ఏలూరులో కలవర పెడుతున్న వింత వ్యాధి.. 450 మార్క్ దాటిన బాధితులు

| Edited By: Shiva Prajapati

Updated on: Dec 08, 2020 | 7:56 AM

ఏలూరు ఆసుపత్రిలో ఎటూ చూసినా అస్వస్థతకు గురైన రోగులే కనిపిస్తున్నారు. స్పృహతప్పి పడిపోయిన బాధితులే ఉన్నారు. ఉన్నట్టుండి పడిపోవడంతో.. ఊపిరి ఆడక కొట్టుకోవడం.. కలవరానికి గురిచేస్తోంది.

ఏలూరులో కలవర పెడుతున్న వింత వ్యాధి.. 450 మార్క్ దాటిన బాధితులు

ఏలూరులో కలవరం రేపుతున్న వింత వ్యాధికి అసలు కారణాలేంటీ .. ఎక్కడ లోపం జరిగింది. వారి అనారోగ్యానికి ఏమై ఉంటుంది అన్నదానికి అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు నీరు, కాలుష్యంపైనే అనేక విధాలుగా చర్చ సాగింది. తాజాగా వారు తీసుకున్న ఫుడ్‌ విషయంలోనూ ఇప్పుడు సందేహాలు వినిపిస్తున్నాయి.

అంతుచిక్కని వ్యాధితో ఏలూరు పట్టణం విలవిలలాడుతోంది. విశాఖ గ్యాస్‌ లీకేజీ దృశ్యాలే ఏలూరులోనూ కనిపిస్తున్నాయి. కళ్లు తిరిగిపోతుండడం, స్పృహ కోల్పోవడం, నీరసంతో చతికిలబడటంలాంటి సంఘటనలు ఏలూరులో ఏప్రాంతంలో చూసిన అవే అవే దృశ్యాలు కనిపించాయి. మోటారుసైకిల్‌ను నడుపుతున్నప్పుడు ఓ యువకుడు పడిపోయాడు. ఓ వివాహిత ఇంట్లోనే అందరితో మాట్లాడుతున్నప్పుడు ఉన్నట్టుండి కొద్దిసేపు అపస్మారకంలోకి చేరుకుంది. ఆరేళ్ల బాలిక తల్లిదండ్రులతో కలిసి దేవాలయానికి వెళ్లగా అక్కడే స్పృహ తప్పి కుప్పకూలింది. మరో వ్యక్తి ఇంట్లోనే ఎవరూ లేనందున వంట చేస్తూ స్టవ్‌ వద్ద కళ్లు తిరిగిపడిపోయాడు. ఇంకో వృద్ధురాలు కూడా వంట చేస్తున్నప్పుడు స్పృహ తప్పింది. ఒకే కుటుంబంలో నలుగురైదుగురు ఉంటే ఒకరు, పలుచోట్ల ఇద్దరు ఈ సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రులకు చేరుతున్నారు. ఏ జరిగిందో తెలుసుకునే లోపే ఆస్పత్రిలో ఉంటున్నారు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 08 Dec 2020 07:56 AM (IST)

    భారత్ బంద్‌కు టీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు

    కొత్త వ్యవసాయ చట్టాలతో రైతులు రోడ్డున పడి, కూలీలుగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో ఇవాళ్టి బంద్‌కు టీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. వర్కింగ్‌ ప్రెసిడెంట్ మొదలు.. మంత్రులు నుంచి సాధారణ కార్యకర్తల వరకు అంతా రోడ్డెక్కనున్నారు. భారత్‌ బంద్‌ను విజయవంతం చేయడమే టార్గెట్‌గా గులాబీ పార్టీ ముందుకెళ్తోంది.

  • 07 Dec 2020 06:10 PM (IST)

    భయాందోళనలకు గురికావద్దు.. అన్ని వైద్య సదుపాయాలు కల్పిస్తాంః మంత్రి నాని

    వింత వ్యాధి ప్రబలుతుండటంతో ఏపీ రాష్ట్ర సర్కార్ అప్రమత్తమైంది. డిశ్చార్జ్‌ చేసిన బాధితులను నెలపాటు పర్యవేక్షించాలని.. బాధితులకు మంచి న్యూట్రిషన్‌ ఫుడ్‌ అందించాలని సీఎం జగన్‌ ఆదేశించారు. అస్వస్థతకు గల కారణాలపై పరిశోధనకు కేంద్ర బృందాలు వస్తున్నాయి. ఢిల్లీ నుంచి ఎయిమ్స్ బృందం కూడా రాబోతుంది. బాధితులు ఆందోళన చెందవద్దని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఎవరు భయాందోళనలకు గురి కావద్దన్నారు. వ్యాధికి గురవుతున్నవారి సంఖ్య పెరుగుతుండటంతో అన్ని రకాల వైద్య సదుపాయాలు కల్పించాలని మంత్రి నాని అధికారులను ఆదేశించారు.

