IPL 2026 : ఇక నుంచి గ్రౌండ్లోకి దిగే ముందే జేబులు చెక్ చేస్తాం.. చిట్టీలపై రషీద్ ఖాన్ వార్నింగ్
IPL 2026 : ఈ సీజన్ ఐపీఎల్‌లో సెంచరీ లేదా హాఫ్ సెంచరీ కొట్టినా, లేదంటే వికెట్ తీసినా.. ఆటగాళ్లు తమ జేబులో నుంచి ఒక చిన్న కాగితం ముక్క తీసి కెమెరాలకు చూపిస్తూ సెలబ్రేట్ చేసుకోవడం ఒక కొత్త ట్రెండ్‌గా మారింది.

IPL 2026 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 లీగ్ దశ ముగింపునకు రావడంతో ప్లేఆఫ్స్ రేసు క్లైమాక్స్‌కు చేరింది. మే 21న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ (GT), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్లు తమ చివరి లీగ్ మ్యాచ్‌లో తలపడుతున్నాయి. అయితే, ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ కంటే ముందే ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య జరిగిన ఒక ఫన్నీ చాటింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. సీఎస్‌కే ఆటగాళ్లు మైదానంలోకి వస్తే వారి జేబులను తనిఖీ చేస్తానంటూ గుజరాత్ వైస్ కెప్టెన్, ఆఫ్ఘన్ స్టార్ రషీద్ ఖాన్ సరదాగా హెచ్చరించడం క్రికెట్ వర్గాల్లో నవ్వులు పూయిస్తోంది.
అసలేంటి ఈ చీటీల ట్రెండ్?
ఈ సీజన్ ఐపీఎల్‌లో సెంచరీ లేదా హాఫ్ సెంచరీ కొట్టినా, లేదంటే వికెట్ తీసినా.. ఆటగాళ్లు తమ జేబులో నుంచి ఒక చిన్న కాగితం ముక్క తీసి కెమెరాలకు చూపిస్తూ సెలబ్రేట్ చేసుకోవడం ఒక కొత్త ట్రెండ్‌గా మారింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ అభిషేక్ శర్మ ఈ సీజన్‌లో సెంచరీ కొట్టిన తర్వాత తొలిసారిగా ఇలాంటి చీటీని చూపిస్తూ తన కుటుంబానికి సందేశం ఇచ్చాడు. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ ప్లేయర్ రఘు శర్మ తన మొదటి వికెట్ తీశాక జై శ్రీరామ్ అని రాసి ఉన్న నోట్‌ను ప్రదర్శించాడు. లక్నో పేసర్ ఆకాష్ సింగ్ కూడా సీఎస్‌కేపై 3 వికెట్లు తీసి ఇలాంటి మోటివేషనల్ నోట్ చూపించాడు.
తండ్రికి అంకితమిచ్చిన సీఎస్‌కే స్టార్
ఈ చీటీల సెలబ్రేషన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ యువ బ్యాటర్ ఉర్విల్ పటేల్ కూడా చేరిపోయాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది, ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ రికార్డును సమం చేసిన ఉర్విల్.. అనంతరం జేబులో నుంచి ఒక పేపర్ తీసి ఆ ఇన్నింగ్స్‌ను తన తండ్రికి అంకితం ఇచ్చాడు. నిన్ననే ముంబై, కోల్‌కతా మ్యాచ్‌లో దీపక్ చాహర్ సైతం ఒక వికెట్ తీశాక, జేబులో నుంచి సరదాగా ఏమీ లేని ఖాళీ చేతిని తీసి కెమెరాకు చూపిస్తూ ఈ ట్రెండ్‌ను తెగ వెక్కిరించాడు.
ఉర్విల్, బ్రెవిస్ జేబులు చెక్ చేస్తా..
గుజరాత్ టైటాన్స్ అధికారికంగా షేర్ చేసిన వీడియోలో రషీద్ ఖాన్.. సీఎస్‌కే బ్యాటర్ ఉర్విల్ పటేల్‌ను ఆటపట్టించాడు. “రేపు నువ్వు బ్యాటింగ్‌కు వచ్చేటప్పుడు నీ జేబుల్లో ఏమైనా నోట్స్ ఉన్నాయేమో నేను పర్సనల్‌గా చెక్ చేస్తా తమ్ముడూ” అని రషీద్ అనడంతో అక్కడ నవ్వుల జల్లు కురిసింది. కేవలం ఉర్విల్ మాత్రమే కాదు, సీఎస్‌కే మిడిలార్డర్ బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్ కూడా ఇలాంటి ప్లాన్లలోనే ఉంటాడని, వారిద్దరిపై తాను కన్నేసి ఉంచుతానని రషీద్ ఖాన్ సరదాగా వార్నింగ్ ఇచ్చాడు.
గుజరాత్ సేఫ్, చెన్నైకి గెలిచినా గండమే
ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ 13 మ్యాచ్‌ల్లో 16 పాయింట్లతో ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అయి ప్రశాంతంగా ఉంది. ఈ మ్యాచ్ గెలిచి టాప్-2 లో నిలవాలని చూస్తోంది. కానీ, రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్ పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంది. 13 మ్యాచ్‌ల్లో కేవలం 12 పాయింట్లతో 7వ స్థానంలో ఉన్న సీఎస్‌కే.. ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో గెలవడమే కాకుండా, పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తమ చివరి మ్యాచ్‌ల్లో ఓడిపోవాలని ప్రార్థించాల్సి ఉంటుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
