశరథి. మాస్టారు మహానుభావుడు కాబట్టి ఏ మాత్రం విసుక్కోకుండా ట్యూనంతా పాడి వినిపించారు. ఆయన ఆపాడో లేదో దాశరథి అచ్చ తెలుగులో పాటను అందుకున్నారు. ట్యూన్‌కు సరిగ్గా సరిపోయింది. భేష్ అన్నారు సాలూరి.. ఆ తర్వాత ఇద్దరూ హాయిగా నిద్రపోయారు. మర్నాటికి పాట రెడీ. అదే అందెను నేడే అందని జాబిల్లి.. నా అందాలన్నీ అతని సొంతములే అన్న పాట. డాక్టర్ చక్రవర్తిలో ఓ బొంగరాల బుగ్గలున్నదాన అన్న పాటుంది. పల్లవిలో నీ తస్సదీయా తాళలేనే అనే లైనుంది. పాట చిత్రీకరణ అయిపోయింది. సెన్సార్ వాళ్లేమో.. ఠాఠ్.. తస్సదియ్య అంటే బూతన్నారు. అబ్బే అది పల్లెపదం.. జానపదుల ఊతపదం… తప్పేమీ లేదన్నారు దాశరథి. తప్పదన్నారు సెన్సార్ బృందం. తప్పేదేముందనుకుంటూ బయటకొచ్చేశారు నిర్మాణ బృందం. బయటకొచ్చేశారు కానీ.. ఏం చేయాలో పాలు పోలేదు. తీస్తే పాట మొత్తం తీసేయాలి.. లేదా లిప్‌సింక్ చెడకుండా ఆ లైన్ మార్చాలి. అందరూ దాశరథి వంక చూశారు.. అంత రాసిన దాశరథికి ఆ లైను మాత్రం రాయడం కష్టమా? వెంటనే నువ్వు కస్సుమంటే తాళలేనే అని మార్చేశారు. సెన్సార్ ఓకే అంది. అప్పటికప్పడు సుశీలతో ఆ పాట పాడించి డబ్ చేశారు. పాటను జాగ్రత్తగా చూస్తే మనకూ తెలుస్తుంది ఆ తేడా.
అవి బి.ఎన్.రెడ్డిగారు రంగులరాట్నం సినిమా తీస్తున్న రోజులు.. దాశరథిని పిలిచి… మా సినిమాకో వెంకటేశ్వర స్వామి స్తుతిగీతం కావాలి… కొత్తగా డిఫరెంట్‌గా వుండాలి.. రోటిన్‌కు భిన్నంగా వుండాలి అన్నారు బిఎన్.. కాసేపు ఆలోచించారు దాశరథి. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో పురుషకారం వుంది. అంటే మనకు భగవంతుడికి మధ్య అమ్మవారుండటం. అమ్మవారి చేత మన కష్టాలన్నీ స్వామివారికి చెప్పించడం. ఓ రకంగా సిఫార్సు చేయడమన్నమాట. అలివేలుమంగను ప్రార్థిస్తూ..వెంకటేశ్వరస్వామిని కోరుకోవడం.. అంతే నడిరేయి ఏ జాములో పాట పుట్టింది. బిఎన్‌కు వినిపించారు దాశరథి. అద్భుతమన్నారు. సినిమా విడుదలయ్యాక ప్రజలు కూడా అద్భుతమన్నారు.
ఇవే కాదు…కొన్ని వందల కొద్దీ వైవిధ్య గీతాలను రాశారు దాశరథి. మచ్చుకు తిరుమల మందిర సుందరా, నను పాలింపగ నడచీ వచ్చితివా, శరణం నీ దివ్య చరణం, రారా కృష్ణయ్యా రారా కృష్ణయ్యా , తనివి తీరలేదే నా మనసు నిండలేదే, వెన్నెలరేయి ఎంతో చలీ చలీ, ఓ చెలీ కోపమా అంతలో తాపమా, విన్నవించుకోనా చిన్న కోరికా, ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఈవేళ నాలో ఎందుకో ఆశలు పాటలు కొన్ని. వీణ పాటలు రాయాలంటే దాశరథే కావాలి..వాటిలో కొన్ని పాడెద నీ నామమే గోపాలా, వేణుగానలోలునిగన వేయి కనులు చాలవులే, నేనె రాధనోయి గోపాలా, మ్రోగింది వీణా పదేపదే హృదయాల లోనా, మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నొ చెలరేగే. ఆ మాటకొస్తే దాశరథి రాసిన ప్రతీపాట ఆణిముత్యమే –బాలు