Live updates: అన్నం పెట్టే రైతన్నకు అండగా ఉందాం.. గళమెత్తిన యావత్ భారతం

Sanjay Kasula

| Edited By: Rajesh Sharma

Updated on: Dec 08, 2020 | 6:55 PM

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దుచేయాలని కోరుతూ రైతు సంఘాలు ఇవాళ భారత్‌ బంద్‌ నిర్వహిస్తున్నాయి. ఇందుకు దేశవ్యాప్తంగా 25 రాజకీయ పార్టీలతోపాటు వివిధ ఉద్యోగ, కార్మిక సంఘాలు..

Live updates: అన్నం పెట్టే రైతన్నకు అండగా ఉందాం.. గళమెత్తిన యావత్ భారతం

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దుచేయాలని కోరుతూ రైతు సంఘాలు ఇవాళ భారత్‌ బంద్‌ నిర్వహిస్తున్నాయి. ఇందుకు దేశవ్యాప్తంగా 25 రాజకీయ పార్టీలతోపాటు వివిధ ఉద్యోగ, కార్మిక సంఘాలు మద్దతుగా నిలిచాయి.

డిమాండ్ల పరిష్కారం కోసం ఇప్పటివరకూ కేంద్రంతో అయిదు దఫాలుగా ఆందోళన చేస్తున్న రైతు నేతలతో చర్చలు జరిపింది. వారు నిర్వహించిన చర్చలు ఫలించలేదు. ఒకవైపు చర్చలు సాగుతుంటే మరోవైపు బంద్‌ ఎందుకు? అన్న ప్రభుత్వ ప్రశ్నను పక్కనపెట్టాయి. 6వ విడత చర్చలకు ఒకరోజు ముందు ఈ భారీ ఆందోళన కార్యక్రమాన్ని తలపెట్టాయి.

పార్టీల జండాలు లేకుండానే బంద్‌లో పాల్గొనాలని రైతు నేతుల కోరారు. వారి కోరిక మేరకు అంతా ఆకుపచ్చ జెండాలతోనే బంద్‌లో పాల్గొంటున్నారు. ఎలాంటి గొడవలు లేకుండా శాంతియుతంగా దీన్ని నిర్వహించాలని కోరారు. కార్మిక, ఉద్యోగ, వ్యాపార సంఘాలు బంద్‌కు మద్దతిచ్చినందున ఎవరిపై బలవంతం చేయకుండా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొనేలా ప్రోత్సహించాలని కోరారు.

విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా తాము ఉంటున్న చోట్లే నిరసనలు వ్యక్తం చేస్తూ బంద్‌కు మద్దతిస్తున్నందున ఈ ఆందోళన అంతర్జాతీయ రూపు సంతరించుకొందని ప్రకటించారు.  రోజంతా మార్కెట్లు, దుకాణాలు బంద్‌ చేయాలని పిలుపునిచ్చారు. కూరగాయలు, పాల సరఫరా దుకాణదారులు కూడా పాల్గొనాలని కోరారు. అత్యవసర సేవలు, అంబులెన్సులు, వివాహ కార్యక్రమాలకు మాత్రమే అనుమతిస్తారు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 08 Dec 2020 05:05 PM (IST)

    కూకట్ పల్లి, మియాపూర్ చౌరస్తా, శేరిలింగంపల్లిలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ నిరసన, ఉద్రికత్తతకు దారితీసిన ట్రాఫిక్ జాం

    భారత్‌ బంద్‌లో భాగంగా గులాబీ శ్రేణులన్ని రోడ్డెక్కాయి. ఎక్కడికక్కడ నిరసన తెలిపాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ హైదరాబాద్ కూకట్ పల్లి లోని ఉష ముళ్లపూడి కామన్, శేరిలింగంపల్లి, మియాపూర్ చౌరస్తా దగ్గర రాస్తారోకో నిర్వహించారు. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టంపై నిరసన గళమెత్తారు. అయితే, కూకట్ పల్లి దగ్గర రోడ్డుపై నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో కొంత ఉద్రికత్త నెలకొంది. నిరసన కార్యక్రమంలో భాగంగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దగ్గర, భాగ్య నగర్ బస్ స్టాప్ వద్దా దాదాపు మూడు కిలోమీటర్లు వరకు ట్రాఫిక్ జామ్ అయ్యింది. ట్రాఫిక్ జామ్ లో చిక్కుకున్న అంబులెన్సులు కూడా వెళ్లే పరిస్థితి లేకపోయింది. దీంతో కొంతమంది జనం తిరగబడ్డారు.

  • 08 Dec 2020 03:36 PM (IST)

    షాద్ నగర్ దగ్గర నేషనల్ హైవే 44 మీద కేటీఆర్ నిరసన, ఇది ఆరంభం మాత్రమేనని వ్యాఖ్య

    భారత్ బంద్ లో భాగంగా తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్ శివారు షాద్ నగర్ దగ్గర నేషనల్ హైవే 44 మీద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్రంపై పోరులో ఇది కేవలం ఆరంభం మాత్రమేనని కేటీఆర్ ఈ సందర్భంగా చెప్పారు. కనీస మద్దతుధర(ఎమ్మెస్పీ) పొందటం ఈ దేశంలో ప్రతిరైతు హక్కు అని చెప్పిన ఆయన, మోదీ సర్కారు తీసుకొచ్చిన కొత్త రైతుచట్టాన్ని వెనక్కితీసుకోవాల్సిన అవసరం కచ్చితంగా ఉందన్నారు. కాగా, టీఆర్ఎస్ శ్రేణులు రహదారిపై రాస్తారోకో నిర్వహించడంతో హైవేపై కిలోమీటర్లమేర ట్రాఫిక్ నిలిచిపోయింది.

  • 08 Dec 2020 02:32 PM (IST)

    ఎమ్మెల్యే దానం ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ

    రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ చేపట్టిన భారత్ బంద్ ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలో సంపూర్ణంగా జరుగుతుంది. రైతులకు మద్దతుగా ఎమ్మెల్యే దానం నాగేందర్ కార్పోరేటర్ లతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. అన్నదాత ఆదుకుందాం, నూతన వ్యవసాయ చట్టాన్ని వ్యతిరేకిద్దాం అన్న నినాదాలతో బైక్ ర్యాలీ కొనసాగింది. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2 లో నుంచి ప్రారంభమైన ర్యాలీ పంజాగుట్ట అమీర్‌పేట్, ఖైరతాబాద్, హిమాయత్ నగర్ మీదుగా హైదరాబాద్‌ మహానగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్రం తీసుకువచ్చిన చట్టం వద్దంటూ గత 15 రోజులుగా రైతులు దేశ రాజధాని శివార్లలో నిరసన వ్యక్తం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం పట్టించుకోక పోవడం దారుణమన్నారు.

  • 08 Dec 2020 02:24 PM (IST)

    రైతులకు మద్దతుగా ఎమ్మెల్యే సీతక్క ధర్నా

    ములుగు జిల్లా కేంద్రంలో రైతులకు మద్దతుగా తలపెట్టిన భారత్ బంద్ కార్యక్రమంలో జాతీయ మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైతు వ్యతిరేక బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

  • 08 Dec 2020 02:18 PM (IST)

    జాతీయ రహదారిపై ఎంపీ కోమటిరెడ్డి నిరసన

    కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రైతులు భారత్ బంద్‌కు పిలుపునకు దేశవ్యాప్తంగా భారీ స్పందన లభిస్తోంది. అన్ని రాజకీయపార్టీలు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాయి. ఇందులోభాగంగా నల్గొండ జిల్లా కేతెపల్లిలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. హైద్రాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి రాస్తారోకోలో పాల్గొన్నారు. నూతన వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా నిరసనకు దిగారు.

  • 08 Dec 2020 02:11 PM (IST)

    కాంగ్రెస్ ధర్నాలో పాల్గొన్న జేడీ లక్ష్మీనారాయణ

    భారత్ బ౦ద్ లో భాగంగా కా౦గ్రెస్ చేపట్టిన ఆ౦దోళనకు సీబీఐ మాజీ జాయింట్ డైరక్టర్ లక్ష్మీనారాయణ స౦ఘీభావ౦ తెలిపారు. విశాఖ జిల్లా మద్దిలపాలె౦ జ౦క్షన్ వద్ద కా౦గ్రెస్ శ్రేణులు చేపట్టిన ధర్నాలో లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. కా౦గ్రెస్ ధర్నా చేస్తున్న చోట కారులో ప్రయాణిస్తుా తారసపడట౦తో ఆ౦దోళనకు స౦ఘీభావ౦ తెలపాలని కా౦గ్రెస్ నేతలు కోరారు. దీంతో కారు దిగిన ఆయన ధర్నాలో పాల్గొన్నారు.

  • 08 Dec 2020 02:03 PM (IST)

    రైతులకు పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి సంఘీభావం

    వ్యవసాయ రంగంలో కేంద్రం తీసుకొచ్చిన చట్టాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా రైతులు చేపట్టిన బంద్ కు పీపుల్స్ స్టార్ ఆర్ . నారాయణమూర్తి సంఘీభావం ప్రకటించారు. రైతుల ఆందోళన న్యాయ సమ్మతమైనదేనని, కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాసే చట్టాలను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రైతును రాజులాగ బతకనివ్వాలని, కార్పొరేట్ సంస్థల వద్ద బానిసగా మార్చకూడదని నారాయణమూర్తి విజ్ఞప్తి చేశారు. రైతు సంక్షేమాన్ని కాంక్షిస్తూ, ఎంఎస్ స్వామినాథన్ సిఫారసులను అమలు చేయాలని నారాయణమూర్తి కోరారు.

  • 08 Dec 2020 01:56 PM (IST)

    సొంత భూముల్లోనే రైతులు కూలీ చేసుకోవల్సి వస్తుందిః హరీష్‌రావు

    రైతుల పిలుపుతో భారత్ బంద్‌ సంపూర్ణంగా కొనసాగుతుంది. రైతులకు మద్దతుగా దేశంలోని మొత్తం మంది రోడ్ల పైకి వచ్చారు. మెదక్ జిల్లా తూప్రాన్ లో జరిగి కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. 53 ఏళ్ల క్రితమే రైతులకు మద్దతు ధర వచ్చిందని మంత్రి గుర్తు చేశారు. ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వం రైతులకు మద్దతు ధర లేకుండా చేస్తుందని ఆరోపించారు. రైతులు పంటలు ఎక్కడైనా అమ్ముకోవడం.. ఆచరణలో అమలు అయ్యే పరిస్థితి ఉండదన్నారు. కొత్త చట్టం అమలులోకి వస్తే వ్యవసాయం కార్పొరేట్ సంస్థలు చేతికి వెళ్తుందని మంత్రి హరీష్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేట్ చట్టంతో సొంత భూముల్లోనే రైతులు కూలీ చేసుకొనే పరిస్థితి వస్తుందన్నారు. రైతులకు నష్టం చేసే చట్టాలను వెంటనే ఉపసంహరణ చేసుకోవాలని మంత్రి డిమాండ్ చేశారు.

