AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క‌రోనా వ్యాప్తిపై.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్న ఈ వీడియోల‌ను అస్స‌లు న‌మ్మ‌వ‌ద్దు..

ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టా.. వాట్‌నాట్‌. ఇప్పుడంతా సోషల్‌మీడియానే. పొద్దున లేచాక ఓ సెల్ఫీ.. కాసేపటికి ఓ థియరీ. మనసుకు ఏది తోస్తే అది రాసేయడమే. ఏ వీడియో వస్తే దాన్ని షేర్‌ చేసేయడమే. అది రియలో, ఫేకో సంబంధం లేదు. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అన్నట్లు.. వీడియో వచ్చిందా, చూశామా, షేర్‌ చేశామా అనేలా మారిపోయింది పరిస్థితి. ప్రస్తుతం కరోనా కరాళ నృత్యం చేస్తోంది. వైరస్‌ దెబ్బకు అగ్రరాజ్యాలకు సైతం చుక్కలు కనబడుతున్నాయి. మనదగ్గర లాక్‌డౌన్‌ కారణంగా […]

క‌రోనా వ్యాప్తిపై.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్న ఈ వీడియోల‌ను అస్స‌లు న‌మ్మ‌వ‌ద్దు..
Ram Naramaneni
| Edited By: |

Updated on: Apr 06, 2020 | 5:18 PM

Share

ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టా.. వాట్‌నాట్‌. ఇప్పుడంతా సోషల్‌మీడియానే. పొద్దున లేచాక ఓ సెల్ఫీ.. కాసేపటికి ఓ థియరీ. మనసుకు ఏది తోస్తే అది రాసేయడమే. ఏ వీడియో వస్తే దాన్ని షేర్‌ చేసేయడమే. అది రియలో, ఫేకో సంబంధం లేదు. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అన్నట్లు.. వీడియో వచ్చిందా, చూశామా, షేర్‌ చేశామా అనేలా మారిపోయింది పరిస్థితి. ప్రస్తుతం కరోనా కరాళ నృత్యం చేస్తోంది. వైరస్‌ దెబ్బకు అగ్రరాజ్యాలకు సైతం చుక్కలు కనబడుతున్నాయి. మనదగ్గర లాక్‌డౌన్‌ కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. పనులేం లేవు. ఇంకేముంది.. మామూలుగానే ఫోన్‌తో ఓ ఆటాడుకుంటూ ఉంటారు. అలాంటిది ఖాళీగా ఉంటే వదులుతారా? సరిగ్గా ఈ సమయంలోనే సన్నాఫ్‌ సత్యమూర్తి సినిమా డైలాగ్‌ గుర్తుకొస్తుంది. అందరికీ రెండు చేతులుంటే వాడికి మూడు చేతులుంటాయి. ఆ మూడోది కత్తి. అయితే ఇప్పుడు చాలామందికి మూడు చేతులుంటున్నాయి. కాకపోతే ఆ మూడోది ఫోన్‌. ఏదిబడితే అది సోషల్‌మీడియాలో పెట్టేస్తున్నారు. ఇష్టం వచ్చినట్లు రాసేస్తున్నారు. దీనివల్ల ఫేక్‌ న్యూసులు పెరిగిపోతున్నాయి. ఏది రియలో.. ఏది వైరలో అర్థం కాని పరిస్థితి.

కరోనా నేపథ్యంలో సోషల్‌మీడియాలో కొన్ని వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. వాటిలో కొన్నింటిపై టీవీ9 క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. ముందుగా ఇక్కడ చూడండి. కొంతమంది కలిసి ఖాళీ ప్లేట్లను, స్పూన్లను నాకుతున్నారు. ఈ వీడియోను వైరల్‌ చేశారు కొందరు. దేశంలో కరోనా వ్యాప్తి చేస్తున్నారంటూ కామెంట్లు పెట్టేశారు. నిజానికి ఈ వీడియో 2018లోది. అప్పట్లోనే ట్విట్టర్‌లో పోస్ట్‌ అయింది. బొహ్రా సంప్రదాయంలో భాగంగా.. దేవుడిచ్చిన ఒక్క మెతుకును కూడా వేస్ట్‌ చేయకూడదనే భావనలో ఇలా చేస్తారు. సమిష్టి భోజనంలో ప్లేట్లు, స్పూన్లను నాకుతారు. సో ఇది ఫేక్‌ వీడియో. కరోనాకు సంబంధం లేదు. ఇక ఇక్కడ చూడండి. తోపుడు బండిపై పండ్లు అమ్ముకుంటూ ఉన్న వ్యక్తి నోటితో చేతివేళ్లకు తడి చేసుకుంటున్నాడు. కరోనాను వ్యాప్తి చేస్తున్నాడని.. ఈయన్ను సోషల్‌మీడియాకు ఎక్కించేశారు. రాత్రికి రాత్రే అందరి ఫోన్లలోకి నెట్టేశారు. నిజానికి ఈ వీడియో ఇప్పటిది కాదు. ఎందుకంటే ప్రస్తుతం అంతా లాక్‌డౌన్‌ నడుస్తోంది. వీడియోలో చూస్తే అతని వెనక జనం రద్దీ కనిపిస్తోంది. పైగా ఒక్కరు కూడా మాస్కు ధరించలేదు. దీన్నిబట్టి ఆ వీడియో పాతదని అర్థం అవుతోంది. మ‌రో వీడియోలో.. పోలీసులు ఓ వ్యక్తిని వ్యానులో తీసుకెళ్తున్నారు. తర్వాత అతను పోలీసులతో గొడవ పడతాడు. ఉమ్మేస్తాడు. కావాలనే కరోనాను వ్యాప్తి చేసేందుకు ఆ వ్యక్తి అలా చేశాడని ప్రచారం జరిగింది. నిజమేంటంటే.. ఈ వీడియో పాతది. కరోనా ఆంక్షలు లేని కాలంలోనిది. ముంబైలోని ఓ ఖైదీ వీడియో. అప్పటి వీడియోను మనోళ్లు ఇప్పుడు పోలీసుల మీద ఉమ్మేసి కరోనాను వ్యాపిస్తున్నాడంటూ రెచ్చగొట్టే కామెంట్స్‌ పెట్టేశారు. ఇక ఈ వీడియో చూడండి.. ప్రార్థనల్లో భాగంగా కొంతమంది ఊగిపోతున్నారు. దీన్ని కూడా కరోనాకు వాడేసుకున్నారు కొందరు. అందరూ కలిసి బలంగా తుమ్ముతూ కరోనాను వ్యాప్తి చేస్తున్నారని వీడియోను వైరల్‌ చేశారు. అసలు నిజమేంటంటే ఈ వీడియో పాకిస్తాన్‌కు చెందింది. అక్కడ కొంతమంది ఇలా ప్రవర్తించారు. పైగా ఈ వీడియో మీడియాలో ఎప్పుడో ప్రసారం అయ్యింది. అప్పటి వీడియోను ఇప్పుటి కరోనాకు ముడిపెట్టారు. ఈ పాప్‌కార్న్‌ వీడియో అయితే దాదాపు అందరి దగ్గరకు చేరింది. ఓ వ్యక్తి పాప్‌కార్న్‌ ప్యాకెట్‌లో నోటితో గాలి ఊదాడు. దాన్ని కూడా కరోనా వ్యాప్తి చేస్తున్నాడని ప్రచారం చేశారు. నిజానికి ఇది కూడా పాత వీడియోనే. మలేషియాలో జరిగింది. అదికూడా 2019 మేలో. ఇంటర్‌నెట్‌లో అప్పటినుంచే ఉంది. కాకపోతే ఇప్పుడు వైరల్‌ చేశారు. ఈ వీడియోలు కొన్ని మాత్రమే.. ఇంకా ఎన్నో.. ఎన్నెన్నో వైరల్‌ అవుతున్నాయి. అవుతున్నాయి అనేకంటే.. కావాలనే వైరల్‌ చేస్తున్నారంటే కరెక్ట్‌గా ఉంటుంది.