Eluru Mystery Disease: ఏలూరులో అంతుచిక్కని వ్యాధి..తగ్గిన బాధితుల సంఖ్య..ప్రజల్లో వీడని భయం

పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరు నగరం విలవిలలాడుతోంది. కరోనా తగ్గుతోంది అని అనుకుంటే.. అంతుచిక్కని వ్యాధి వచ్చి పడిందని..

 • Ravi Kiran
 • Publish Date - 5:11 pm, Thu, 10 December 20
Eluru Mystery Disease: ఏలూరులో అంతుచిక్కని వ్యాధి..తగ్గిన బాధితుల సంఖ్య..ప్రజల్లో వీడని భయం

Eluru Mystery Disease: పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరు నగరం విలవిలలాడుతోంది. కరోనా మహమ్మారి తగ్గుతోంది అని అనుకుంటే.. అంతుచిక్కని వ్యాధి వచ్చి పడిందని అక్కడి స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఏలూరు, దెందులూరుతో పాటు ఆ చుట్టుప్రక్కల పరిసర ప్రాంతాల్లో ఈ వ్యాధి ప్రబలుతుండటంతో నాలుగు రోజులుగా జనం ఇంటికే పరిమితమయ్యారు. బయటకు అస్సలు రావడం లేదు. నీళ్లు తాగాలన్నా, తిండి తినాలన్నా, చివరకు పిల్లలకు పాలు ఇవ్వాలన్నా భయపడుతున్నారు. మరోవైపు ఈ వింత వ్యాధి బారిన పడుతున్నవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. అసలు ఈ వింత వ్యాధికి గల కారణాలు ఏంటో తెలియక వైద్యులు సతమతమవుతున్నారు. మొత్తంగా ఈ మిస్టీరియస్‌ డిసీజ్‌ అటు డాక్టర్లకు, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి సవాళ్లు విసురుతోంది.

 

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
 • 10 Dec 2020 17:11 PM (IST)

  వింత వ్యాధి తాజా పరిస్థితులపై డీసీహెచ్‌ఎస్‌ మోహన్ రివ్యూ

  నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ వైరాలజీ, నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌, ఢిల్లీ ఎయిమ్స్‌, జిల్లా వ్యవసాయశాఖ బృందాలతో తాజా పరిస్థితులపై డీసీహెచ్‌ఎస్‌ మోహన్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. బాధితుల శరీరాల్లో క్రిమిసంహారక అవశేషాలు ఉండటంతో వ్యవసాయశాఖను కూడా ఇందులో చేర్చినట్లు డీసీహెచ్‌ఎస్‌ మోహన్‌ తెలిపారు. ఈ నాలుగు బృందాలు క్షేత్రస్థాయిలో తిరిగి వ్యాధికి సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి అందించనున్నట్లు వెల్లడించారు. భార లోహాలైన సీసం, నికెల్‌, క్రిమిసంహారక అవశేషాలు, ఆర్గనో క్లోరిన్స్‌ వంటివి వింత వ్యాధికి కారణమై ఉండొచ్చని కేంద్ర బృందాలు భావిస్తున్నట్లు చెప్పారు. ఆహారం, తాగునీరు, పాలు, కూరగాయలు, ఆకుకూరలు వంటి ద్వారా బాధితుల శరీరంలోకి చేరి ఉండొచ్చని ఢిల్లీ ఎయిమ్స్‌, ఐఐసీటీ, ఎన్‌ఐఎన్‌ బృందాల పరిశోధనలో తేలినట్లు డీసీహెచ్‌ఎస్‌ మోహన్‌ వివరించారు.

 • 10 Dec 2020 17:04 PM (IST)

  వ్యాధి తీవ్రత తగ్గుతోంది: డీసీహెచ్‌ఎస్‌ మోహన్

  ఏలూరులో మిస్టరీ డిసీజ్‌కు గల కారణాలపై పరిశోధనలు కొనసాగుతున్నాయని పశ్చిమగోదావరి జిల్లా వైద్య విధానపరిషత్‌ డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ ఏఆర్‌ మోహన్‌ తెలిపారు. ఒకట్రెండు రోజుల్లో వ్యాధికి గల కారణాలు నిర్ధారణ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. గత ఆరు రోజులతో పోల్చుకుంటే కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినట్లు తెలిపారు. గత రాత్రి నుంచి ఇప్పటివరకు కొత్తగా 6 కేసులు మాత్రమే నమోదయ్యాయని.. వ్యాధి తీవ్రత కూడా తగ్గుతోందన్నారు.