  • 07 Dec 2020 05:37 PM (IST)

    ఏలూరులో 451 మందికి సోకిన వింత వ్యాధి

    అంతుచిక్కని వ్యాధి బారినపడుతున్న వారి సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. గంట గంటకు కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. సాయంత్రం 5గంటల వరకు 451 మంది వింత వ్యాధి బారినపడ్డారని జిల్లా వైద్యాధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో 171 మంది చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. ఇక, ఇప్పటి వరకు 263 మంది కోలుకోగా, వారిని డిశ్చార్జ్ చేసి ఇళ్లకు పంపినట్లు అధికారులు తెలిపారు. ఇక, పరిస్థితి విషమంగా ఉన్నవారిలో 17 మందిని విజయవాడ, గుంటూరు ఆస్పత్రులకు పంపించామన్నారు. కాగా, ఇప్పటి వరకు వ్యాధికి గురైనవారిలో 241 పురుషులు ఉండగా, మహిళలు 210 ఉన్నారు. మాయదారి రోగానికి 64 మంది చిన్నారులు గురైయ్యారు. అందులో 40 మంది మగపిల్లలు కాగా, 24 ఆడపిల్లలు ఉన్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు.

  • 07 Dec 2020 05:26 PM (IST)

    9 మంది సభ్యులతో కూడిన పౌష్టికాహార శాస్త్రవేత్తలు

    ఇంతకీ గాలీ నీరు కాకుండా మరేమీ కారణం అయి ఉంటుంది.. అంతు చిక్కని వ్యాధికి అసలు కారణాలేంటి... హైదరాబాద్ జాతీయ పౌష్టికాహార సంస్థ పరిశోధనకు సిద్ధమైంది. వింత వ్యాధులపై పరిశోధన కు... హైదరాబాద్ NIN నుంచి ప్రత్యేక శాస్త్రవేత్తల బృందం ఏలూరుకు బయలు దేరింది. 9 మంది సభ్యులతో కూడిన నేషనల్ న్యూట్రీషన్లు టీమ్.. హైదరాబాద్ నుంచి ఏలూరుకు పయనమైంది. రేపు ఏలూరులో ఆహారపదార్ధాలకు సంబంధించి శాంపిల్స్ సేకరించి పరిశోధన చేయనుంది. ఏపీడిమియోలజీ, టాక్సీకలజీ, ఫుడ్ కెమిస్ట్రీ, మైక్రో బయాలజీ, హెల్త్ న్యూట్రిషన్ శాస్త్రవేత్తలు ఈ బృందం లో ఉన్నారు.

  • 07 Dec 2020 05:25 PM (IST)

    హైదరాబాద్ నుంచి ఏలూరుకు బయలుదేరిన ఆహార నిపుణులు

    ఏలూరులో ప్రబలిన వింత రోగం ఎవరికీ అంతు చిక్కడం లేదు. ఆహారంలో కల్తీపై ఫోకస్ చేస్తున్నారు.. ఇప్పటి వరకు నీరు, కాలుష్యంపైనే అనేక విధాలుగా చర్చ సాగింది. తాజాగా వారు తీసుకున్న ఆహారం విషయంలోనూ ఇప్పుడు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆహారంలో ఏమైనా లోపం తలెత్తిందా.. అన్నది కూడా చూడాల్సి ఉందని చెబుతున్నారు స్థానికులు. ఆ ప్రాంతంలో ఇటీవల జరిపిన ఫుడ్‌ అమ్మకాలతో పాటు.. నిత్యావసరాలు అమ్మే కిరాణం, జనరల్‌ స్టోర్స్‌లోనూ తనిఖీలు చేయాల్సి ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతోంది. చిన్నా పెద్దా తేడా లేకుండా చాలా మంది స్పృహతప్పి పడిపోతుండడానికి మొదటిది నీరు అయితే రెండోది ఫుడ్‌ అయి ఉంటుందన్న అనుమానాలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.నీటి కాలుష్యం కాటేసిందా? గాలిని విషతుల్యం అయిందా... లేక తిన్న ఆహారంలో ఏదైనా కల్తీ జరిగిందా అన్నది తేలాల్సి ఉంది. హైదరాబాద్‌ నుంచి NIN నిపుణులు ఏలూరుకు చేరుకుంటారు.

  • 07 Dec 2020 05:05 PM (IST)

    ఏలూరులో ఇంటింటి సర్వే చేపట్టిన అధికారులు

    ఏలూరులో అధికారులు ఇంటింటి సర్వే చేపడుతున్నారు. దాదాపు అన్ని ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు.దక్షిణ వీధిలోనే ఇప్పటివరకు 14 మంది అస్వస్థతకు గురయ్యారు. ప్రతీ ఇంటికి వెళ్లి ఎఎన్ఎంలు ఆరోగ్య వివరాలను సేకరిస్తున్నారు. ఈ వ్యాధిబారిన పడ్డవారి వివరాలను సేకరిస్తున్నారు. చికిత్స తీసుకున్నవారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది. కొందరు మళ్లీ అస్వస్థతకు గురవుతున్నట్టు బయటపడుతుండడంతో.. వారిని ప్రత్యేకంగా అబ్జర్వేషన్‌లో ఉంచినట్టు డాక్టర్లు చెబుతున్నారు. ఈ వ్యాధి బారిన పడుతున్న ప్రాంతాల్లో ప్రత్యేక వైద్యబృందాలు.. నిరంతరం వైద్యసేవలను అందిస్తున్నాయి. మెడికల్‌ క్యాంపుల ద్వారా అందరికీ టెస్టులు జరుపుతున్నారు. అత్యవసరమైతే ఆస్పత్రులకు పంపిస్తున్నారు. ఇందు కోసం ప్రత్యేక అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచారు.

  • 07 Dec 2020 05:00 PM (IST)

    తాగునీటి శాంపిల్స్‌ను పరిశీలించిన అధికారులు..

