కరోనా మృతుల అంత్యక్రియలపై ఏపీ ప్రభుత్వం సూచనలు..
కరోనా మృతుల అంత్యక్రియలు, ఎదురవుతున్న ఇబ్బందులపై ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి జవహర్ రెడ్డి స్పందించారు. మృతదేహాల నుంచి వైరస్ వ్యాప్తి చెందటం లేదన్న ఆయన..

కరోనా మృతుల అంత్యక్రియలు, ఎదురవుతున్న ఇబ్బందులపై ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి జవహర్ రెడ్డి స్పందించారు. మృతదేహాల నుంచి వైరస్ వ్యాప్తి చెందటం లేదన్న ఆయన.. కరోనా రోగి చనిపోయిన ఆరు గంటల తర్వాత వైరస్ శరీరంపై ఉండదని స్పష్టం చేశారు. వారి దహన సంస్కారాలను ఎవరూ అడ్డుకోవద్దని, ఇబ్బందులు సృష్టించవద్దని తెలిపారు. కరోనా జాగ్రత్తలు పాటించడంలో ప్రజలు ఇంకా అశ్రద్ధ చూపిస్తున్నారన్న ఆయన.. ప్రస్తుతం ఏపీలో ఒకరి నుంచి 1.12 మందికి కరోనా సోకుతోందన్నారు. ఈ గణాంకం రెండు దాటితే ప్రమాదం ఉన్నట్లేనని ఆయన చెప్పారు.
Also Read: గ్రామ, వార్డు సచివాలయ అభ్యర్థులకు మరో ఛాన్స్.. గడువు పొడిగింపు..!
కాగా, ఏపీలో కరోనా పరీక్షలను పెంచామని జవహర్ రెడ్డి వెల్లడించారు. మిలియన్‌కు 18,200 మందికి పరీక్షలు చేస్తున్నామన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 9.7 లక్షల మందికి కరోనా టెస్టులు చేశామన్నారు. అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభమయ్యాక కేసులు పెరుగుతున్నాయని.. దేశం, రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోందని అన్నారు. వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుందో పరిశీలిస్తున్నామన్న ఆయన.. నిర్మాణం, వ్యవసాయ రంగం కార్మికులకు కూడా కరోనా టెస్టులు చేస్తున్నామని తెలిపారు. కరోనా చికిత్స కోసం త్వరలోనే ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా అనుమతిస్తామని.. ధరల విషయంలో మాత్రం ఖచ్చితంగా నియంత్రణ ఉంటుందన్నారు. కాగా, కరోనాను కట్టడి చేసేందుకు రాత్రింబవళ్ళు శ్రమిస్తున్న వైద్యులపై పనిభారం తగ్గించేందుకు కొత్తవారిని నియమిస్తామని జవహర్ రెడ్డి వెల్లడించారు.
Also Read: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇక నుంచి టికెట్‌లెస్ ప్రయాణం..!