 • 10 Dec 2020 16:49 PM (IST)

  బాగా తగ్గిన వింత వ్యాధి కొత్త కేసులు

  ఇక వింత వ్యాధితో ఆస్పత్రికి వస్తున్న వారి సంఖ్య బాగా తగ్గింది. బుధవారం రాత్రి నుంచి గురువారం మధ్యాహ్నం వరకు ఎలాంటి కొత్త కేసులు నమోదు కాలేదు. ఇప్పటివరకు మొత్తం  592 కేసులు నమోదు కాగా 511 మంది డిశ్చార్జ్ అయ్యారు. 43 మంది ఏలూరు గవర్నమెంట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మెరుగైన వైద్యం కోసం 33 మందిని విజయవాడ, గుంటూరు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు .

 • 10 Dec 2020 16:30 PM (IST)

  ఏలూరు ప్రజల్ని వీడని భయం

  పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు వింత వ్యాధితో జనాలు వణికిపోతున్నారు. అస్వస్థతకు గురై వెంటనే కోలుకుంటున్నా.. స్థానికుల్ని భయం వదలడం లేదు. బాధితుల సంఖ్య బాగా తగ్గింది. అయినా కానీ ఏం కొనాలన్నా, ఏం తినాలన్నా ఒకటికి..వందసార్లు ఆలోచించాల్సి వస్తుంది. త్వరగా ఈ సమస్యకు ఓ పరిష్కారం దొరికితే బాగుండని ప్రజలు కోరుకుంటున్నారు.

 • 10 Dec 2020 16:12 PM (IST)

  62 వార్డు సచివాలయాల వద్ద మెడికల్‌ క్యాంపులు

  ఏలూరులో 62 వార్డు సచివాలయాల వద్ద మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు చేసి ఒక డాక్టర్, నర్సు, మెడికల్ స్టాఫ్, సచివాలయ సిబ్బందిని అందుబాటులో ఉంచారు. ఎవరికైనా అనారోగ్య లక్షణాలు కనిపించిన వెంటనే ప్రాథమిక చికిత్స అందించి నిమిషాల వ్యవధిలో 108 అంబులెన్సుల ద్వారా జిల్లా ఆస్పత్రికి తరలించేలా చర్యలు చేపట్టారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఇంటింటా సర్వే చేస్తూ ఆరోగ్య స్థితిపై వివరాలు సేకరిస్తున్నారు.

 • 10 Dec 2020 16:01 PM (IST)

  ఏలూరులో విసృతంగా పర్యటిస్తోన్న నిపుణులు

  ఏలూరులో అంతు చిక్కని వ్యాధి ఓ మిస్టరీలా మారింది. బాధితుల సంఖ్య తగ్గినా.. దీని వెనుక కారణాలపై క్లారిటీ రావడం లేదు. నీళ్లు, ఆహార పదార్థాల వల్ల జనాలు అస్వస్థతకు గురవుతున్నారి ప్రాథమిక అంచనాకు వచ్చారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు, ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్లు, ఐఏ బృందం, ఐపీఎం, ఐఆర్‌సీఐ బృందాలు కారణాలు ఏంటో తేల్చే పనిలో ఉన్నారు.

 • 10 Dec 2020 15:44 PM (IST)

  సోషల్ మీడియాలో వదంతులు నమ్మొద్దు

  ఏలూరు వింత వ్యాధిపై సోషల్ మీడియాలో వదంతులు నమ్మొద్దని అధికారులు కోరారు. ఎన్ సిడిసి, ఎన్ఐఎన్  సైంటిస్టులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారని.. మనుషులతో పాటు జంతువుల శాంపిల్స్ సేకరిస్తున్నామన్నారు. ఏలూరు చుట్టుపక్కల గ్రామాలలోను శాంపిల్స్ సేకరిస్తున్నారని చెప్పారు. దాల్, రైస్, వెజిటేబుల్స్, రక్తనమూనాల శాంపిల్స్ సేకరిస్తున్నారన్నారు. మూడో రోజు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఢిల్లీ వైద్య నిపుణుల బృందం పర్యటించింది.. చికిత్స పొందుతున్న భాదితులతో మాట్లాడి వివరాలు సేకరించారు.

 • 10 Dec 2020 15:27 PM (IST)

  ఈరోజు మరోమారు సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్

  ఏలూరులో ప్రబలిన మిస్టరీ డిసీజ్‌కు గల కారణాలపై జాతీయ స్థాయి శాస్త్రవేత్తల నిపుణుల టీమ్ అధ్యయనం చేస్తుంది. ఢిల్లీ ఎయిమ్స్ బృందం, ఇంకా ఏలూరులోనే పర్యటిస్తూ వ్యాధికారకాలపై పూర్తి స్థాయి అధ్యయనం చేస్తుంది ఇప్పటివరకు నీటిలో సీసం కంటెంట్ ఎక్కువగా ఉందని గుర్తించారు. మరింత లోతుగా అధ్యయనం చేసిన తర్వాత తుది నివేదికను అందించే అవకాశం ఉంది. ఈ విషయంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కేంద్ర బృందాలు, వైద్య నిపుణులతో రివ్యూ నిర్వహించి ఖచ్చితమైన కారణాలు తెలుసుకోవాలని కేంద్ర నిపుణుల బృందాలను కోరారు. ఈరోజు మరోమారు సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జాతీయ బృందాల అధ్యయన పురోగతిని, అక్కడి పరిస్థితులను తెలుసుకోనున్నారు.

 • 10 Dec 2020 15:20 PM (IST)

  ఏలూరులో కొనసాగుతోన్న సీఎస్ఆర్ఐ శాస్త్రవేత్తల పర్యటన

  ఏలూరులో  సీఎస్ఆర్ఐ శాస్త్రవేత్తలు పర్యటన కొనసాగుతోంది. నీరు, మట్టి సహా పలు నమూనాలను టెస్టుల కోసం వారు సేకరిస్తున్నారు. సీసం, నికెల్ అవశేషాలు మనుషుల శరీరాల్లోకి ఎలా వెళ్లాయి అన్న విషయాలపై వారు ఫోకస్ పెట్టారు. భార లోహాలు రక్తంలో ఎలా కలిశాయనే విషయంపై పూర్తిస్థాయి అధ్యయనం చేస్తున్నారు. మరోవైపు బాధితులకు మెరుగైన వైద్యం కొనసాగుతోంది. ఏపీ సీఎం జగన్  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మరీ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

 • 10 Dec 2020 15:06 PM (IST)

  ఏలూరు వాసుల్లో పెరిగిపోతున్న భయం

  ఏలూరు వాసుల్లో అంతుచిక్కని వ్యాధి భయం పెరిగిపోతుంది.  నీరు‌, పాలు తాగాలన్నా… కూరగాయలు, చేపలు , రొయ్యలు కొనుగోలు చెయ్యాలన్నా భయపడుతున్నారు. ఏం తినాలన్నా భయం, యేం కొనాలన్నా ఏ క్షణం ఏం జరగుతుందో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆకుకూరల్లో పోషకాలే ఉన్నాయా , విషమే దాగుందా అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చేపలు మింగేసిన భారలోహాలు ఏంటి..? పాలు, నీళ్లలో కలసిన విషం ఏంటి..? వంటి అనుమానాలతో ప్రజలు  ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

 • 10 Dec 2020 14:09 PM (IST)

  ఏలూరు వింత వ్యాధి.. 597కి చేరుకున్న బాధితుల సంఖ్య..

  పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వింత వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. ప్రస్తుతం బాధితుల సంఖ్య 597కి చేరుకుంది. వీరిలో ఇప్పటివరకు 527 మంది రోగులను డిశ్చార్జ్‌ చేయగా.. ప్రస్తుతం 35 మంది ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమంగా ఉన్న మరో 33 మంది గుంటూరు, విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు.

  ప్రస్తుతానికి ఈ వ్యాధికి గురైనవారిలో పన్నెండేళ్ల లోపు చిన్నారులు 75 మంది కాగా, ఇందులో బాలురు 43, బాలికలు 32 మంది ఉన్నారు. ఇక 12 – 35 వయసు కలిగిన వారిలో 330 మంది ఈ వ్యాధి బారినపడ్డారు. వీరిలో పురుషులు 168 మంది ఉంటే, మహిళలు – 162 మంది ఉన్నారు. కాగా, 35 ఏళ్లకు పైబడినవారిలో 192 మంది వింత వ్యాధితో అస్వస్థతకు గురయ్యారు. వీరిలో పురుషులు 108 మంది కాగా, మహిళలు 84 మంది ఉన్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు.

 • 10 Dec 2020 13:23 PM (IST)

  ఏలూరు వార్డు సచివాలయాల వద్ద మెడికల్ క్యాంపులు..

  ఏలూరులో వింత వ్యాధి ప్రబలుతున్న నేపథ్యంలో 62 వార్డు సచివాలయాల వద్ద మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. ఆయా సచివాలయాల వద్ద ఒక వైద్యుడు, నర్సు, ఆరోగ్య సిబ్బంది, సచివాలయ సిబ్బందిని అందుబాటులో ఉంచారు. ఎవరికైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే ప్రాధమిక చికిత్స అందించి 108 అంబులెన్స్‌లో జిల్లా ఆసుపత్రికి తరలించేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. అలాగే వైద్య సిబ్బంది ఇంటింటా సర్వే చేస్తూ వివరాలు సేకరిస్తున్నారన్నారు.

 • 10 Dec 2020 13:17 PM (IST)

  ఏలూరు వింత వ్యాధి.. బాధితులను పరామర్శిస్తున్న నీలం సాహ్ని..

  వింత వ్యాధి బారినపడ్డ బాధితులను పరామర్శించేందుకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు.

 • 10 Dec 2020 13:13 PM (IST)

  ఏలూరు వింత వ్యాధి.. రంగంలోకి రాష్ట్ర సంస్థలు.. నమూనాలు సేకరణ..

  ఏలూరు వింత వ్యాధిపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఆ వ్యాధికి కారణాలు ఏంటో తేల్చేందుకు రాష్ట్ర సంస్థలు కూడా రంగంలోకి దిగాయి. రోగుల రక్త నమూనాలు, తాగునీరులో లెడ్, ఆర్గానో క్లోరిన్ ఉందో లేదో తేల్చేందుకు ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ, సిద్ధార్థ వైద్య కళాశాలలకు చెందిన నాలుగు బృందాలు సిద్ధమయ్యాయి.

 • 10 Dec 2020 13:10 PM (IST)

  ఏలూరు వింత వ్యాధిపై డాక్టర్ సమరం ఏమన్నారంటే..!

  ఏలూరులో అనారోగ్య పరిస్థితులపై భిన్నాభిప్రాయాలు

  వాటర్ పొల్యూషన్ కారణమంటున్న కొందరు వైద్యులు

  నిఫా వైరస్ కావొచ్చని చెబుతున్న డాక్టర్ సమరం

  ఏలూరులో నిఫా వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయని వెల్లడి

  గతంలో కేరళలో కూడా నిఫా వైరస్ విజృంభించింది

  ఏలూరు వ్యాధికి కారణం ఏంటన్నది పరిశోధనలు జరిగి నిర్ధారణ చేయాలన్న సమరం

  ఒకవేళ నిఫా వైరస్ అయితే భయపడాల్సిన అవసరం లేదన్న సమరం

 • 10 Dec 2020 12:51 PM (IST)

  టీవీ9తో విజయవాడ ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ శివశంకర్.. 

  టీవీ9తో విజయవాడ ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ శివశంకర్.. 

  అంతుచిక్కని వ్యాధితో ఏలూరు నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో 25 మంది బాధితులకు చికిత్స

  వీరిలో 23 మందికి నిపుణలైన వైద్యులతో చికిత్సను అందిస్తుండగా.. ఇద్దరు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు

  ప్రస్తుతం చికిత్స పొందుతున్న 23 మంది బాధితుల ఆరోగ్యం నిలకడగా ఉంది

  విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో బుధవారం ఇద్దరు మృతి చెందింది వింత వ్యాధితో కాదు

  ఒకరు కోవిడ్, మరొకరు టీబీ వ్యాధితో మరణించారు

  ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వృద్దులు, పిల్లలను రేపటిలోగా డిశ్చార్జ్ చేస్తాం

 • 10 Dec 2020 12:43 PM (IST)

  గుంటూరు జీజీహెచ్‌లో చేరిన ఐదుగురు ఏలూరు బాధితుల్లో ముగ్గురు డిశ్చార్జ్…

  గుంటూరు జీజీహెచ్‌లో చేరిన ఐదుగురు ఏలూరు బాధితుల్లో ముగ్గురు డిశ్చార్జ్ అయ్యారు. మరొకరు కూడా పూర్తిగా కోలుకోగా.. అతడు కూడా సాయంత్రానికి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని ఆసుపత్రి అధికారులు అన్నారు. ఇదిలా ఉంటే ఆండాళ్లు అనే రోగి పరిస్థితి మాత్రం విషమంగా ఉందని తెలిపారు. ఆమెకు మెదడులో రక్తం గడ్డ కట్టిందని.. అంతేకాకుండా బ్రెయిన్ స్టోక్ వచ్చిందని జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి అన్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని.. మెరుగైన చికిత్స అందిస్తున్నామని ఆమె అన్నారు.

