దత్తన్నకు దక్కిన గౌరవం.. ఎన్నాళ్లకీ “పురస్కారం”..!

దత్తన్నకు దక్కిన గౌరవం.. ఎన్నాళ్లకీ పురస్కారం..!

కేంద్ర మాజీ మంత్రి, తెలంగాణకు చెందిన బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయను గవర్నర్ పదవి వరించింది. ఆదివారం రోజు ఐదు రాష్ట్రాలకు నూతన గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి భవన్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. హిమాచల్ ప్రదేశ్‌కు బండారు దత్తాత్రేయను గవర్నర్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించింది. కేంద్రమంత్రిగా ఉన్న దత్తాత్రేయను పక్కన బెట్టడంతో ఇక అంతే అనుకుంటున్న సమయంలో.. ఆయనకు గవర్నర్ పదవి దక్కుతుందనే ప్రచారం జరిగింది. తాజాగా కేంద్ర నిర్ణయంతో బీజేపీ శ్రేణులు సంతోషం వ్యక్తం […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Sep 01, 2019 | 12:53 PM

కేంద్ర మాజీ మంత్రి, తెలంగాణకు చెందిన బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయను గవర్నర్ పదవి వరించింది. ఆదివారం రోజు ఐదు రాష్ట్రాలకు నూతన గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి భవన్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. హిమాచల్ ప్రదేశ్‌కు బండారు దత్తాత్రేయను గవర్నర్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించింది. కేంద్రమంత్రిగా ఉన్న దత్తాత్రేయను పక్కన బెట్టడంతో ఇక అంతే అనుకుంటున్న సమయంలో.. ఆయనకు గవర్నర్ పదవి దక్కుతుందనే ప్రచారం జరిగింది. తాజాగా కేంద్ర నిర్ణయంతో బీజేపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేశారు. దత్తాత్రేయకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్..అభినందనలు తెలియచేశారు. కష్టపడి పార్టీ కోసం పనిచేసే వారికి పదవులు లభిస్తాయనడానికి ఇదే ఒక సూచకమంటూ బీజేపీ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

బండారు దత్తాత్రేయ.. బీజేపీలో కీలక నేతగా పనిచేశారు. అంతకుముందు ఆయన ఆర్ఎస్ఎస్‌లో ప్రచారక్‌గా పనిచేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్‌ నుంచి వచ్చిన ఆయన పార్టీలో పలు కీలక పదవులు చేపట్టారు. చట్ట సభల్లోనూ అడుగుపెట్టి.. కేంద్ర మంత్రిగా కూడా సేవలందించారు. 1947 ఫిబ్రవరి 26న జన్మించిన దత్తాత్రేయ.. 1965 రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లో చేరారు. 1968 నుంచి 1989 వరకు పూర్తి సమయ ప్రచారక్‌గా పనిచేశారు. ఆ తర్వాత 1980వ సంవత్సరంలో బీజేపీలో చేరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించారు. 1991 నుంచి 2004 మధ్య కాలంలో సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్‌లో కేంద్ర మంత్రిగా పనిచేశారు. అనంతరం 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ తరఫున దత్తాత్రేయ పోటీ చేసి గెలుపొందారు. అంతేకాదు మోదీ ప్రభుత్వం తొలి కేబినెట్‌లో కార్మికశాఖ మంత్రిగా దత్తాత్రేయ బాధ్యతలు చేపట్టారు. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం దత్తాత్రేయకు రాలేదు. అయితే.. దత్తాత్రేయకు ఇక ఏ పదవి రాదని ఓ వైపు.. కీలక పదవి వస్తుందని మరోవైపు ప్రచారం జరుగుతోన్న సమయంలో ఆయనకు గవర్నర్ పదవి కట్టబెట్టి బీజేపీ గౌరవించింది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu