దీదీకి దెబ్బ మీద దెబ్బ, సువెందు అధికారితో బాటు మరో కీలక నేత రాజీనామా, తృణమూల్ లో కలవరం
బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. తృణమూల్ కాంగ్రెస్ లో ముఖ్య నేతలైన సువెందు అధికారి, జితేంద్ర తివారీ పార్టీకి రాజీనామా చేశారు. సువెందు నిన్ననే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే..

బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. తృణమూల్ కాంగ్రెస్ లో ముఖ్య నేతలైన సువెందు అధికారి, జితేంద్ర తివారీ పార్టీకి రాజీనామా చేశారు. సువెందు నిన్ననే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.. రాష్ట్రంలో వచ్ఛే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలముందు ఇలా కీలక నేతలు పార్టీ నుంచి వైదొలగడం మమతా బెనర్జీకి నష్టమే ! 2011 లో దీదీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన సువెందు అధికారి… తమ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు గురువారం ప్రకటించారు. పార్టీలో తను చేబట్టిన అన్ని పదవుల నుంచి వైదొలగుతున్నట్టు మమతకు రాసిన లేఖలో పేర్కొన్నారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీతో ఈయనకు సుమారు రెండు దశాబ్దాల అనుబంధం ఉంది. ఇక అసన్ సోల్ మేయరైన జితేంద్ర తివారీ కూడా సువెందు బాటనే పట్టారు. బుధవారం రాత్రి సువెందు, ఈయన రహస్య సమావేశం జరిపినట్టు తెలుస్తోంది. కేంద్ర నిధులను ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని జితేంద్ర ఆరోపిస్తున్నారు. అసన్ సోల్ మున్సిపల్ కార్పొరేషన్ చీఫ్ పదవికి ఈయన రాజీనామా చేయగా, తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత అయిన దిప్తాంగ్ షూ చౌదరి కూడా పార్టీ నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించారు.
సౌత్ బెంగాల్ స్టేట్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి చౌదరి రాజీనామా చేశారు. ఇక సువెందు అధికారి నిర్ణయం పట్ల బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హోం మంత్రి అమిత్ షా త్వరలో రాష్రాన్ని విజిట్ చేయనున్న సందర్భంలో వీరంతా బీజేపీలో చేరే అవకాశాలున్నాయి.