 • 10 Dec 2020 12:37 PM (IST)

  ఏలూరు వింత వ్యాధి బాధితుడికి టీవీ9 ఆపన్న హస్తం..

  ఏలూరు మార్కెట్‌లో వింత వ్యాధి కారణంగా కుప్పకూలిన శ్రీను అనే బాధితుడికి టీవీ9 ఆపన్న హస్తం అందించింది. 108 అంబులెన్స్  రావడం ఆలస్యం కావడంతో టీవీ9 వాహనంలోనే బాధితుడిని ఆసుపత్రిలో అడ్మిట్ చేసింది. సకాలంలో బాధితుడిని ఆసుపత్రికి తీసుకురావడంతో వైద్యులు అతనికి అత్యవసర చికిత్సను అందిస్తున్నారు.

 • 10 Dec 2020 12:25 PM (IST)

  ఏలూరు బాధితుల ఆరోగ్య పరిస్థితిపై మంత్రి ఆళ్ల నాని ఆరా.. రేపు పూర్తి స్థాయి నివేదిక వచ్చే అవకాశం..

  విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న వింత వ్యాధి బాధితులను ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పరామర్శించారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. చికిత్సపై బాధితులు సంతృప్తిగా ఉన్నారని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం 23 మంది చికిత్స పొందుతున్నారని అన్నారు. వారిలో కొంతమంది డిశ్చార్జ్‌కు కూడా సిద్ధంగా ఉందన్నారు. క్రమక్రమంగా బాధితుల సంఖ్య తగ్గుతోందని చెప్పారు. రేపు వ్యాధికి గల కారణాలపై పూర్తిస్థాయిలో నివేదిక వస్తుందని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి వ్యాధులు రాకుండా ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, తాగునీటిపై కేవలం ప్రాధమిక నివేదిక మాత్రమే వచ్చిందని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. అయితే నీటిని ఇంకా పరీక్షించాలని మరిన్ని శాంపిల్స్ సేకరించి పంపామని వెల్లడించారు.

 • 10 Dec 2020 12:13 PM (IST)

  ఏలూరులో ప్రబలుతున్న వింత వ్యాధి.. ప్రజల్లో ఎన్నో అనుమానాలు..

  ఒకవైపు వింత వ్యాధి కేసులు క్రమంగా పెరుగుతుండటంతో ఏలూరు వాసులు భయాందోళనలకు గురవుతున్నారు. నీరు‌, పాలు, కూరగాయలు, చేపలు , రొయ్యలు.. ఇలా ఏం తినాలన్నా.. ఏం కొనాలన్నా భయపడుతున్నారు. ఆకుకూరల్లో పోషకాలే ఉన్నాయా.? లేక విషమే దాగిందా.?  చేపలు మింగేసిన భారలోహాలు ఏంటి.? పాలు, నీళ్లలో కలసిన విషం ఏంటి.? ఇలా అనేక అనుమానాలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

 • 10 Dec 2020 12:07 PM (IST)

  విజయవాడ ప్రభుత్వాస్పత్రికి ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని.. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా..

  ఏలూరులో వింత వ్యాధి బారినపడ్డ రోగుల సంఖ్య పెరుగుతోంది. ఇక పరిస్థితి విషమంగా ఉన్నవారిని వైద్య అధికారులు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని విజయవాడ ప్రభుత్వాస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. అక్కడ చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

 • 10 Dec 2020 11:44 AM (IST)

  ఆకుకూరలు, కూరగాయాల పురుగుమందుల శాంపిల్స్ సేకరించనున్న వ్యవసాయశాఖ అధికారులు..

  ఇవాళ ఏలూరులోని ఆకుకూరలు, కూరగాయాల్లో పురుగుమందుల అవశేషాలపై వ్యవసాయశాఖ అధికారులు శాంపిల్స్ సేకరించనున్నారు. పురుగుల మందుల అవాకాశేషాలు కారణమై ఉంటాయని అనుమానం కలగడంతోనే ఈ పరిశీలన చేస్తున్నారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్గానో క్లోరిన్ ప్రభావంపై వైద్యల నుంచి కూడా వివరాలు సేకరిస్తున్నారు.