  • 08 Dec 2020 01:46 PM (IST)

    ట్వీట్టర్ వేదికగా స్పందించిన రాహుల్

    రైతులకు మద్దతుగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్వీట్టర్ వేదికగా స్పందించారు. ప్రధాని మోదీజీ రైతుల నుంచి దోచుకోవడం అపాలంటూ పేర్కొన్నారు. ఈ రోజు భారత్ బంద్ అని దేశవాసులందరికీ తెలుసు. అన్నదాతల పోరాటానికి పూర్తిగా సమర్ధించడం ద్వారా విజయవంతం చేయండి అంటూ ట్వీట్టర్ పేర్కొన్నారు. రైతుల ఆందోళనలతోనైనా ప్రభుత్వం స్పందించాలన్నారు రాహుల్ గాంధీ.

  • 08 Dec 2020 01:36 PM (IST)

    విశాఖలో వామపక్షాల మానవహారం

    భారత్ బంద్‌కి మద్దతుగా విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద వామపక్షాలు ఆధ్వర్యంలో భారీ మానవహారం నిర్వహించారు. వామపక్ష నేతలు, కార్మిక సంఘాలు నేతలు, కార్యకర్తలు మానవహారంలో పాల్గొన్నారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. వెంటనే పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు వాహనాలను దారి మళ్లించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని.. లేని పక్షంలో తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని వామపక్ష నేతలు హెచ్చరించారు.

  • 08 Dec 2020 01:25 PM (IST)

    లండన్‌లోనూ రైతులకు మద్దతు

    కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనకు దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. ఈ క్రమంలో యూకేలోని వివిధ ప్రాంతాల నుంచి సెంట్రల్ లండన్‌లోని భారత హైకమిషన్ భవనం వద్దకు చేరుకొని నిరసనకారులు ఆందోళనలు చేపట్టారు.

  • 08 Dec 2020 01:19 PM (IST)

    జాతీయ రహదారిపై మంత్రి జగదీష్‌రెడ్డి రాస్తారోకో

    రైతులు ప్రకటించిన భారత్ బంద్‌కు విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి మద్దతుగా నిలిచారు. హైదరాబాద్ -విజయవాడ రహదారిపై ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ తో కలిసి మంత్రి రాస్తారోకో చేపట్టారు. రైతులను దోచి కార్పొరేట్‌ సంస్థలకు లాభం చేకూర్చే రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

  • 08 Dec 2020 12:55 PM (IST)

    ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో భారత్ బంద్ సంపూర్ణంగా కొనసాగుతుంది. వర్తక వ్యాపారులు దుకాణాలు మూసి వేసి స్వచ్చందంగా బంద్‌లో పాల్గొంటున్నారు. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు.

  • 08 Dec 2020 12:50 PM (IST)

    కొత్త చట్టాలు ఉపసంహరించుకోవాలని టీడీపీ వినతి పత్రం

    కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు చేపట్టిన భారత్ బంద్ కి సంఘీభావం తెలిపారు టీడీపీ నాయకులు. పంట మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించి, మార్కెట్ యార్డలను కొనసాగించాలని కోరుతూ టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. టీడీపీ ఆధ్వర్యంో దేవినేని ఉమా, గద్దె రామ్మోహన్ తదితరులు కృష్ణాజిల్లా కలెక్టర్ కి మెమోరాండం ఇచ్చారు. ప్రభుత్వం రాష్ట్రంలో వ్యవసాయ మార్కెట్లను నిర్వీర్యం చేసి రైతులను కష్టాలోకి నెట్టిందని వారు ఆరోపించారు.

  • 08 Dec 2020 12:41 PM (IST)

    ఖమ్మం జిల్లాలో సంపూర్ణ మద్దతు

    కొత్త వ్యవసాయ చట్టాలకు నిరసనగా రైతులు పిలుపునివ్వడంతో భారత్ బంద్.. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సంపూర్ణంగా కొనసాగుతోంది.. టీఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం పార్టీ నేతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.. ఖమ్మంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ధర్నా కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, టీఆర్ఎస్ పార్లమెంటరీ నేత ఎంపీ నామా నాగేశ్వరరావు, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు..

  • 08 Dec 2020 12:26 PM (IST)

    కొత్త చట్టాల్ని వెనక్కి తీసుకోకపోతే ఉద్యమం తీవ్రతరంః కవిత

    కేంద్ర వ్యవసాయ చట్టం బిజెపి ప్రభుత్వం చేసుకున్న స్వయంకృతాపరాధమని ఎమ్మల్సీ కవిత అన్నారు. కొత్త బిల్లులతో రైతులు కనీస మద్దుత ధరల లేకుండా దోపిడీకి గురవుతారన్నారు. కామారెడ్డి జిల్లాలో నిర్వహించిన భారత్ బంద్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. చరిత్రలో మొదటిసారిగా 25 పార్టీలు మద్దతిస్తున్న నిరసన కార్యక్రమం ఇదని, గుజరాత్ లోనే రైతుసంఘం ఈ నిరసనకు మద్దతు పలుకుతుందని కవిత అన్నారు. ఇప్పటికైనా బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం కళ్ళు తెరవాలని, కొత్త వ్యవసాయ చట్టాల్ని వెనక్కి తీసుకోకపోతే ఉద్యమం తీవ్రతరం అవుతుందని కవిత స్పష్టం చేశారు..

