ఈ ఏడాది చివరికల్లా కోవిషీల్డ్‌ వ్యాక్సిన్..కానీ.. : సీరం సంస్థ

దేశానికి పట్టిన కరోనా మహమ్మారి పీడ ఎప్పుడు విరుగుడవుతుందా అని యావత్ దేశం ఆశగా ఎదురుచూస్తుంది. మరోవైపు వ్యాక్సిన ప్రయోగాల్లో డ్రగ్స్ కంపెనీలు తుది నిర్ణయానికి రాలేకపోతున్నాయి.

ఈ ఏడాది చివరికల్లా కోవిషీల్డ్‌ వ్యాక్సిన్..కానీ.. : సీరం సంస్థ
Follow us

|

Updated on: Oct 29, 2020 | 9:05 AM

దేశానికి పట్టిన కరోనా మహమ్మారి పీడ ఎప్పుడు విరుగుడవుతుందా అని యావత్ దేశం ఆశగా ఎదురుచూస్తుంది. మరోవైపు వ్యాక్సిన ప్రయోగాల్లో డ్రగ్స్ కంపెనీలు తుది నిర్ణయానికి రాలేకపోతున్నాయి. నిత్యం వేలాది కొత్తగా పాజిటివ్ కేసులతో జనం బెంబేతెత్తున్నారు. అయితే, ఇలాంటి తరుణంలో టీకా తయారీలో నిమగ్నమైన సీరం సంస్థ శుభవార్త మోసుకొచ్చింది. దేశంలో డిసెంబర్‌ నాటికి కరోనా టీకా కోవిషీల్డ్ అందుబాటులోకి రావచ్చని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఎస్‌ఐ) సీఈఓ అదార్ పూనవల్లా తెలిపారు. అత్యవసర లైసెన్స్‌ కోసం ప్రయత్నించకపోతే క్లినికల్‌ ట్రయల్స్‌ డిసెంబర్‌లో పూర్తయి వచ్చే ఏడాది జనవరిలో టీకా అందుబాటులోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, బ్రిటన్‌లో ఈ టీకా వినియోగ సమాచారం, డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) నిర్ణయంపై ఇది ఆధారపడి ఉంటుందని అదార్ పూనవల్లా అన్నారు.

బ్రిటన్‌లో వచ్చే నెల నుంచి కరోనా టీకాను అందుబాటులోకి తీసుకురావాలని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ బృందం నిర్ణయించింది. తొలుత మహమ్మారితో ముందుండి పోరాడుతున్న ఫ్రంట్ వారియర్స్ వైద్యులు, వైద్య సిబ్బందికి టీకా ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌లో కరోనా టీకా అందుబాటు గురించి ఎస్‌ఎస్‌ఐ సీఈఓ అదార్‌ మీడియాతో మాట్లాడారు. బ్రిటన్‌లో అంతా సవ్యంగా జరిగితే దేశంలో డిసెంబర్‌ నాటికి టీకాను అందుబాటులోకి తేవచ్చని చెప్పారు. తొలుత 10 కోట్ల డోసులను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన వివరించారు. కోవిషీల్డ్‌ రెండు డోసుల రూపంలో టీకాను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు చెప్పారు. ఒక డోసు టీకా వేసిన 28 రోజుల తర్వాత మరో డోసు టీకా వేయాల్సి ఉంటుందని వివరించారు. రెండు డోసుల టీకా వ్యయంపై ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నందున దీనిపై ఇప్పుడే వ్యాఖ్యానించబోనని ఆయన చెప్పారు. అయితే, మిగతా టీకాల కంటే చౌకలోనే లభిస్తుందన్నారు.

బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ, డ్రగ్స్ కంపెనీ ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ మూడో దశ పరీక్షలు ప్రస్తుతం తుది దశకు చేరుకున్నాయి. బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీకి చెందిన జెన్నర్ ఇన్స్టిట్యూట్‌ అభివృద్ధి చేసిన, ఆస్ట్రాజెనెకా నుండి లైసెన్స్ పొందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఎస్‌ఐ) కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌పై దేశంలోని సుమారు 1,600 మంది వలంటీర్లపై తుది దశ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహిస్తుంది. ఇది విజయవంతమైతే టీకా ఉత్పత్తి, సరఫరాపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని భావిస్తుంది. వ్యాక్సిన్ ప్రయోగాలు సత్ఫలితాలు ఇస్తుండటంతో డ్రగ్స్ కంపెనీలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.