AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉద్యోగులూ జర భద్రం: బాస్ పేరుతో వచ్చే ‘ఆ ఒక్క క్లిక్’ మీ ఆఫీస్ కొంపముంచేయొచ్చు!

సంస్థల ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తుగడలకు తెరతీస్తున్నారు. సంస్థ అధినేతలు, ఉన్నతాధికారుల పేర్లతో నకిలీ సందేశాలు పంపిస్తూ ఉద్యోగులను మోసం చేస్తున్నారు. విశ్వాసాన్నే ఆయుధంగా మార్చుకున్న ఈ మోసాలపై తెలంగాణ సైబర్ భద్రతా విభాగం హెచ్చరిక జారీ చేసింది. ఇటీవల కాలంలో సంస్థల్లో పనిచేసే సిబ్బందికి అత్యవసర సూచనల పేరుతో సందేశాలు వస్తున్నాయి. అవి సంస్థ అధినేత పంపినట్లే కనిపిస్తున్నాయి.

ఉద్యోగులూ జర భద్రం: బాస్ పేరుతో వచ్చే 'ఆ ఒక్క క్లిక్' మీ ఆఫీస్ కొంపముంచేయొచ్చు!
Fake Urgent Messages
Ranjith Muppidi
| Edited By: |

Updated on: Jun 24, 2026 | 7:35 PM

Share

సంస్థల ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తుగడలకు తెరతీస్తున్నారు. సంస్థ అధినేతలు, ఉన్నతాధికారుల పేర్లతో నకిలీ సందేశాలు పంపిస్తూ ఉద్యోగులను మోసం చేస్తున్నారు. విశ్వాసాన్నే ఆయుధంగా మార్చుకున్న ఈ మోసాలపై తెలంగాణ సైబర్ భద్రతా విభాగం హెచ్చరిక జారీ చేసింది. ఇటీవల కాలంలో సంస్థల్లో పనిచేసే సిబ్బందికి అత్యవసర సూచనల పేరుతో సందేశాలు వస్తున్నాయి. అవి సంస్థ అధినేత పంపినట్లే కనిపిస్తున్నాయి. సందేశంతో పాటు జతచేసిన డాక్యమెంట్లను తెరవాలని, వెంటనే స్పందించాలని ఒత్తిడి చేస్తున్నారు. ఉద్యోగులు తొందరపడి వాటిని తెరిస్తే.. వారి పరికరాల్లో హానికర సాఫ్ట్‌వేర్ చేరి కీలక సమాచారం నేరగాళ్ల చేతికి వెళ్లే ప్రమాదం ఉంది.

ఇరవై ఏళ్లకు పైగా సేవలందిస్తున్న ఒక సంస్థకు చెందిన సుమారు మూడు వందల మంది ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి ప్రయత్నాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. దీంతో అన్ని సంస్థలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నకిలీ మెసేజీలు సాధారణంగా అత్యవసర చర్యలు తీసుకోవాలని, నిబంధనలకు సంబంధించిన సమాచారం పంపుతున్నామని పేర్కొంటారు. సంస్థకు సంబంధించిన కీలక పత్రాలు ఉన్నాయని చెప్పి జతచేసిన దస్త్రాలను తెరవాలని కోరుతారు. కొన్నిసార్లు వ్యక్తిగత సందేశాల ద్వారా సంప్రదించి రహస్య వివరాలు అడుగుతారు.

ఇలాంటి మోసాల నుంచి రక్షణ పొందాలంటే ఏ సందేశాన్నీ గుడ్డిగా నమ్మరాదని నిపుణులు చెబుతున్నారు. అనుమానం వచ్చినప్పుడు సంబంధిత అధికారిని నేరుగా సంప్రదించి నిజానిజాలు తెలుసుకోవాలి. తెలియని దస్త్రాలను తెరవకూడదు. ఖాతాలకు అదనపు భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలి. ఉద్యోగులకు తరచూ అవగాహన కల్పించాలి.

ఒకవేళ మోసానికి గురైనట్లు అనిపిస్తే వెంటనే ఖాతాల రహస్య సంకేతాలను మార్చాలి. సంస్థ భద్రతా విభాగానికి సమాచారం ఇవ్వాలి. బ్యాంకు వివరాలు పంచుకున్నట్లయితే సంబంధిత బ్యాంకును అప్రమత్తం చేయాలి. సైబర్ నేరాల సహాయ కేంద్రం 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. డబ్బు, సమాచారం, విశ్వాసం.. ఈ మూడింటినీ లక్ష్యంగా చేసుకుని నేరగాళ్లు దాడి చేస్తున్నారు. అప్రమత్తతే ఉత్తమ రక్షణ అని తెలంగాణ సైబర్ భద్రతా విభాగం పేర్కొంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us