    మూడురోజుల క్రితం ఐదుగురితో మొదలైన కేసుల సంఖ్య 440 దాటిపోయాయి. ఏలూరు నగరంలోనే కాదు.. చుట్టుపక్క గ్రామాల్లోనూ కొత్తగా వెలుగుచూస్తున్నాయి. చిన్నపిల్లలనే కాదు.. పెద్దలు కూడా వింతరోగంతో విలవిలలాడిపోతున్నారు. 22 ప్రాంతాల్లో తాగునీటి శాంపిల్స్‌ను పరిశీలించిన అధికారులు.. బాధితుల నుంచి రక్తనమూనాలను కూడా సేకరించారు. ఇప్పటివరకు రిపోర్ట్స్‌ అన్నీ నార్మల్‌గానే ఉన్నాయి. ఎయిమ్స్‌, సీసీఎంబీ నుంచి వచ్చే రిపోర్ట్స్‌ ఆధారంగానే అసలు కారణం ఏంటని తెలిసే అవకాశం ఉందన్నది వైద్యుల వాదనగా ఉంది.

  • 07 Dec 2020 04:27 PM (IST)

    ఏలూరులో గాయత్రినగర్‌లో డ్రైనేజీ అస్తవ్యస్థం

    ఏలూరులోని గాయత్రినగర్‌ వాసులు కొందరు అస్వస్థతకు గురయ్యారు. నాలుగైదు రోజులుగా అక్కడ డ్రైనేజీ కాలువను తవ్వుతున్నారు. దీంతో తాగునీటి సరఫరా అయ్యే పైపులైన్ ఏమైనా కలుషితం అయిందా అన్న అనుమానాలు ఓవైపు ఉంటే.. మరోవైపు పక్కనే రొయ్యల చెరువులు ఉండడం కూడా అనుమానాలకు తావిస్తోంది.

  • 07 Dec 2020 04:17 PM (IST)

    ఢిల్లీ రిపోర్ట్స్‌ వస్తే గానీ వ్యాధిపై అవగాహనకు రాలేముః డాక్టర్‌ రాకేష్‌ కక్కర్‌

    ఏలూరు రోగుల నుంచి సేకరించిన రక్తనమూనాలను ఢిల్లీ ఎయిమ్స్‌కు పంపించారు. ఈ రాత్రికి రిపోర్ట్స్‌ వస్తాయని ఏయిమ్స్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాకేష్‌ కక్కర్‌ తెలిపారు. న్యూ ఢిల్లీ నుంచి రిపోర్ట్స్‌ వస్తే కానీ అంతుచిక్కని వ్యాధిపై ఓ అవగాహనకు రాలేమని అంటున్నారు. రోగ నిర్ధారణ కోసం 8 మంది డాక్టర్ల బృందం అక్కడే ఉండి పరీక్షలు జరుపుతున్నట్టు వెల్లడించారు.

  • 07 Dec 2020 04:03 PM (IST)

    వింత వ్యాధికి గురైన వారిలో యువతే అధికం

    ఏలూరులో అంతుచిక్కని వ్యాధి ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 443 మంది వ్యాధి బారినపడ్డారని తూర్పుగోదావరి జిల్లా వైద్యాధికారులు వెల్లడించారు. ఇందులో 12 ఏళ్ల లోపు వారు 63 మంది చిన్నారులు ఉండగా, అందులో 40 మంది బాలురు కాగా, 23 మంది బాలికలు ఉన్నారని అధికారులు తెలిపారు. ఇక ఈ వింత వ్యాధి బారినపడిన వారిలో 12 నుంచి 35 ఏళ్ల వయసు కలిగిన వారు 241 ఉంటే, ఇందులో 117 పురుషులు, 124 మంది మహిళలు 35 ఏళ్లు పైబడి 139 మంది ఈ మాయదారి రోగం బారినపడ్డారు. ఇందులో 82 మంది పురుషులు కాగా, 57 మంది మహిళలు ఉన్నట్లు జిల్లా వైద్యాధికారులు వెల్లడించారు.

  • 07 Dec 2020 03:55 PM (IST)

    ఏలూరులో ప్రబలుతున్న వింత వ్యాధి.. 443కు చేరిన బాధితుల సంఖ్య

    ఏలూరులో వింత వ్యాధితో బాధపడుతున్న వారు ఒక్కొక్కరుగా మొదలై 400 పైగా దాటారు. ఈ మధ్యాహ్నాం 3 గంటల వరకు బాధితుల సంఖ్య 443 కు చేరింది. ఇప్పటికే ఒకరు మృతి చెందారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా 16 మందిని విజయావాడ, గుంటూరు ఆస్పత్రులకు తరలించినట్లు తూర్పుగోదావరి జిల్లా వైద్యాధికారి వెల్లడించారు. ఇక, ఇప్పటివరకు 243 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం అస్వస్థతకు గురైన 183 మందికి చికిత్స అందిస్తున్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు, ఆందోళన చెందాల్సి అవసరం లేదన్నారు. మరోవైపు, అంతుచిక్కని వ్యాధి కారణంగా గంట గంటకు బాధితుల సంఖ్య పెరుగుతోంది. దీంతో స్థానికుల్లో మరింత ఆందోళన వ్యక్తమవుతోంది. అసలు కారణాలేంటి? ఇదేం రోగం.. అని కూడా తెలియకపోవడంతో.. స్థానికులు భయపడిపోతున్నారు.

