మద్యంపై పోరు.. బిజెపి వ్యూహం అదుర్స్

చాన్నాళ్ళ తర్వాత మద్య నిషేధం అనే మాటను వింటున్నాం. 90వ దశకంలో దూబగుంటలో మొదలైన సారా వ్యతిరేక ఉద్యమం చివరికి మద్య నిషేధ ఉద్యమంగా మారి ఓ ఏడాదిన్నర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మద్య నిషేధం అమలు దిశగా అడుగులు పడిన సంగతి తెలిసిందే. చివరికి ఎన్టీయార్ స్థానంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉమ్మడి ఏపీలో మద్యనిషేధాన్ని క్రమంగా ఎత్తేశారు. ఆ తర్వాత మద్య నిషేధం అమలు సాధ్యం కాదన్న స్థిర అభిప్రాయానికి దాదాపు అన్ని […]

మద్యంపై పోరు.. బిజెపి వ్యూహం అదుర్స్
Follow us

| Edited By: Srinu

Updated on: Dec 12, 2019 | 4:11 PM

చాన్నాళ్ళ తర్వాత మద్య నిషేధం అనే మాటను వింటున్నాం. 90వ దశకంలో దూబగుంటలో మొదలైన సారా వ్యతిరేక ఉద్యమం చివరికి మద్య నిషేధ ఉద్యమంగా మారి ఓ ఏడాదిన్నర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మద్య నిషేధం అమలు దిశగా అడుగులు పడిన సంగతి తెలిసిందే. చివరికి ఎన్టీయార్ స్థానంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉమ్మడి ఏపీలో మద్యనిషేధాన్ని క్రమంగా ఎత్తేశారు.

ఆ తర్వాత మద్య నిషేధం అమలు సాధ్యం కాదన్న స్థిర అభిప్రాయానికి దాదాపు అన్ని పార్టీలు వచ్చేశాయి. మహిళా, యువజన సంఘాల్లోను భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో మద్యనిషేధం డిమాండ్ కూడా క్రమంగా తెరమరుగైపోయింది.

తాజాగా తెలంగాణ బిజెపి నేతలు మద్య నిషేధం డిమాండ్‌ను మరోసారి తెరమీదికి తెచ్చారు. తెలంగాణ బిజెపి సారథి పదవిని ఆశిస్తున్న మాజీ మంత్రి డి.కె. అరుణ గురు, శుక్రవారాల్లో రెండు రోజుల పాటు హైదరాబాద్‌లో నిరాహార దీక్షకు పూనుకున్నారు. ఈ దీక్షను తెలంగాణ బిజెపి అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ ప్రారంభించారు. అయితే బిజెపి ఉన్నట్లుండి మద్య నిషేధాన్ని ఎందుకు డిమాండ్ చేస్తోంది ? ఈ చర్చ ఇప్పుడు హైదరాబాద్ రాజకీయ వర్గాల్లో మొదలైంది.

ఇటీవల ఏపీలో విడతల వారీగా మద్యనిషేధం అమలు చేస్తామన్న కొత్త ప్రభుత్వం దానికి అనుగుణంగా వైన్సులు, బార్ల సంఖ్యను గణనీయంగా తగ్గించింది. అదే సమయంలో మందును బిలో మధ్య తరగతి వారికి దూరం చేయాలన్న ఉద్దేశంతో మద్యం ధరలను భారీగా పెంచింది జగన్ ప్రభుత్వం. దాంతో కొంతైనా మద్య వినియోగం తగ్గుతుందన్నది ప్రభుత్వం ఉద్దేశంగా కనిపిస్తోంది. అయితే, ఈ క్రమంలోనే తెలంగాణలో కూడా మద్యనిషేధాన్ని అమలు చేయించాలన్న డిమాండ్‌ను తెరమీదికి తెచ్చారు కమలనాథులు.

హైదరాబాద్ లాంటి మెట్రో పాలిటన్ సిటీల్లో మద్యనిషేధం అమలు అసాధ్యమన్న అభిప్రాయాల నేపథ్యంలో బిజెపి మధ్యనిషేధం డిమాండ్‌ను భుజానికి ఎత్తుకోవడంలో ఉద్దేశం ఏంటన్నది తాజా చర్చ. తెలంగాణ ప్రభుత్వ ఆదాయానికి అత్యంత మూలమైన ఎక్సైజ్ డిపార్ట్మెంట్‌లో ఈ మార్పులు చేసేందుకు కేసీఆర్ ముందుకొస్తారా? మద్యనిషేధానికి సిద్దపడతారా? అన్నది డౌటే. కానీ, మద్యనిషేధ ఉద్యమంతో తెలంగాణ మహిళలకు దగ్గరవ్వాలన్నది బిజెపి నేతల వ్యూహమని తెలుస్తోంది. ఎందుకంటే మగాళ్ళ మద్యపానం వల్ల ఇబ్బంది పడే మహిళలు తెలంగాణలో కాస్త ఎక్కువే.

సంపూర్ణ మద్య నిషేధం సాధ్యం కానప్పుడు మద్యం వల్ల ఎదురవుతున్న దుష్పరిణామాలను దృష్టిలో వుంచుకుని, కనీసం బెల్టు షాపులను తగ్గించడం, మద్యం విక్రమాలను నియంత్రించడం చేస్తే అయినా మహిళలకు ఎంతో కొంత ఊరట లభిస్తుందన్నది కమలనాథుల ఆలోచన అంటున్నారు. మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు మద్యపానమే ప్రధాన కారణమన్న సామాజిక వేత్తలు పలువురు అభిప్రాయపడుతున్నారు. మద్య నిషేధ ఉద్యమంతో మహిళలకు దగ్గరవడం, పాక్షిక నిషేధాన్నైనా సాధించి ఆ క్రెడిట్ కొట్టేయడం.. ఇలా ఈ రెండు రకాల ప్రయోజనాలతో బిజెపి నేతలు మద్యనిషేధం డిమాండ్‌ను తెరమీదికి తెచ్చారని పరిశీలకులు అంఛనా వేస్తున్నారు.