కరోనా అనుమానంతో ఆత్మహత్య.. ఫలితాల్లో తేలిన నెగిటివ్

కరోనా సోకిందేమోననే అనుమానంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతరం వచ్చిన ఫలితాల్లో అతనికి నెగెటివ్‌గా తేలింది. విశాఖలోని చినగదిలి బీసీ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది.

కరోనా అనుమానంతో ఆత్మహత్య.. ఫలితాల్లో తేలిన నెగిటివ్
Follow us
Balaraju Goud

|

Updated on: Aug 24, 2020 | 10:20 AM

కరోనా మహమ్మారి వింతలు చూపిస్తోంది. అనుమానమే ప్రాణాల మీదకు తెస్తోంది. అసలు రోగం నిర్ధారణ కాకముందే భయంతో బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటననే విశాఖ జిల్లాలో చోటుచేసుకుంది. తాజాగా కరోనా సోకిందేమోననే అనుమానంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతరం వచ్చిన ఫలితాల్లో అతనికి నెగెటివ్‌గా తేలింది. విశాఖలోని చినగదిలి బీసీ కాలనీకి చెందిన ఆకిన వసంతకుమార్‌ భార్య, ఇద్దరు కుమారులతో నివాసముంటున్నారు. కుటుంబ సభ్యులందరూ జ్వరంబారిన పడడంతో అందరు దగ్గరలోని ఆస్పత్రికి వెళ్లి ఈనె 18న కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ముగ్గురికి నెగెటివ్‌ రాగా, రెండో కుమారుడు హరికృష్ణ(27) రిపోర్ట్‌ రాలేదు.

అయితే, తనకు కరోనా సోకిందేమోననే అనుమానంతో తీవ్ర ఆందోళన గురయ్యాడు. శనివారం తెల్లవారు జామున అందరూ నిద్రిస్తున్న సమయంలో హరికృష్ణ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గమనించిన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే, అతను కనిపోయిన కొద్ది సేపటికే కరోనా ఫలితం వచ్చింది. వెలువడిన ఫలితాల్లో హరికృష్ణకు నెగెటివ్‌గా తేలింది. దీంతో కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు కేజీహెచ్‌కి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు.