2-DG medicine: డీఆర్డీవో రూపొందించిన 2-డీజీ డ్రగ్ వినియోగంపై మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రం
మహమ్మారి కరోనా వైరస్ నిరోధానికి డీఆర్డీఓ రూపొందించిన 2-డీజీ (2 డీఆక్సి–డీ గ్లూకోజ్) డ్రగ్ వినియోగంపై కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.
మహమ్మారి కరోనా వైరస్ నిరోధానికి డీఆర్డీఓ రూపొందించిన 2-డీజీ (2 డీఆక్సి–డీ గ్లూకోజ్) డ్రగ్ వినియోగంపై కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. కోవిడ్-19 వైద్యంలో అత్యవసర వినియోగం కింద ఈ డ్రగ్‌ను అనుమతించినట్టు వెల్లడించింది. మధ్యస్థ నుంచి తీవ్రస్థాయి లక్షణాలున్న కేసుల్లో మాత్రమే ఈ డ్రగ్ వినియోగించాలని స్పష్టం చేసింది. పాజిటివ్‌గా గుర్తించిన వెంటనే గరిష్టంగా 10 రోజుల పాటు డ్రగ్ ఇవ్వొచ్చని పేర్కొంది. ఆస్పత్రుల్లో వైద్యుల సూచన మేరకు మాత్రమే డ్రగ్ వినియోగించాలని కేంద్రం సూచించింది. నియంత్రణ లేని మధుమేహం, తీవ్రమైన హృద్రోగ సమస్యలు, తీవ్ర శ్వాసకోస సమస్యలు, తీవ్ర హెపాటిక్ రీనల్ ఇంపెయిర్మెంట్ సమస్యలున్నవారిపై ఈ డ్రగ్‌ను పరీక్షించలేదు కాబట్టి అలాంటివారికి వినియోగించే సమయంలో మరిన్ని జాగ్రత్తలు అవసరమని చెప్పింది. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, 18 ఏళ్ల లోపువారికి 2-డీజీ డ్రగ్ ఇవ్వరాదని స్పష్టం చేసింది.
రోగులు, వారి బంధువులు ఈ డ్రగ్ కోసం ఆస్పత్రి యాజమాన్యాలను, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్‌ను సంప్రదించవచ్చు. 2dg@drreddys.comకు మెయిల్ చేయడం ద్వారా డ్రగ్ సరఫరాకు విజ్ఞప్తి చేయవచ్చు. డీఆర్‌డీఓ రూపొందించిన 2-డీజీ సాచెట్ ధరను రెడ్డీస్ ల్యాబ్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఒక్కో 2డీజీ సాచెట్ ధర రూ.990గా రెడ్డీస్ ల్యాబ్స్ నిర్ణయించింది. ట్రీట్మెంట్‌లో ఒక్కొక్కరికి ఐదు నుంచి పది సాచెట్‌లు అవసరం. చికిత్సకు ఒక్కో వ్యక్తికి రూ.5 వేల నుంచి రూ.10వేల వరకు ఖర్చవుతుంది.
Also Read: జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా.. కోర్టులో వాదనలు ఇలా ఉన్నాయి