YSRCP internal fight: రసకందాయంలో చీరాల పాలిటిక్స్.. ఎవరి మాట నెగ్గేనో?

ప్రకాశం జిల్లా వైసీపీ రాజకీయం రసకందాయంలో పడింది. ముఖ్యంగా చీరాల మునిసిపాలిటీ ఎన్నికల్లో అధికార పార్టీలోనే రెండు వర్గాలు బలంగా వుండడం, ఎవరికి వారు పోటాపోటీ నామినేషన్లు దాఖలు చేయడంతో నేతలిద్దరి పంచాయితీ వైసీపీ అధినేత జగన్ ముందుకు వెళ్ళింది.

YSRCP internal fight: రసకందాయంలో చీరాల పాలిటిక్స్.. ఎవరి మాట నెగ్గేనో?
Follow us
Rajesh Sharma

|

Updated on: Mar 13, 2020 | 6:44 PM

Chirala politics reached its peak level: ప్రకాశం జిల్లా వైసీపీ రాజకీయం రసకందాయంలో పడింది. ముఖ్యంగా చీరాల మునిసిపాలిటీ ఎన్నికల్లో అధికార పార్టీలోనే రెండు వర్గాలు బలంగా వుండడం, ఎవరికి వారు పోటాపోటీ నామినేషన్లు దాఖలు చేయడంతో నేతలిద్దరి పంచాయితీ వైసీపీ అధినేత జగన్ ముందుకు వెళ్ళింది. దాంతో మొదట్నించి పార్టీలో వున్న ఆమంచి కృష్ణమోహన్ నేరుగా జగన్‌ని కలిసి పరిస్థితి వివరించారు. మొదట్నించి పార్టీలో కష్టపడుతున్న వారంతా తన తరపున నామినేషన్లు వేస్తే.. కొత్తగా వచ్చిన వారు కూడా వైసీపీని తరపున బరిలోకి దిగడం ఇబ్బందికరంగా వుందని ఆయన అధినేతకు వివరించినట్లు సమాచారం.

ప్రకాశంజిల్లా చీరాల మునిసిపాలిటీ కౌన్సిలర్ల నామినేషన్లలో వైసీపీలో పోటాపోటీ నెలకొంది. ఒక్కో వార్డుకు ఎమ్మెల్యే బలరాం, మాజీ ఎమ్మెల్యే ఆమంచి వర్గీయులు పదుల సంఖ్యలో పోటాపోటీ నామినేషన్లు దాఖలు చేశారు. చీరాల మున్సిపాలిటీలో మొత్తం 33 వార్డులకు గాను నామినేషన్ల దాఖలు గడువు ముగిసే సమయానికి 308 నామినేషన్లు దాఖలయ్యాయి. వైసీపీ తరపున ఇరు వర్గాలకు చెందిన వారు పెద్ద సంఖ్యలో అంటే 237 నామినేషన్లు వేశారు. టీడీపీ తరపున 20 వార్డుల్లో నామినేషన్లు వేశారు. బీజేపీ 4, జనసేన 5, సిపియం 2, బీఎస్‌పీ 1, కాంగ్రెస్‌ 7, ఇండిపెండెంట్లు 32 స్థానాలకు నామినేషన్లు వేశారు.

మిగిలిన పార్టీలకు ఎలాంటి ఇబ్బంది లేకున్నా వైసీపీలో మాత్రం బీఫారం ఎవరికి ఇస్తారోనన్న సస్పెన్స్ మొదలైంది. రేపు సాయంత్రం వరకు వేచి చూసే ధోరణిలో వైసీపీ నేతలు ఉన్నారు. పోటాపోటీ నామినేషన్లతో వైసీపీ కార్యకర్తల్లో అయోమయం నెలకొని ఉంది. బీ ఫారాలు వైసీపీ ఇన్‌చార్జి ఆమంచి కృష్ణమోహన్‌ దగ్గర ఉండటంతో ఆయన వర్గానికి చెందిన నేతలకే బీ ఫారాలు ఇస్తారని భావిస్తున్నారు. మరి రెండ్రోజుల క్రితం వైసిపిలో చేరిన కరణం బలరాం వర్గీయులకు చెందిన వారి పరిస్థితి ఏంటనేది నామినేషన్ల ఉపసంహరణ నాటికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో తాజా పరిస్థితిని అధినేతకు వివరించేందుకు ఆమంచి అమరావతికి వచ్చారు. అధినేతను కలిసి పరిస్థితి వివరించారు. మొదట్నించి పార్టీ కోసం పని చేస్తున్న వారికి న్యాయం చేయాలని అర్థించారు. తన దగ్గర వున్న బీ ఫారాలను ఎవరికి ఇవ్వాలనే విషయంపై అధినేత సలహాను కోరారు. ఈ విషయంలో ఆమంచి, కరణంలతో కలిసి ఉమ్మడి భేటీ ఏర్పాటు చేసే బాధ్యతలను వైవీ సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డిలకు జగన్ అప్పగించినట్లు తెలుస్తోంది.