  • 08 Dec 2020 12:11 PM (IST)

    రైతుల‌కు మ‌ద్ద‌తుగా మంత్రి కేటీఆర్ ఆందోళన

    అన్నదాతకు అండగా మంత్రి కేటీఆర్ రోడ్డెక్కారు. జాతీయ రహదారిపై బైటాయించారు. రైతులకు మద్దతుగా, కేంద్రం తెచ్చిన మూడు చట్టాలకు నిరసనగా ధర్నా చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లా షాద్‌నగర్‌ దగ్గర బెంగళూరు – హైదరాబాద్‌ హైవేపై బైటాయించారు కేటీఆర్‌. ఆయనతోపాటు వందలాది మంది టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఆందోళనలో పాల్గొన్నారు. టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు, మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ఎమ్మెల్యేలు కూడా ధర్నాలో పాల్గొన్నారు.\

  • 08 Dec 2020 11:48 AM (IST)

    బైక్ ర్యాలీలో పాల్గొన్న మంత్రి సత్యవతి రాథోడ్

    కేంద్ర కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ రైతులు భార‌త్‌బంద్ నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ బంద్‌కు సంపూర్ణంగా నిర్వ‌హించాల‌ని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ నేప‌థ్యంలో మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్‌, ఎమ్మెల్యే శంక‌ర్‌నాయ‌క్‌లు సంయుక్తంగా ఇవాళ మ‌హ‌బూబాబాద్ జిల్లా న‌ర్సంపేట రోడ్డు చౌర‌స్తాలో బైక్ ర్యాలీ నిర్వ‌హించారు. ఎమ్మెల్యే శంక‌ర్ నాయ‌క్ బైక్‌ను రైడ్ చేస్తుండ‌గా.. మంత్రి స‌త్య‌వ‌తి ఆ బైక్‌పై వెళ్లారు.

  • 08 Dec 2020 11:44 AM (IST)

    రైతుల‌కు మ‌ద్ద‌తుగా అన్నా హ‌జారే నిరాహార దీక్ష

    రైతుల‌కు మ‌ద్ద‌తుగా సామాజిక కార్య‌క‌ర్త అన్నా హ‌జారే నిరాహార దీక్ష చేప‌ట్టారు. మ‌హారాష్ట్ర‌లోని అహ‌మ్మ‌ద్ న‌గ‌ర్ జిల్లాలోని రాలేగావ్ సిద్ధి గ్రామంలో అన్నా హ‌జారే ఒక రోజు నిరాహార దీక్ష చేప‌డుతున్నారు. రైతు ఆందోళ‌న‌ల‌ను దేశ‌వ్యాప్తంగా ఉదృతంగా చేయాల‌ని, ప్ర‌భుత్వంపై వ‌త్తిడి తీసుకురావాల‌ని అన్నా హ‌జారే తెలిపారు. ఢిల్లీ స‌రిహ‌ద్దుల్లో రైతులు నిర్వ‌హిస్తున్న నిర‌స‌న‌ను హ‌జారా ప్ర‌శంసించారు. ప‌ది రోజుల నుంచి జ‌రుగుతున్న‌ నిర‌స‌న‌ల్లో ఎటువంటి హింస చోటుచేసుకోలేద‌న్నారు. స్వామినాథ‌న్ క‌మిష‌న్ ప్ర‌తిపాదన‌ల‌ను అమ‌లు చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

  • 08 Dec 2020 11:40 AM (IST)

    కొత్త వ్యవసాయ చ‌ట్టాలతో రైతుల‌కు భారీ న‌ష్టంః కేటీఆర్

    కేంద్రం తీసుకువచ్చిన వ్య‌వ‌సాయ చ‌ట్టాలు రైతుల‌కు వ్య‌తిరేక‌మ‌ని, ఆ చ‌ట్టాల వ‌ల్ల రైతుల‌కు భారీ న‌ష్టం క‌లుగుతుంద‌ని టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు రైతు వ్యతిరేకమైనవి. వీటి ద్వారా రైతన్నలకు లాభం జరగకపోగా భారీ నష్టం వాటిల్లుతుంది. అందుకే సీఎం కేసీఆర్ పిలుపు మేరకు టీఆర్ఎస్ పార్టీ ఈ చట్టాలను వ్యతిరేకిస్తోంది. నూతన చట్టంలో ‘మద్దతు ధర’ అన్న అంశాన్ని చేర్చకపోవడం అభ్యంతరకరమన్నారు. కేంద్రం మద్దతు ధరలు ప్రకటించకపోతే ప్రైవేటు వ్యక్తులు సిండికేట్‌గా మారి రైతులకు తక్కువ ధర చెల్లించి మోసం చేసే అవకాశం ఉందని మంత్రి కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు.

    దేశంలో 85 శాతం మంది చిన్న, సన్నకారు రైతులే ఉన్నారు. కేంద్రం చెప్తున్నట్టు వీరు వేరే రాష్ట్రాలకు వెళ్లి అమ్మే పరిస్థితి లేదు. ఒక రాష్ట్రంలో పంట ఉత్పత్తులకు ఎక్కువ ధర ఉంటే మిగతా రాష్ట్రాల వాళ్లు పోటెత్తితే స్థానిక రైతులకు నష్టం కలుగుతుంది. కార్పొరేట్ సంస్థలు కాంట్రాక్టు వ్యవసాయం చేసుకోవడానికి నూతన చట్టం వెసులుబాటు కల్పిస్తోందని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఈ మేరకు ట్వీట్టర్ వేదికగా ఘాటుగా స్పందించారు.

  • 08 Dec 2020 11:31 AM (IST)

    ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్‌ హౌస్ అరెస్ట్..?

    ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్‌ను గృహ‌నిర్బంధం చేసిన‌ట్లు ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. సింఘూ బోర్డ‌ర్ వ‌ద్ద ఆందోళ‌న చేప‌డుతున్న రైతుల్ని సోమ‌వారం రోజున సీఎం కేజ్రీవాల్ ప‌రామ‌ర్శించారు. ఈ నేప‌థ్యంలో బీజేపీ పార్టీ.. సీఎం కేజ్రీని హౌజ్ అరెస్టు చేసిన‌ట్లు ఆప్ త‌న ట్విట్ట‌ర్‌లో ఆరోపించింది. సీఎం ఇంట్లోకి వెళ్లేందుకు కానీ, బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు కానీ ఎవ‌రికీ అనుమ‌తి ఇవ్వ‌డం లేద‌ని ఆమ్ ఆద్మీ పేర్కొంది.

