జస్ట్.. 5 నిమిషాల్లోనే కరకరలాడే పకోడి.. ఈ రెండు మిక్స్ చేశారంటే అద్భుతం.. ప్లేట్లు కూడా వదలరు..
వాతావరణం ఎలా ఉన్నా.. సాయంత్రం పూట వేడి వేడి స్నాక్స్ తినాలనిపిస్తుందా? 5 నిమిషాల్లో కరకరలాడే ఉల్లిపాయ పకోడీని సులభంగా తయారు చేసుకోవచ్చు.. ఈ వంటకంలో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, శనగపిండి, బియ్యప్పిండిని సరైన కొలతలతో కలిపి, ఆయిల్ పీల్చకుండా మీడియం మంటపై వేయించడం ద్వారా రుచికరమైన పకోడీని సిద్ధం చేసుకోవచ్చు.

ఏ వాతావరణమైనా.. సాయంత్రం వేళలో వేడి వేడిగా, కరకరలాడే పకోడీని ఆస్వాదించడం అనేది చాలా మందికి ఇష్టమైన అలవాటు. ముఖ్యంగా ఉల్లిపాయ పకోడీని కేవలం ఐదు నిమిషాల్లో సులభంగా తయారుచేసుకోవచ్చు. పిల్లలు, పెద్దలు సహా.. అందరూ కూడా ఈ పకోడిని ఇష్టంగా తింటారు. అయితే.. పకోడి వంటకం సరైన కొలతలతో, సులభమైన పద్ధతిలో రుచికరమైన ఎలా తయారుచేయాలో వివరంగా తెలుసుకుందాం.. ముఖ్యంగా శనగపిండి.. బియ్యం పిండితో ఈ వంటకాన్ని అద్భుతంగా మార్చుకోవచ్చు..
పకోడీ తయారీకి కావలసిన పదార్థాలు:
- ఉల్లిపాయలు: పరిపోయేంతగా (పొడవుగా కోసినవి)
- పచ్చిమిర్చి: ఏడెనిమిది (సన్నగా కోసినవి)
- కరివేపాకు: రెండు రెమ్మలు (సన్నగా కోసినవి)
- అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 టీస్పూన్
- ఉప్పు: రుచికి సరిపడా
- ధనియాలు: 2 టీస్పూన్లు (చేతితో నలిపినవి)
- బియ్యప్పిండి: 2-3 టేబుల్ స్పూన్లు
- శనగపిండి: 200-250 గ్రాములు లేదా సరిపడినంతగా..
- వేయించడానికి సరిపడా నూనె
తయారీ విధానం:
ముందుగా, ఉల్లిపాయలను తీసుకొని పొట్టు తీసి, పొడవుగా కట్ చేసుకోవాలి. ఒక ఉల్లిపాయను మధ్యలోకి కట్ చేసి, సన్నగా కొంచెం పెద్దవిగా కట్ చేయాలి. ఏడెనిమిది పచ్చిమిర్చి, రెండు రెమ్మల కరివేపాకును కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. కారం ఎక్కువగా కావాలంటే పచ్చిమిర్చిని కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు, అయితే ఈ వంటకంలో కారం పొడిని ఉపయోగించకుండా పచ్చిమిర్చి ఫ్లేవర్‌ను మాత్రమే ఉపయోగిస్తారు.
తరువాత, కోసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకును పెద్ద బౌల్‌లో వేసుకోవాలి. దీనికి ఒక టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టీస్పూన్ ఉప్పు చేర్చాలి. పకోడీలో ఉప్పు తక్కువ పడుతుంది కాబట్టి రుచి చూసి వేసుకోవడం మంచిది. రెండు టీస్పూన్ల ధనియాలను అరచేతిలో వేసుకొని బాగా నలిపి ఉల్లిపాయ ముక్కల్లో వేయాలి. ఇలా నలిపిన ధనియాలు పకోడీకి ప్రత్యేక రుచిని ఇస్తాయి. ధనియాలు ఇష్టం లేని వారు ధనియాలపొడిని కూడా ఒక టీస్పూన్ వేసుకోవచ్చు. ఈ పదార్థాలన్నింటినీ చేతితో గట్టిగా నొక్కుతూ బాగా కలుపుకోవాలి. ఇలా నలపడం వల్ల పచ్చిమిర్చిలోని ఫ్లేవర్, కారం ఉల్లిపాయలకు బాగా పడతాయి. కొంతమంది కారం పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వంటివి కూడా వేస్తారు, కానీ మామూలుగా అయితే అవి అవసరం లేదు.
ఉల్లిపాయ ముక్కలను ఇలా గట్టిగా కలిపిన తర్వాత, రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల బియ్యప్పిండిని చేర్చాలి. బియ్యప్పిండి పకోడీ కరకరలాడటానికి సహాయపడుతుంది. ఆపై 200 నుండి 250 గ్రాముల శనగపిండిని వేయాలి. తీసుకున్న ఉల్లిపాయల పరిమాణంలో సగం శనగపిండి వేసుకోవడం సరైన కొలత. నీటిని అస్సలు కలపకుండా, ఉల్లిపాయల్లోని సహజ తేమతోనే పిండిని పొడిపొడిగా కలుపుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీటిని చిలకరించుకోవచ్చు. ఎక్కువ నీరు కలిపితే పకోడీలు నూనెను పీల్చుకొని మెత్తగా మారతాయి.
ఇప్పుడు, నూనెను మధ్యస్థంగా వేడి చేసి, మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి, సిద్ధం చేసుకున్న పిండిని చిన్న పకోడీల్లాగా వేయాలి. మీడియం ఫ్లేమ్‌లో వేయించడం వల్ల పకోడీలు లోపల, బయట సమానంగా ఉడికి కరకరలాడుతూ వస్తాయి. వేసిన వెంటనే కాకుండా, ఒక నిమిషం ఆగిన తర్వాత తిప్పుకుంటూ అన్ని వైపులా బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. పకోడీలను నూనెలోంచి తీసిన తర్వాత కూడా రంగు కొద్దిగా మారే అవకాశం ఉంది కాబట్టి, మరీ ఎక్కువ నల్లగా వేయించకూడదు, అలా చేస్తే చేదుగా అనిపించవచ్చు. వేగిన పకోడీలను పేపర్ నాప్‌కిన్‌పై వేస్తే అదనపు నూనెను పీల్చుకుంటుంది.
చివరగా, పకోడీలు అన్నీ వేయించిన తర్వాత మిగిలిన నూనెలో మూడు-నాలుగు పచ్చిమిర్చిని చీల్చి, రెండు-మూడు రెమ్మల కరివేపాకును వేసి వేయించాలి. వీటిని వేయించిన పకోడీల్లో కలిపితే రుచి, సువాసన మరింత పెరుగుతాయి. ఈ విధంగా వేడి వేడి, కరకరలాడే ఉల్లిపాయ పకోడీని సులభంగా తయారుచేసి ఆస్వాదించవచ్చు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