  • 07 Dec 2020 03:41 PM (IST)

    ఏలూరుకు రేపు కేంద్ర వైద్య బృందం.. సాయంత్రానికి ప్రాథమిక నివేదిక అందించాలని ఆదేశం

    ఏలూరుకు కేంద్ర వైద్య బృందాన్ని అత్యవసరంగా పంపనున్నట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. రేపు ఏలూరుకు చేరుకున్నాక ఈ బృందం ప్రజల ఆకస్మిక అనారోగ్యంపై విచారణ జరుపనుంది. ఈమేరకు కేంద్రం నుంచి ఏలూరు చేరుకునే బృందాన్ని నియమిస్తూ ప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బృందంలో డాక్టర్ జంషెడ్ నాయర్, అసోసియేట్ ప్రొఫెసర్, డాక్టర్ అవినాష్ డియోష్టవర్, వైరాలజిస్ట్, డాక్టర్ సంకేత్ కులకర్ణి ఉంటారు. ఏలూరులో ప్రబలుతున్న వింత వ్యాదికి సంబందించి రేపు సాయంత్రానికి ప్రాథమిక నివేదికను సమర్పించాలని కేంద్రం ఆదేశించింది.

  • 07 Dec 2020 03:02 PM (IST)

    రాష్ట్రానికి పూర్తి సహకారం అందిస్తాంః కిషన్‌రెడ్డి

    ఏలూరు ఘటనపై కేంద్రం ఆరా తీస్తుందని, మంగళవారం ప్రత్యేక కేంద్ర బృందం రానున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ముగ్గురు ఎయిమ్స్‌ అధికారుల బృందాన్ని ఏలూరు పంపుతున్నామని ఆయన వెల్లడించారు. కేంద్ర బృందం రేపు ఏలూరుకు చేరుకుంటుందని, వింత వ్యాధితో జనం భయపడిపోతున్నారన్న ఆయన.. రాష్ట్రానికి పూర్తి సహకారం అందిస్తామని కిషన్‌ రెడ్డి వెల్లడించారు.

  • 07 Dec 2020 02:46 PM (IST)

    ఏలూరు ఘటనపై సీపీఐ నేత రామకృష్ణ దిగ్భ్రాంతి.. బాధితులను ప్రభుత్వమే ఆదుకోవాలంటూ డిమాండ్..

    ఏలూరు ఘటనపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పందించారు. ఈ ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. అంతమంది ఆస్పత్రిపాలు కావడానికి గల కారణమేంటో త్వరగా తేల్చాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏలూరు బాధితులను ప్రభుత్వమే ఆదుకోవాలన్నారు. అలాగే మృతి చెందిన బాధితుడికి రూ. 20 లక్షల పరిహారం ఇవ్వాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న బాధితులకు రూ.50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలన్నారు.

  • 07 Dec 2020 02:33 PM (IST)

    ఏలూరు ఘటనపై అంతర్జాతీయ సంస్థలతో అధ్యయనం.. డబ్ల్యూహెచ్ఓ సహకారం కోరిన జగన్ సర్కార్..

    అంతుచిక్కని వ్యాధితో ఏలూరు పట్టణం విలవిలలాడుతోంది. విశాఖ గ్యాస్‌ లీకేజీ దృశ్యాలే ఏలూరులోనూ కనిపిస్తున్నాయి. ఉన్నపళంగా కళ్లు తిరిగిపోతుండడం, స్పృహ కోల్పోవడం, మూర్చపోవడం లాంటి దృశ్యాలతో ఏలూరులో ఎక్కడ చూసినా భీతావహ దృశ్యాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ పరిస్థితికి కారణాలంటేనది మాత్రం అంతుచిక్కడం లేదు. దీంతో అంతర్జాతీయ సంస్థలతో అధ్యయనం చేయించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు డబ్ల్యూహెచ్ఓ సహకారాన్ని ఏపీ సర్కార్ కోరింది. రేపో, మాపో డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధి బృందాలు ఏలూరుకు చేరుకునే అవకాశం ఉందని రాష్ట్ర అధికారులు చెబుతున్నారు. కాగా, ఇప్పటికే సీసీఎంబీ, ఐఐసీటీ, ఎన్ఐఎన్ సంస్థలు దీనికి కారణం ఏమై ఉంటుందా అని తేల్చే పనిలో నిమగ్నమై ఉన్నాయి.

  • 07 Dec 2020 02:12 PM (IST)

    వింతవ్యాధి ఒకరి నుంచి ఒకరికి వ్యాపించలేదు.. కలెక్టర్ నివేదికలో వెల్లడి

    ఏలూరు ఘటనపై తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌ నివేదిక సిద్ధం చేశారు. ఇప్పటివరకూ వింత వ్యాధి ఒకరి నుంచి ఒకరికి వ్యాపించలేదన్నారు. అయితే, ఏలూరు పరిసరాల్లో వ్యాధి తీవ్రత ఎక్కువగానే ఉందన్నారు. బాధితులకు మూర్ఛ ఒకసారి మాత్రమే వస్తోందన్నారు. మున్సిపల్‌ నీరు పంపిణీలేని ప్రాంతాల్లోని జనం కూడా అస్వస్థతకు గురయ్యారని కలెక్టర్ నివేదికలో పేర్కొన్నారు. నిత్యం మినరల్‌ వాటర్‌ తాగే వాళ్లు కూడా అస్వస్థతకు గురయ్యారన్నారు. నీటి శాంపిల్స్‌, రక్త నమూనాల రిపోర్టులు సాధారణంగానే ఉన్నాయన్నారు. ఇంకా కల్చర్‌ రిపోర్టు రావాల్సి ఉందని నివేదికలో కలెక్టర్‌ వెల్లడించారు. అలాగే, ఏలూరు వ్యాప్తంగా కుటుంబ సర్వే ద్వారా 191 మంది అస్వస్థతకు గురైనట్టు గుర్తించామని కలెక్టర్‌ తెలిపారు.

  • 07 Dec 2020 02:09 PM (IST)

    గుంటూరు జీజీహెచ్‌లో ఏలూరు బాధితులకు చికిత్స

    ఏలూరు బాధితుల్లో ఐదుగురిని గుంటూరు జిల్లాలోని జీజీహెచ్‌కు తరలించారు. బాధితులకు అందుతున్న వైద్యం తీరును సూపరింటెండెంట్ ప్రభావతి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభావతి మాట్లాడుతూ...ఐదుగురు బాధితులు వచ్చారని. వారికి ఫిట్స్ లక్షణాలున్నాయని..వైద్యం అందిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఐదుగురి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. ఇద్దరూ మాత్రం పూర్తి సృహాలోకి రాలేదని వివరించారు. ప్రత్యేక వైద్య నిపుణులను నియమించామని.. వ్యాధి నిర్థారణ కోసం అన్ని రకాల వైద్య పరీక్షలు చేస్తున్నామని తెలిపారు. రెండు వార్డులను ప్రత్యేకంగా ఏలూరు బాధితుల కోసం ఏర్పాటు చేశామని ఆమె వెల్లడించారు. వెంటిలేటర్స్ కూడా అందుబాటులో ఉంచామని ప్రభావతి వివరించారు.

  • 07 Dec 2020 02:03 PM (IST)

    బాధితులకు మెరుగైన వైద్యం అందించాలిః చంద్రబాబు

    ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే వ్యాధులు ప్రబలుతున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఏలూరు వింత వ్యాధి బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. అవగాహన లేకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. నిత్యం పారిశుద్ధ్యం నిర్వహిస్తే ఇలాంటి సమస్యలు తలెత్తవని చంద్రబాబు పేర్కొన్నారు. ఏలూరులో ఏం జరుగుతుందో ప్రభుత్వం తెలుసుకోవాలన్నారు. ఏలూరు ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్న బాబు.. ప్రజల్లో నమ్మకం కలిగించేలా వైద్య సేవలందించాలన్నారు

  • 07 Dec 2020 01:55 PM (IST)

    స్థానికులు అందోళన చెందాల్సిన అవసరం లేదుః హెల్త్ కమిషనర్

    ఏలూరులో ప్రజల అస్వస్థతకు గల కారణాలు తెలియడం లేదని, నమూనాల ఫలితాలు వెల్లడి కావాల్సి ఉందని ఏపీ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కమిషనర్ భాస్కర్‌ తెలిపారు. బాధితుల కోసం అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. కాగా, ఇప్పటి వరకు 160 మంది డిశ్ఛార్జ్‌ అయ్యారన్నారు. 14 మందిని మెరుగైన వైద్యం కోసం విజయవాడ, గుంటూరు ఆస్పత్రులకు పంపించామని ఆయన తెలిపారు. వైరల్‌ టెస్టులు నెగిటివ్‌ వచ్చినట్లు తెలిపారు. నీటిలో మెటల్‌ టెస్టులు కూడా చేశామని, ఫలితాలు రావాల్సి ఉందని అన్నారు. నీటిని పరిశోధించడానికి నమూనాలను సీసీఎంబీకి కూడా పంపినట్లు తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థతోపాటు ఐఐఎంఆర్‌, ఎయిమ్స్‌ తదితర బృందాలు కూడా వస్తున్నాయని, స్థానికులు అందోళన చెందాల్సిన అవసరం లేదని కమిషనర్‌ వివరించారు. ప్రజలు ఆరోగ్య పరంగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అటు, దెందులూరులోనూ ఇదే కారణాలతో కేసులు వచ్చాయని ఆయన పేర్కొన్నారు.

  • 07 Dec 2020 01:44 PM (IST)

    జీజీహెచ్‌లో 50 బెడ్లు కేటాయింపు

    ఏలూరు ఘటనలో పరిస్థితి విషమంగా ఉన్నవారిని విజయవాడకు తరలిస్తున్నారు. ఇందుకోసం జీజీహెచ్‌లో 50 బెడ్లను కేటాయించారు. ఇందుకు కోసం 12 మంది డాక్టర్లు, 4 అంబులెన్స్‌లు, 36 మంది నర్సింగ్‌ సిబ్బంది ద్వారా సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఏలూరులో పరిస్థితి విషమంగా ఉన్న ఏడుగురు బాధితులను ఇప్పటికే విజయవాడకు తరలించారు. కాగా, ప్రస్తుతం అందరి పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు.

  • 07 Dec 2020 01:39 PM (IST)

    బాధితులకు చికిత్స అందించేందుకు ప్రత్యేక వైద్య బృందాలు

    ఏలూరు బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో రాష్ట్ర సర్కార్ అప్రమత్తమైంది. అదనపు వైద్య నిపుణుల బృందాన్ని ఏలూరు ప్రభుత్వాస్పత్రికి రప్పిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే బాధితులకు చికిత్స అందిస్తున్న స్పెషలిస్టులతో సహా 56 మంది డాక్టర్లు, ముగ్గురు మైక్రో బయాలజిస్ట్‌లను ఏలూరు చేరుకుంటున్నారు. అలాగే, మరో 136 మంది నర్సులు, 117 మంది ఎఫ్‌ఎన్‌ఓలు,99 మంది ఎంఎన్‌ఓలు వైద్య సేవలు అందిస్తున్నట్లు వైద్యాధికారులు తెలిపారు.

    ప్రస్తుతం ఏలూరు పరిసరాల్లో 62 మెడికల్‌ క్యాంపులను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 20 అంబులెన్స్‌లు సేవలందిస్తున్నాయి. పట్టణంలోని మెడికల్ క్యాంపులు 24 గంటలపాటు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. ఏలూరులోని ప్రభుత్వ ఆస్పత్రి సహా నాలుగు ఆస్పత్రుల్లో 445 బెడ్లు అందుబాటులో ఉంచారు. అలాగే, రోగులకు మంచి పౌష్టికాహారం అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

  • 07 Dec 2020 01:29 PM (IST)

    ఏలూరు ఆస్పత్రిలో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ బృందం పరిశీలన

    ఏలూరు ఘటనపై ఏపీ రాష్ట్ర హైకోర్టు ఆరా తీసింది. ప్రస్తుత పరిస్థితిని అధ్యయనం చేసేందుకు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ బృందాన్ని నియమించింది. ఇందుకు భాగంగా జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ బాలకృష్ణయ్య ఆధ్వర్యంలోని ఓ టీం.. ఏలూరు ఆస్పత్రిలో పర్యటించింది. సీనియర్ సివిల్ జడ్జి బాలకృష్ణయ్య ఏలూరు ప్రభుత్వాస్పత్రిని సందర్శించారు. హైకోర్టు ఆదేశాలతో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ బృందం వింత వ్యాధి బాధితులను పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు. వ్యాధి ప్రబలడానికి సంబంధించిన అధ్యయన నివేదికలు ఇంకా కొన్ని రిపోర్టులు రావల్సి ఉందన్నారు. సీసీఎంబీ నుంచి కూడా టెస్ట్ ఫలితాలు రావల్సి ఉందన్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పిల్లల పరిస్థితి నిలకడగా ఉందని ఆయన వెల్లడించారు. అయితే, ఈ సాయంత్రంలోగా హైకోర్టుకు పూర్తి నివేదికను అందజేస్తామని బాలకృష్ణయ్య తెలిపారు.

  • 07 Dec 2020 01:13 PM (IST)

    వైద్యాధికారులతో సీఎం వైఎస్ జగన్ సమీక్ష

    ఏలూరు వైద్యాధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమావేశమయ్యారు. వ్యాధి లక్షణాలను వైద్యాధికారులు సీఎంకు వివరించారు. ఇప్పటికే ఐసీఎంఆర్ నిపుణులు బృందంతోసహా మరో నాలుగు కేంద్ర బృందాలు ఏలూరుకు రానున్నట్లు వారు వివరించారు. ఢిల్లీకి ఇప్పటికే శాంపిల్స్ పంపించామని.. ఇప్పటికీ 188 మంది డిశ్చార్జ్ అయ్యారు. కాగా, అందులో ముగ్గురు మళ్లీ ఆస్పత్రిలో తిరిగి చేరారన్నారు. ప్రాథమికంగా నీటిలో ఎలాంటి ఇబ్బందులు కనిపించలేదు. రక్తనమూనాలు కూడా సాధారణంగానే వస్తున్నాయని సీఎం జగన్‌కు జిల్లా వైద్యాధికారులు వివరించారు.

  • 07 Dec 2020 01:03 PM (IST)

    పురుగుల మందే కారణమా..?

    ఏలూరు ఘటనపై అన్నిశాఖల అధికారులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా మున్సిపల్ శాఖ అధికారులు నీటి శుద్ధి కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా తాగునీటి ట్యాంకులను శుద్ధి చేస్తున్నారు. అలాగే, ఎలూరు చేరుకున్న వైద్యాధికారులు.. బాధితుల వెన్నుముక నుంచి తీసిన శాంపిల్స్‌ను పుణే ల్యాబ్‌కు పంపిస్తున్నారు.

    మరోవైపు, వింతవ్యాధికి పురుగుల మందే కారణమై ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నిపుణులు. పంట పొలాల్లోవాడే ఆర్గానోక్లోరిన్ అనే పురుగుల మందు కారణమై ఉంటుందని నిపుణులు అనుమానిస్తున్నారు. గాలితో పాటు నీటిలో ఆర్గానోక్లోరిన్ కలిసి ఉండవచ్చని భావిస్తున్నారు. ల్యాబ్ నివేదికలు వస్తే తప్ప నిర్ధారించలేమని వైద్యాధికారులు చెబుతున్నారు.

    ఆర్గాన్ క్లోరైడ్ ప్రమాదానికి కారణమై ఉండొచ్చన్న అనుమానంతో పరీక్షలు నిర్వహిస్తే.. ఒక అవగాహనకు రావచ్చని అంటున్నారు. ఉస్మానియా హాస్పిటల్ జనరల్ ఫిజీషియన్ డా.రాజేంద్ర ప్రసాద్. బాధితుల హెల్త్ హిస్టరీని కూడా పరిగణలోకి తీసుకోవాలంటున్నారు రాజేంద్ర ప్రసాద్.‌

  • 07 Dec 2020 12:51 PM (IST)

    ఏలూరు రూరల్ ప్రాంతాలకు వింత వ్యాధి..!

    ఏలూరు పరిసర గ్రామాలకు విస్తరిస్తోంది వింత వ్యాధి. దీంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. అలాగే ఇవాళ విధి నిర్వహణలో ఉన్న పోలీసు కానిస్టేబుల్ మాయదారి రోగం బారినపడ్డారు. ఉన్నట్టుండీ ఒక్కసారిగా పడిపోయారు. దీంతో తోటి సిబ్బంది ఏలూరు ఆస్పత్రికి తరలించారు. అటు ఇరిగేషన్ కార్యాలయంలో పనిచేస్తున్న శ్రీనివాస్ అనే ఉద్యోగి స్పృహా కోల్పోయి పడిపోయారు. దీంతో అతన్ని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

  • 07 Dec 2020 12:49 PM (IST)

    రోజు రోజుకు పెరుగుతున్న కొత్త కేసులు

    ఏలూరులో ఉన్నట్టుండి మూడు రోజుల్లో 400 మందికి పైగా హాస్పిటల్ చేరిపోయారు. ఏం జరిగిందో తెలుసుకునేందుకు మంగళగిరి నుంచి ఏలూరు చేరుకుంది ఎయిమ్స్ బృందం. అయితే, ఇప్పటి వరకు 412 మంది వింత వ్యాధి బారినపడ్డారు. ఈనెల 5వ తేదీని 83 మంది, 6వ తేదీన 242 మంది, ఇవాళ కొత్తగా 88 మంది ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స కోసం వచ్చారు. ఇందులో 188 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యి  ఇళ్లకు చేరుకున్నారు. ప్రస్తుతం 199 మంది బాధితులు చికిత్సపొందుతున్నట్లు ఆస్పత్రి సూపరిండెంట్ తెలిపారు. కాగా, 16 మంది పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరు, విజయవాడ ఆస్పత్రికి తరలించామన్నారు.

  • 07 Dec 2020 12:27 PM (IST)

    412కు చేరిన ఏలూరు బాధితుల సంఖ్య

    ఏలూరులో ఏం జరుగుతోంది? ఎప్పుడు ఎవరి వంతు వస్తుందో? ఎప్పుడు ఎవరు పడిపోతారో తెలియదు. ఏలూరులో వింత వ్యాధితో బాధ పడుతున్న వారు ఒక్కొక్కరుగా మొదలై ఇప్పుడు.. బాధితుల సంఖ్య 412 కు చేరింది. ఇప్పటికే ఒకరు మృతి చెందారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా 14 మందిని విజయావాడ, గుంటూరు హాస్పిటల్‌కు తరలించారు.

    మొన్న సాయంత్రం మొదలైన బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. హాస్పిటల్‌లో చేరే వారి సంఖ్య గంట గంటకు పెరుగుతోంది. ఏలూరు పరిసరాల్లో అంబులెన్స్ సైరన్లు మోగుతున్నాయి. రయ్.. రయ్‌ మంటూ వాహనాలు.. తిరుగుతుండటంతో ఏం జరుగుతుందన్న టెన్షన్ స్థానికులను వెంటాడుతోంది. తమ ప్రాంతంలో అసలేం జరుగుతుందన్న ఆందోళన కొనసాగుతోంది. అసలు కారణాలేంటి? ఇదేం రోగం.. అని కూడా తెలియకపోవడంతో.. స్థానికులు భయపడిపోతున్నారు.

  • 07 Dec 2020 12:20 PM (IST)

    శాంపిల్స్ సేకరిస్తున్న వైద్య బృందం

    ఏలూరు ఘటనపై ఎయిమ్స్ అధికారులు అధ్యయనం చేస్తున్నారు. ఈ వింత వ్యాధికి కారణాలేంటి? కారణాలు ఏమై ఉండొచ్చు? గాలి కాలుష్యమా? లేదంటే నీటిలో ప్రమాదకరమైన రసాయనాలేవైన కలిశాయని విచారణ జరుపుతున్నారు. పలు ప్రాంతాల్లో పర్యటించి శాంపిల్స్ సేకరిస్తున్నారు వైద్య బృందం అధికారులు. ఇప్పటికే కొన్ని శాంపిల్స్‌ను పుణేలోని లాబరేటరీకి పంపించారు.

  • 07 Dec 2020 12:15 PM (IST)

    గుడికి వెళ్లేలోపే కళ్లు తిరిగి పడిపోయిన ఆరేళ్ల పాప

    మాది గుబ్బలవారి వీధి అదే పరిస్థితి. ఆరేళ్ల పాప వింత వ్యాధి బారిన పడ్డారు. తన భర్త, ఆరేళ్ల పాపతో కలసి ఉదయం బైకుపై చిన్నవెంకన్న దర్శనానికి ద్వారకాతిరుమల బయర్దేరారు. ఉదయం 11 గంటలకు అక్కడికి చేరుకున్నారు. బైకు దిగగానే ఆరేళ్ల పాప కిందపడిపోయింది. గుడిలోకి వెళ్లకుండానే వెనుదిరిగి, అమ్మాయిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. చికిత్స చేశాక ఆరోగ్యం మెరుగైంది. ప్రస్తుతం పాప ఆరోగ్యం నిలకడగా ఉందని తల్లి కరుణ తెలిపారు. అసలు ఏంజరుగుతుందో అర్థం కాలేదని ఆమె అన్నారు.

  • 07 Dec 2020 12:05 PM (IST)

    బైక్‌పై నుంచి కిందపడ్డ ఖాదర్..

    అంతుచిక్కని వ్యాధితో అప్పటి వరకు బాగా ఉన్నా ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు. ఇదే క్రమంలో ఆర్‌ఆర్‌పేటకు చెందిన ఖాదర్ అనే ఓ యువకుడు వాలంటీర్‌గా పనిచేస్తున్నాడు. బైక్ వెళ్తుండగానే స్పృహ కోల్పోయాడు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలప్పుడు ద్విచక్ర వాహనంపై వస్తున్నా, అంతలోనే కళ్లు తిరిగాయి. ఇంటి సమీపానికి చేరేసరికి ఒక్కసారిగా బండిపై నుంచి కింద పడ్డా. తర్వాత ఏమైందో తెలియదు. తెలివి వచ్చేసరికి ఆసుపత్రిలో ఉన్నా అని ఖాదర్ తెలిపారు. బైకుపై నుంచి పడటంతో చిన్న, చిన్న దెబ్బలు తగిలాయన్నారు. ప్రస్తుతం, నీరసం, నడుం నొప్పి ఉన్నాయన్నారు. వైద్యుల సూచనల మేరకు చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు.

  • 07 Dec 2020 11:25 AM (IST)

    అంతుచిక్కని వ్యాధిపై ఎయిమ్స్ బృందం అధ్యయనం

    బాధితులకు ఏలూరు ప్రభుత్వాస్పత్రి వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. సామూహిక అస్వస్థతకు గల కారణాలు తెలియడం లేదు. బాధితుల్లో ఎక్కువమంది 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్యవారు కాగా.. 12 ఏళ్లలోపు పిల్లలు 45 మందికి పైగా ఉన్నారు. అప్పటి వరకు బాగానే ఉందని, ఏం జరిగిందో తెలిసేలోపే కిందపడిపోయామని బాధితులు చెబుతున్నారు. వ్యాధి నిర్థారణకు 8 మంది సభ్యుల బృందం ఏలూరులో పర్యటిస్తోంది. రోగుల నుంచి రక్త నమూనాలు సేకరించింది. అయితే బాధితుల్లో ఎక్కువ మంది ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవారేనని, వారికి ఎలాంటి ఇన్ఫెక్షన్‌ లేదని ఎయిమ్స్‌ వైద్యులు తెలిపారు. రక్త నమూనాలు సేకరించి ఢిల్లీ ఎయిమ్స్‌కు పంపించామని, రిపోర్టుల ఆధారంగా వ్యాధిని నిర్థారిస్తామని ఎయిమ్స్‌ వైద్యులు తెలిపారు. మరింత లోతుగా పరీక్షలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీకి కూడా ఏపీ అధికారులు కొన్ని నమూనాలను పంపించారు.

  • 07 Dec 2020 11:15 AM (IST)

    బాధితులతో ముచ్చటించిన సీఎం జగన్

    ఏలూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులతో మాట్లాడారు సీఎం జగన్‌. అసలేం జరిగిందో తెలుసుకున్నారు. ఇప్పుడెలా ఉంది అడిగారు. ఒక వ్యక్తి చేయి పట్టుకుని పరిశీలించారు. ధైర్యంగా ఉండాలని చెప్పారు. ఆ తర్వాత పిల్లాడి దగ్గరకు వెళ్లి అతడి ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. పిల్లాడి తల్లిదండ్రులతో మాట్లాడారు.

  • 07 Dec 2020 11:13 AM (IST)

    ఏలూరు ప్రభుత్వాసుపత్రికి చేరుకున్న సీఎం

    ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చేరుకున్నారు. హెలీప్యాడ్‌ నుంచి నేరుగా ఏలూరు ప్రభుత్వాసుపత్రికి చేరుకున్న సీఎం అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. సీఎం జగన్‌ వెంట మంత్రి పేర్ని నాని, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఉన్నారు. రోగుల బాగోగులను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకుంటున్నారు. బాధితుల పరామర్శ అనంతరం జడ్పీ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.

  • 07 Dec 2020 11:11 AM (IST)

    ప్రభుత్వ ఆస్పత్రిలో చేరుతున్న రోగుల సంఖ్య పెరగుతుంది

    పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య పెరుగుతోంది. మాయదారి రోగంతో ఆస్పత్రుల్లో చేరుతున్న బాధితులు సంఖ్య రెట్టింపు అవుతోంది. మూర్ఛ, తలతిరగడం, నోట్లో నురగ వంటి లక్షణాలతో ఇవాళ ఉదయం మరో ఐదుగురు ఆస్పత్రిలో చేరారు. ఇప్పటి వరకు 345 మంది బాధితులు ఆస్పత్రికి వచ్చారు. 180 మంది కోలుకొని డిశ్ఛార్జి అయ్యారు. నిన్న రాత్రి నుంచి మరో 28 మంది రోగులు ఆస్పత్రిలో చేరారు.

Follow us
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!