 • 10 Dec 2020 11:33 AM (IST)

  ఏలూరు వింత వ్యాధికి.. కూరగాయలలోని ఆర్గానో క్లోరిన్ కారణమా..!

  ఏలూరులో వింత వ్యాధి కూరగాయల ద్వారా ప్రబలుతోందన్న అనుమానులు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే పరిశోధనలు సాగిస్తున్నారు. ఏలూరు ప్రాంతంలోని కూరగాయల్లో పురుగుల మందుల అవశేషాలు ఉన్నట్లు గుర్తించారు. కూరగాయలలోని ఆర్గానో క్లోరిన్‌‌తో వ్యాధి ప్రబలిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనితో కూరగాయల శాంపిల్స్‌ను సేకరించి అధికారులు ల్యాబ్‌కు పంపించారు.

 • 10 Dec 2020 11:19 AM (IST)

  ఏలూరులో వింత వ్యాధి.. కూరగాయాలే ఇందుకు కారణమా.!

  ఏలూరు వింత వ్యాధి మూలాలపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే బాధితుల రక్తంలో సీసం, నికెల్‌ వంటి భారలోహాలు ఉన్నట్లు గుర్తించారు. ఇప్పుడు ఏలూరు ప్రాంతంలోని కూరగాయల్లో పురుగులమందుల అవశేషాలు ఉన్నట్లు తెలుస్తోంది. కూరగాయల్లోని ఆర్గానో క్లోరిన్‌తో వ్యాధి ప్రబలినట్టు అనుమానం కలుగుతోంది. అందుకే కూరగాయల శాంపిల్స్‌ను సేకరించి ల్యాబ్‌కు పంపి పరిశీలిస్తున్నారు.

 • 10 Dec 2020 11:04 AM (IST)

  ఏలూరు వింత వ్యాధి.. తెరపైకి మరో కొత్త అనుమానం..

  ఏలూరు వింతవ్యాధి మిస్టరీ ఇంకా వీడలేదు. భయం తొలగిపోలేదు. అన్వేషణ కొనసాగుతునే ఉంది. వైద్యులు భిన్నాభిప్రాయాల మధ్య రోజు రోజుకు టెన్షన్‌ పెరుగుతోంది. జనం భయంగుప్పిట్లో ఊపిరి కూడా తీసుకోలేకపోతున్నారు. గొంతెండిపోతున్నా మంచినీళ్లు తాగలేకపోతున్నారు. ఆకలేస్తున్నా ఏదీ ధైర్యంగా తినలేకపోతున్నారు. కేసులు తగ్గుతున్నాయి… అంతే వేగంగా పెరుగుతున్నాయి. పాలు, నీళ్ల మీదే ఇంతవరకు అందరి దృష్టి పడింది. ఇప్పుడు మరో కొత్త అనుమానం తెరపైకి వచ్చింది. కూరగాయలు పండించేటప్పుడు వాడే పురుగు మందులు ప్రభావం కూడా ఉండొచ్చన్న అనుమానాలు కలుగుతున్నాయి.

 • 10 Dec 2020 10:59 AM (IST)

  ఏలూరులో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి.. సీఎం జగన్‌కు చంద్రబాబు లేఖ..

  ఏలూరు నగరంలో వింత వ్యాధి విస్తరిస్తుండటంతో తక్షణమే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు కోరారు. ఈ మేరకు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. వింత వ్యాధి కారణంగా బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోవడం, కారణాలు తెలియకపోవడంతో ఏలూరు, ఆ చుట్టుప్రక్కల ప్రాంతాల వారు భయభ్రాంతులకు గురవుతున్నారని పేర్కొన్నారు.

 • 10 Dec 2020 10:52 AM (IST)

  ఏలూరు వింత వ్యాధి ప్రబలడానికి కారణమేంటి.? కూరగాయలు విషమైయ్యాయా.!

  ఏలూరు వింత వ్యాధిపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. బాధితుల్లో పురుగుల మందుల అవశేషాలను గుర్తించడంతో క్రిమిసంహారక మందులతో పండించిన కూరగాయలు ఇందుకు కారణమై ఉంటుందా అనే అంశంపై కూడా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు.

 • 10 Dec 2020 10:31 AM (IST)

  ఏలూరులో కొనసాగుతున్న పరిశోధనలు

  ఏలూరు ఘటనకు సంబంధించి పరిశోధనలు కొనసాగుతున్నాయి. పురుగు మందుల వల్ల కూడా కాలుష్య కారక మూలకాలు కలిసే అవకాశాలు ఉంటాయని ఐఐసీటీ నిపుణులు భావిస్తున్నారు. ప్రమాదకర స్థాయిలో ఏదీ కన్పించలేదని తెలిపింది. బాధితులు తీసుకున్న ఆహారం సహా ఆరోగ్య పరమైన వివరాలు నమోదు చేస్తున్నామని.. త్వరలో సమస్యకు అసలు కారణమేంటో కనుక్కుంటామని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది.

 • 10 Dec 2020 10:22 AM (IST)

  సీసం వల్లే ఎక్కువమంది అస్వస్థత..?

  ప్రస్తుతం కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. ఒక్కొక్కరుగా ఏలూరు ప్రభుత్వాసుపత్రికి క్యూ కడుతున్నారు.అస్వస్థతకు గురైన వారి రక్తంలో సీసం అధికంగా కనిపిస్తోందని ఎయిమ్స్‌ వైద్యులు చెబుతున్నారు. భారతీయుల్లో నికెల్‌ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి దాని కోసం ఆందోళన అవసరం లేదంటున్నారు. కేవలం సీసం వల్లే ఎక్కువమంది అస్వస్థతకు గురైనట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

 • 10 Dec 2020 09:50 AM (IST)

  శాంపిల్స్ ఫలితాలను వెల్లడించనున్న ఎయిమ్స్ వైద్యులు..

  ఏలూరు వింత వ్యాధికి సంబంధించిన శాంపిల్స్ రిపోర్టును ఎయిమ్స్ వైద్యులు ఇవాళ వెల్లడించనున్నారు. రోగుల శరీరంలో హెవీ లెడ్, నికెల్, సీసం ఉండటంతో.. అవి అసలు ఎలా వెళ్లాయన్న దానిపై వీరు పరిశోధన చేస్తున్నారు.

 • 10 Dec 2020 09:47 AM (IST)

  ఆహారం, నీటి కాలుష్యమే వింత వ్యాధికి కారణాల..!

  ఏలూరులో వింత వ్యాధి విజృంభిస్తోంది. ఈ వ్యాధి బారినపడ్డవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. అసలు ఈ వ్యాధి ఎలా సోకిందో తెలుసుకునే క్రమంలో శాస్త్రవేత్తలు నిమగ్నమై ఉన్నారు. ఇదిలా ఉంటే ఏలూరులోని పడమర వీధి, దక్షిణపు వీధి, కొత్తపేట తదితర ప్రాంతాల్లో పలు నమూనాలను సేకరించిన జాతీయ పోషకాహార సంస్థ ఎన్‌ఐఎస్‌ శాస్త్రవేత్తలు.. ఆహారం, నీటి కాలుష్యం వల్లే ఏలూరు ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగుల నుంచి కూడా శాంపిల్స్ సేకరించామని.. వాటిని పరిశోధిస్తున్నామన్నారు. శుక్రవారం నాటికి ప్రాధమిక నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వానికి అందిస్తామని స్పష్టం చేశారు.

 • 10 Dec 2020 09:31 AM (IST)

  కాసేపట్లో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని..

  మరికొద్దిసేపట్లో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని వెళ్లనున్నారు. వింత వ్యాధి కారణంగా ఏలూరు నుంచి అక్కడ అడ్మిట్ అయినవారి ఆరోగ్య పరిస్థితిని మంత్రి పరిశీలించనున్నారు.

 • 10 Dec 2020 09:12 AM (IST)

  ఏలూరు బాధితుల్లో మరో ఇద్దరు మృతి..

  ఏలూరు వాసుల్లో గుబులు రేపుతున్న వింత వ్యాధి బాధితుల్లో మరో ఇద్దరు మరణించారు. ఈ వ్యాధి కారణంగా తీవ్ర అస్వస్థతకు గురవుతున్న బాధితులను విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మొత్తం 30 మందిని తరలించగా.. వారిలో సుబ్బరావమ్మ(56), అప్పారావు(50) బుధవారం చికిత్స పొందుతూ మృతి చెందారు. అయితే సుబ్బరావమ్మ కరోనాతో, అప్పారావు టీబీతో బాధపడుతున్నారని.. వాటి వల్లే చనిపోయారని ఆసుపత్రి వైద్యులు చెబుతున్నారు. కాగా, ఆదివారం రాత్రి ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో మైనేని శ్రీధర్‌(45) మరణించిన విషయం విదితమే.

 • 10 Dec 2020 08:56 AM (IST)

  ఏలూరు వింత వ్యాధి.. 592కి చేరిన రోగుల సంఖ్య..

  పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వింత వ్యాధి బారినపడ్డ బాధితుల సంఖ్య 592కి చేరింది. ఇప్పటివరకు 511 మంది రోగులను డిశ్చార్జ్‌ చేయగా.. ప్రస్తుతం 46 మంది ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమంగా ఉన్న మరో 33 మంది గుంటూరు, విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు.

 • 10 Dec 2020 08:46 AM (IST)

  బాధితుల శరీరంలోకి హెవీ మెటల్ ఎలా వచ్చింది.. తేల్చే పనిలో పడ్డ శాస్త్రవేత్తలు..

  డబ్ల్యూహెచ్‌వో, ఐసీఎంఆర్‌, ఢిల్లీ ఎయిమ్స్‌, సీసీఎంబీ, జాతీయ పౌష్టికాహార సంస్థ, ఫుడ్‌ సేఫ్టీ అధికారులు ఈ వింత వ్యాధికి కారణాలేంటో తెలుసుకునే పనిలో పడ్డారు. బాధితుల బ్లడ్‌ శాంపిల్స్‌లో లెడ్‌ హెవీ మెటల్‌ ఉన్నట్లు గుర్తించడంతో… అసలు ఆ హెవీ మెటల్‌ శరీరంలోకి ఎలా వచ్చిందో తెలుసుకుంటున్నారు.

 • 10 Dec 2020 08:40 AM (IST)

  ఏలూరులో వింత వ్యాధి.. ఆ ప్రాంతమే కేరాఫ్ అడ్రస్..

  ఏలూరులో అంతుచిక్కని వింత వ్యాధికి కొత్తపేట ప్రాంత కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. గత మూడు రోజులుగా ఈ ఒక్క ప్రాంతంలోనే 22 మంది కుప్పకూలిపోయారు. కొందరు నోటి నుంచి నురగలు కక్కితే…మరికొందరికి ఏకంగా రక్తమే కక్కేశారు. ఈ ప్రాంతంపై శాస్త్రవేత్తల బృందం దృష్టి సారించింది. ప్రతి ఇంటి నుంచి నీటితోపాటు రక్తం శాంపిల్స్‌ని సేకరించారు. అంతేకాదు వారు తినే ఆహార పదార్థాలను సైతం తీసుకున్నారు. ఆహార పదార్థాల్లో మెదడును స్తంభింపజేసే విష అవశేషాలు ఉన్నాయని తెలిపారు.

 • 10 Dec 2020 08:35 AM (IST)

  ఏలూరులో ప్రబలుతున్న వింత వ్యాధి.. 591కి చేరుకున్న బాధితుల సంఖ్య..

  పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వింత వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. బుధవారం ఉదయం నుంచి మరో 24 కొత్త కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం అస్వస్థతకు గురైన బాధితుల సంఖ్య 591కి చేరింది. ఇప్పటివరకు 511 మంది రోగులను డిశ్చార్జ్‌ చేయగా.. ప్రస్తుతం 46 మంది ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమంగా ఉన్న మరో 33 మంది గుంటూరు, విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు.

  ప్రస్తుతానికి ఈ వ్యాధికి గురైనవారిలో పన్నెండేళ్ల లోపు చిన్నారులు 75 మంది కాగా, ఇందులో బాలురు 43, బాలికలు 32 మంది ఉన్నారు. ఇక 12 – 35 వయసు కలిగిన వారిలో 326 మంది ఈ వ్యాధి బారినపడ్డారు. వీరిలో పురుషులు 167 మంది ఉంటే, మహిళలు – 159 మంది ఉన్నారు. కాగా, 35 ఏళ్లకు పైబడినవారిలో 190 మంది వింత వ్యాధితో అస్వస్థతకు గురయ్యారు. వీరిలో పురుషులు 106 మంది కాగా, మహిళలు 84 మంది ఉన్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు.