AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Puducherry Cm Narayanaswami:’మా ప్రభుత్వాన్ని పడగొట్టే యత్నాలను ఎదుర్కొంటాం’, పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం..... తమ ప్రభుత్వాన్ని విపక్ష అన్నా డీఎంకే, ఏఐఎన్ ఆర్ సీ తోడ్పాటుతో పడగొట్టేందుకు యత్నిస్తోందని పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి..

Puducherry Cm Narayanaswami:'మా ప్రభుత్వాన్ని పడగొట్టే యత్నాలను ఎదుర్కొంటాం', పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి
Umakanth Rao
| Edited By: Pardhasaradhi Peri|

Updated on: Feb 20, 2021 | 12:50 PM

Share

Puducherry Cm Narayanaswami:కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం….. తమ ప్రభుత్వాన్ని విపక్ష అన్నా డీఎంకే, ఏఐఎన్ ఆర్ సీ తోడ్పాటుతో పడగొట్టేందుకు యత్నిస్తోందని పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి ఆరోపించారు. కానీ తమ అధికార కాంగ్రెస్ పార్టీ వాటిని ఎదుర్కొని అధిగమిస్తుందన్నారు. ఈనెల 22 న అసెంబ్లీలో విశ్వాస పరీక్షను ఎదుర్కొవాలంటూ లెఫ్టినెంట్ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ తనను ఆదేశించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రజాస్వామ్య విలువలను మంట గలిపేందుకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్ యత్నిస్తోందని దుయ్యబట్టారు. ప్రధాని మోదీని నియంతగా ఆరోపించిన ఆయన.. ఐటీ, ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలను కేంద్రం వినియోగించుకుంటోందన్నారు. గోవా, మణిపూర్, మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోని కాంగ్రెస్ ప్రభుత్వాలను అస్థిర పరచేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఇప్పుడు దాని కన్ను పుదుచ్చేరిపై పడిందని నారాయణస్వామి అన్నారు. కానీ ఈ విధమైన కుయుక్తులను తాము ఇదివరలో కూడా ఎదుర్కొన్నామని, ఇప్పుడు కూడా అదే పని చేసి వాటిని అధిగమిస్తామని ఆయన చెప్పారు. అసెంబ్లీలో  జరిగే విశ్వాస పరీక్ష సందర్భంగా ఎలా వ్యవహరించాలో కాంగ్రెస్ సభ్యులు ఈ నెల 21 న జరిగే సమావేశంలో చర్చించి ఓ యాక్షన్ ప్లాన్ తో వస్తారని ఆయన తెలిపారు.

నలుగురు సభ్యుల రాజీనామాలతో తమ రాష్ట్రంలో ప్రభుత్వం మైనారిటీలో పడిపోయిందన్న వార్తలను ఆయన తొసిపుచ్చారు. సభలో విశ్వాస తీర్మానంపై ఓటు చేసే హక్కు నామినేటెడ్ సభ్యులకు ఉందా అన్న విషయమై తాను న్యాయ నిపుణులతో సంప్రదిస్తున్నానని ఆయన చెప్పారు. 33 మంది సభ్యులున్న అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 10 మంది సభ్యులున్నారు. దీని మిత్ర పక్షం డీఎంకేకి ముగ్గురు, ఓ ఇండిపెండెంట్ సభ్యుడు కూడా కాంగ్రెస్ కి మద్దతు నిస్తున్నారు. ప్రతిపక్ష సభ్యులు కూడా 14 మంది ఉన్నారు. వీరిలో ముగ్గురు నామినేటెడ్ సభ్యులు. అయితే వీరిని బీజేపీకి చెందినవారిగా గవర్నర్ పేర్కొనడం చరిత్రాత్మక తప్పిదమని నారాయణస్వామి విమర్శించారు. ఇది పూర్తిగా అసెంబ్లీ రికార్డులను అతిక్రమించడమే అవుతుందందన్నారు. వారు బీజేపీకి చెందినవారా, కాదా అన్న విషయమై ఇంకా ఫార్మాలిటీలు పూర్తి కావలసి ఉందని నారాయణస్వామి పేర్కొన్నారు.