  • 08 Dec 2020 11:09 AM (IST)

    మెట్రో రైల్‌ను అడ్డుకున్న నిరసనకారులు

    రైతులకు మద్దతుగా ఆందోళన ఉధృతంగా కొనసాగుతుంది. ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్ తో ఆందోళన కొనసాగుతోంది. ఇటు హైదరాబాద్ మెట్రో రైలుపై కూడా బంద్ ప్రభావం పడింది. కూకట్ పల్లి మెట్రో స్టేషన్ వద్ద కొందరు ఆందోళనకారులు మెట్రో రైల్ రోకో చేపట్టారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని నిరసనకారులను అదుపులోకి తీసుకోవడంతో మెట్రో రైల్ యధావిథిగా కొనసాగింది.

  • 08 Dec 2020 10:59 AM (IST)

    అంబర్‌పేట్‌లో ఎమ్మెల్యే బైక్ ర్యాలీ

    కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు చేపట్టిన భారత్ బంద్ కు మద్దతుగా అంబర్ పెట్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. రైతు వ్యతిరేక చట్టాన్ని కేంద్రం వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

  • 08 Dec 2020 10:53 AM (IST)

    అన్నదాతకు అన్యాయం జరిగితే ఊరుకునేదీ లేదుః శ్రీనివాస్ గౌడ్

    కేంద్ర ప్రభుత్వ నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు చేపట్టిన భారత్ బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇందు భాగంగా రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం బూర్గుల గ్రామం వద్ద మంత్రి శ్రీనివాస్ గౌడ్ రైతులతో కలిసి ధర్నాలో పాల్గొన్నారు. అన్నదాతలకు అన్యాయం జరిగితే ఊరుకునేదీలేదని టీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీనివాస్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే లక్మారెడ్డి పాల్గొన్నారు.

  • 08 Dec 2020 10:45 AM (IST)

    ఎద్దుల బండితో మంత్రి మల్లారెడ్డి నిరసన

    కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. మేడ్చల్ జిల్లాలో నిర్వహించిన నిరసన ప్రదర్శనలో రాష్ట్ర కార్మిక మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. జాతీయ రహదారి పై ఎద్దుల బండి పైకి ఎక్కి నిరసన తెలిపారు. అనంతరం మేడ్చల్‌లో భారీ ర్యాలీగా చేపట్టారు.

  • 08 Dec 2020 10:38 AM (IST)

    హన్మకొండలో ఎడ్ల బండ్లతో ర్యాలీ

    కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ భారత్‌ బంద్‌ను విజయవంతం చేయాలని కోరుతూ హన్మకొండలో ఎడ్ల బండ్లతో రైతులు, టీఆర్‌ఎస్‌ శ్రేణులు వినూత్న ర్యాలీ నిర్వహించారు. ఈ మేరకు కాజీపేట రైల్వేస్టేషన్‌ నుంచి హన్మకొండ బాలసముద్రంలోని ఏకశిల పార్కు వరకు చేపట్టిన ఈ ర్యాలీని చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ పాల్గొన్నారు.

  • 08 Dec 2020 10:34 AM (IST)

    మహారాష్ట్రలో రైతు సంఘాల రైల్‌ రోకో

    రైతు సంఘాలు పిలుపునిచ్చిన భారత్‌ బంద్‌కు దేశమంతటా మద్దతు లభిస్తోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్ తో ఆందోళన కొనసాగుతోంది. కొన్ని రైతు సంఘాల ఆధ్వర్యంలో దేశంలోని పలుచోట్ల రైల్ రోకో చేపట్టారు. మహారాష్ట్రలోని బుల్ధానా జిల్లాలో నిరసన వ్యక్తం చేశారు. స్వాభిమాని శేత్కారీ సంఘటన సభ్యులు చెన్నై-అహ్మదాబాద్ నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌ను ఆపేశారు. ఇంకా పలుచోట్ల రైలు రోకోలు కొనసాగుతున్నాయి.

  • 08 Dec 2020 10:31 AM (IST)

    తిరుపతిలో వినూత్న నిరసన

    తిరుపతిలో భారత్ బంద్ కొనసాగుతోంది. కేంద్ర వ్యవసాయ చట్టం రద్దు లక్ష్యంగా వామపక్ష పార్టీలతో పాటు ప్రజా సంఘాలు, ఉద్యోగ కార్మిక సంఘాలు ఒక్కటే రోడ్డు ఎక్కాయి. చిత్తూరు జిల్లాలో ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అయితే, తిరుమలకు మాత్రం భారత్ బంద్ నుంచి మినహాయింపు లభించింది. దీంతో తిరుపతి తిరుమల మధ్య రాకపోకలు యధావిధిగా కొనసాగగా కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా వామపక్ష విద్యార్థి సంఘాలు వినూత్నంగా నిరసనలు వ్యక్తం చేశాయి. ప్రధాని మోడీ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అర్ధనగ్న ప్రదర్శనలు నిర్వహించాయి. తిరుపతి లోని అంబేద్కర్ విగ్రహం వద్ద రోడ్డుపై పడుకొని గడ్డి తింటూ నిరసన చేపట్టాయి.

  • 08 Dec 2020 10:16 AM (IST)

    దేశవ్యాప్తంగా నిలిచి వర్తక, వాణిజ్యం

    రైతు సంఘాల పిలుపుతో మంగళవారం భారత్ బంద్ విజయవంతంగా కొనసాగుతుంది. రైతుల బంద్ కు వివిధ కార్మిక సంఘాలు విపక్షాలు మద్ధతు ప్రకటించడంతో బంద్ సంపూర్ణంగా జరుగుతుంది. రైతులు రోడ్లు, రైలుపట్టాలపై బైఠాయించడంతో వాహనాలు, రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రయాగరాజ్ నగరంలో సమాజ్ వాదీ పార్టీ కార్యకర్తలు రైళ్లను అడ్డుకున్నారు. జైపూర్ నగరంలో రైతులు, ఎన్ఎస్ యూఐ కార్యకర్తలు బీజేపీ కార్యాలయం వద్ద ఘెరావ్ చేశారు. బనారస్ నుంచి గ్వాలియర్ వెళ్లాల్సిన బుందేల్ ఖండ్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రయాగరాజ్ నగరంలో కార్యకర్తలు ఆపివేశారు. భారత్ బంద్ సందర్భంగా భువనేశ్వర్ రైల్వే స్టేషనులో రైళ్లను రైతులు నిలిపివేశారు. రవాణ సంఘాలు బంద్ కు మద్ధతు ప్రకటించడంతో సరుకుల రవాణాపై తీవ్ర ప్రభావం చూపించింది. పూణే మార్కెటును తెరిచినా రైతుల బంద్ కు తాము మద్ధతు ఇస్తున్నామని వ్యాపారులు చెప్పారు.

  • 08 Dec 2020 10:13 AM (IST)

    ఆలయాలపై బంద్ ఎఫెక్ట్..

    రైతులకు అండగా యావత్ భారతావని నిలుస్తోంది. భారత్ బంద్ ప్రభావంతో కాణిపాకం శ్రీ వర సిద్ధి వినాయక స్వామి ఆలయ ప్రాంగణంలో బంద్ కొనసాగుతుంది. కాణిపాకంలో దుకాణాలు మూతపడ్డాయి. వ్యాపారం సముదాయంలో,బస్ స్టాండ్ లో,హోటల్లో భక్తులు లేక బోసిపోయాయి.

  • 08 Dec 2020 10:04 AM (IST)

    అనంతపురం జిల్లాలో…

    కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఆమోదించిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ డిపో ఎదుట వామపక్ష నేతలు నిరసనకు దిగారు. భారత్ బంద్‌లో భాగంగా ఆర్టీసీ ఎదుట సీపీఎం జిల్లా నేత రాంభూపాల్, సీపీఐ జిల్లా నేత నారాయణ స్వామి, వామపక్ష నేతలు నిరసన చేపట్టారు. మరోవైపు ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. డిపోల ఎదుట పోలీసులు భారీగా మోహరించారు.

  • 08 Dec 2020 10:03 AM (IST)

    కృష్ణా జిల్లాలో…

    కృష్ణా జిల్లాలో ఉదయం 6 గంటల నుంచే రైతు సంఘాల భారత్ బంద్ కొనసాగిస్తున్నారు. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. వామపక్షల, కాంగ్రెస్, రైతు సంఘాల ఆధ్వర్యంలో పీఎన్‌బీఎస్ బస్టాండ్ గేట్ వద్ద ఆందోళన చేపట్టారు. సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, రైతు సంఘాల నాయకులుఆందోళనలో పాల్గొన్నారు.

  • 08 Dec 2020 10:03 AM (IST)

    ఏపీలో కొనసాగుతున్న బంద్..

    కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన చట్టాలను వ్యతిరేకిస్తూ తలపెట్టిన భారత్‌ బంద్‌ ఏపీలో కొనసాగుతోంది. ఉదయం నుంచే వామపక్షాలు రోడ్డుపైకి వచ్చిన ఆందోళనలు చేపట్టారు. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. పలు చోట్ల సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ నేతలు, రైతు సంఘాలు ఆందోళనలకు దిగారు.

    ప్రకాశం జిల్లాలో కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన చట్టాలను వ్యతిరేకిస్తూ తలపెట్టిన భారత్ బంద్‌కు మద్దతుగా ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్‌లో సీపీఎం ఆందోళనకు దిగింది. ఆర్టీసీ స్వచ్ఛందంగా బస్సులు నిలిపివేసింది.

  • 08 Dec 2020 09:57 AM (IST)

    యాదాద్రి జిల్లాలో…

    యాదాద్రి జిల్లా లో నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు తలపెట్టిన భారత్ బంద్ కు మద్దతుగా అధికార,ప్రతిపక్ష పార్టీల ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసి డిపో ఎదుట ధర్నా నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన రోడ్ లో అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు ర్యాలీ నిర్వహించారు.

  • 08 Dec 2020 09:56 AM (IST)

    ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో…

    నూతన వ్యవసాయ చట్టాన్ని వ్యతిరేకిస్తూ భారత్ బంద్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతోంది. రైతు సంఘాలు చేపట్టిన బంద్‌కు రాజకీయ పార్టీలు, రాష్ట్రంలో అధికార పార్టీ టిఆర్ఎస్ మద్దతు తెలపడంతో బంద్ సంపూర్ణంగా కొనసాగుతోంది. కరీంనగర్‌లో వేకువజామునే సీపీఐ, సీపీఎం నాయకులు కార్యకర్తలు బస్ స్టేషన్ వద్దకు చేరుకొని బస్సులు బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. డిపో ముందు బస్ స్టేషన్ వద్ద బైఠాయించారు. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కేంద్ర ప్రభుత్వానికి, మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు నూతన వ్యవసాయ చట్టాన్ని రద్దు చేసే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు టిఆర్ఎస్ కాంగ్రెస్ వామపక్ష పార్టీల నాయకులు రోడ్లపైకి వచ్చి వర్తక వ్యాపార వాణిజ్య సంస్థలను బంద్ చేయించారు. గోదావరిఖని బస్ డిపో ముందు బైఠాయించి ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆందోళనలో పాల్గొన్నారు. మంథనిలో బంద్ సంపూర్ణంగా కొనసాగుతోంది. వ్యాపారస్తులు, కూరగాయల మార్కెట్ నిర్వాహకులు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు.

  • 08 Dec 2020 09:55 AM (IST)

    శ్రీకాకుళం జిల్లాలో..

    వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జిల్లాలో భారత్‌ బంద్‌ ప్రశాంతంగా సాగుతోంది. విద్యా, వాణిజ్య సముదాయాలు స్వచ్చందంగా మూసివేశారు. శ్రీకాకుళం, టెక్కలి, పాలకొండ, పలాసలో ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా ముఖ్య కూడళ్లు, టోల్‌ప్లాజాల వద్ద పోలీసులను మోహరించారు.

  • 08 Dec 2020 09:53 AM (IST)

    తూర్పుగోదావరి జిల్లాలో..

    రైతు వ్యతిరేక బిల్లులను రద్దు చేయాలని కోరుతూ జిల్లాలో బంద్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రంపచోడవరంలోని సీపీఐ, సీపీఎం, సీపీఐ ఎంఎల్ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుండి నాయకులు రోడ్లపైకి చేరి రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలంటూ నినాదాలు చేస్తూ బంద్‌ను పాటిస్తున్నారు. బంద్‌కు మద్దతుగా రంపచోడవరంలో దుకాణాలు, వ్యాపార సముదాయాల స్వచ్ఛందంగా మూతపడ్డాయి.

  • 08 Dec 2020 09:52 AM (IST)

    సూర్యాపేట జిల్లాలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌

    కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు తలపెట్టిన భారత్ బందులో భాగంగా హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై సూర్యాపేట జిల్లా రైతులు నిరసనకు దిగారు. చివ్వేంల మండలం గుంపుల తిరుమలగిరి వద్ద రైతులు ట్రాక్టర్లను రోడ్డుపై అడ్డంగా ఉంచి వ్యవసాయ చట్టాలకు వ్యతిరకేంగా నినాదాలు చేస్తున్నారు. దీంతో హైవేపై ట్రాఫిక్‌ భారీగా స్తంభించి పోయింది.

  • 08 Dec 2020 09:49 AM (IST)

    వరంగల్ జిల్లాలో

    నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ భారత్ బంద్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతోంది. రైతు సంఘాలు చేపట్టిన బంద్‌కు బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలపడంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. వర్తక, వాణిజ్య సంఘాలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సు సర్వీసులను నిలిపివేసింది. దీంతో 950 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఉదయాన్నే టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్, వామపక్ష పార్టీల కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి నిరసన చేపట్టారు.

  • 08 Dec 2020 09:43 AM (IST)

    భారత్ బంద్.. అలెర్ట్ అయిన హైదరాబాద్ పోలీసులు..

    కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు చేపట్టిన భారత్ బంద్‌ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఐదు జోన్‌‌లకు ముగ్గురు అడిషనల్ సీపీలు, జాయింట్ సీపీలను ఇంచార్జ్‌లుగా నియమించారు. నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఏ ప్రాంతంలోనూ అత్యవసర వాహనాలకు ఇబ్బంది కలగకుండా చూడాలని పోలీసులకు డీజీపీ సూచనలు ఇచ్చారు.

    ఇదిలా ఉంటే అధికార టీఆర్ఎస్ పార్టీతో పాటు కాంగ్రెస్, జనసమితి, ఎంఐఎం పార్టీలు భారత్ బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. అలాగే పాతబస్తీలో వ్యాపారాలు బంద్‌కు మద్దతు పలుకుతూ స్వచ్ఛందంగా షాపులు మూసివేశారు. నగరంలోని అన్ని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అటు సికింద్రాబాద్, జేబీఎస్, ఎంజీబీఎస్ బస్టాండ్ వద్ద బంద్ సంపూర్ణంగా కొనసాగుతోంది. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.

  • 08 Dec 2020 09:26 AM (IST)

    నిర్మానుష్యంగా రహదారులు

    కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన రైతు చట్టాలని వ్యతిరేకిస్తూ భారత్ బంద్ చేపట్టారు. దీనిలో భాగంగా సికింద్రాబాద్, జేబీఎస్ బస్టాండ్ వద్ద బంద్ సంపూర్ణంగా కొనసాగుతోంది. కంటోన్మెంట్, పికెట్ డిపోలో బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. జేబీఎస్ బస్టాండ్ నిర్మానుష్యంగా మారింది. ప్రయాణికులు లేక బస్టాండ్ వెలవెలబోతోంది. జేబీఎస్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు.

  • 08 Dec 2020 09:22 AM (IST)

    కదలని ప్రగతి రథ చక్రాలు.. నిలిచిన ప్రజా రవాణా

    రైతులకు మద్దతుగా తెలంగాణలోని ఆర్టీసీ కార్మికులు నిరసన తెలిపారు. ఆర్టీసీ బస్సులు అక్కడిక్కడే నిలిపివేశారు. దీంతో బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. డిపో డిపోకే పరిమతమైన బస్సులు మంచిర్యాల – 140 బస్సులు మేడ్చల్ – 186 బస్సులు పరిగి – 80 బస్సులు ఖమ్మం – 603 బస్సులు గోదావరిఖని – 129 బస్సులు ఆదిలాబాద్ – 625 బస్సులు మెదక్‌ – 670 బస్సులు ఇబ్రహీంపట్నం – 127 బస్సులు మేడ్చల్ – 186 బస్సులు కుషాయిగూడ – 120 బస్సులు కూకట్‌పల్లి – 150 బస్సులు జీడిమెట్ల – 120 బస్సులు రామచంద్రాపురం – 125 బస్సులు గచ్చిబౌలి – 102 బస్సులు మహబూబ్‌నగర్‌ –  820 బస్సులు

  • 08 Dec 2020 09:14 AM (IST)

    మహబూబ్‌నగర్ జిల్లాలో మద్దతు తెలిపిన మంత్రి, ఎమ్మెల్యేలు

    కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళనలు కొనసాగుతున్నాయి. మహబూబ్‌నగర్ డిపో ఎదుట ధర్నాలో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ పాల్గొన్నారు. నాగర్‌కర్నూల్‌ ఆర్టీసీ డిపో ఎదుట టీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణులు నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. నిరసనలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు. కల్వకుర్తి డిపో ఎదుట ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ నేతృత్వంలో నిరసన వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని డిపో ఎదుట ఎమ్మెల్యే చందర్ నిరసన తెలిపారు. రైతులకు మద్దతు ప్రకటించిన శ్రీరాంపూర్ డివిజన్ సింగరేణి కార్మికులు… నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు.

  • 08 Dec 2020 09:10 AM (IST)

    డిపోలకే పరిమితమైన బస్సులు

    భారత్ బంద్ సందర్భంగా హయత్ నగర్, బండ్లగూడ డిపోలకు పరిమితమయ్యాయి. హాయత్‌నగర్ రెండు డిపోలకు సంబంధించి 240 బస్సులు నిలిచిపోయాయి. అటు, బండ్లగూడ డిపో లో 120 బస్సులు కదలలేదు. మియాపూర్ 1, 2 డిపోలలో నిలిచిపోయిన 265 బస్సులు. HCU డిపోలో 90 బస్సులు నిలిచిపోయాయి. రైతు వ్యతిరేక బిల్లు ను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేశారు.

  • 08 Dec 2020 09:00 AM (IST)

    బంద్‌కు మద్దతు తెలిపిన ఏపీ సీఎం జగన్

    రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఏపీలో భారత్‌ బంద్‌ కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆందోళనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు సీఎం జగన్‌. ప్రభుత్వ కార్యాలయాలు మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత ఓపెన్‌ చేయాలని ఆదేశించారు. ఇక మధ్యాహ్నం ఒంటిగంట వరకు బస్సులు నడపొద్దని.. విద్యాసంస్థలు మూసివేయాలని ఆదేశించారు. విజయవాడ పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌ ఎదుట ఆందోళనకు దిగాయి వామపక్షాలు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. రైతు ఉద్యమానికి మద్దతుగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.

  • 08 Dec 2020 08:58 AM (IST)

    స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొంటున్న వర్తక, వాణిజ్య సంఘాలు

    భారత్ బంద్‌లో వర్తక, వ్యాపార సంస్థలు స్వచ్చంధంగా భాగస్వాములువుతున్నారు. కీసర , ఘట్కేసర్ పరిసర ప్రాంతాల్లో పలు దుకాణాలు మూసివేసి బంద్‌ను కొనసాగుతున్నారు. బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. వాహనాలు ఎక్కడిక్కడ నిలిచిపోవడంతో రోడ్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. అత్యవసర సేవల్లో ఉన్న మెడికల్ , హాస్పిటల్ లు తప్ప మిగిలిన వ్యాపార సంస్థలు స్వచ్ఛందగా బంద్ పాటిస్తున్నారు. రాష్టంలో ప్రధాన పార్టీలు బంద్ కు మద్దతు ఇవ్వటంతో రాజకీయ నాయకులు రోడ్లపై తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు.

  • 08 Dec 2020 08:45 AM (IST)

    కూకట్‌పల్లిలో స్తంభించిన ట్రాఫిక్

    రైతు వ్యతిరేక బిల్లును నిరసిస్తూ చేపడుతున్న భారత్ బంద్ కూకట్‌పల్లిలో కొనసాగుతుంది. కూకట్‌పల్లి ఉషాముళ్ళపూడి వద్ద రహదారిపై బైఠాయించిన టీఆర్ఎస్ ఆందోళన చేపట్టారు. భారీ ట్రాఫిక్ స్తంభించింది. కేంద్ర ప్రభుత్వ విధానాలను అన్నదాతలను నట్టేట ముంచెలా ఉన్నాయని ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ ఆరోపి్ంచారు. రైతు వ్యతిరేక బిల్లును రద్దు చెయాలని ఆయన‌ డిమాండ్ చేశారు.

  • 08 Dec 2020 08:39 AM (IST)

    కడపలో కొనసాగుతున్న సంపూర్ణ బంద్

    గత 11 రోజులుగా లక్షలాది మంది దేశరాజధాని ఢిల్లీలో పోరాడుతున్న రైతాంగ ఉద్యమానికి సంఘీభావంగా కడప జిల్లా లో భారత్ బంద్ కొనసాగుతోంది. ఉదయం 6 నుంచే కడప ఆర్టీసీ బస్ డిపో వద్ద వామపక్షాలు, ప్రజా సంఘాలు, రైతు సంఘాలు మద్దతు తెలిపాయి. దీంతో డిపోలకే ఆర్టీసీ బస్సులు పరిమితం అయ్యాయి. ముఖ్యంగా వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టే నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసి కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని కోరుతున్నారు. భారత్ బంద్ జయప్రదం చేసేలాగా స్వచ్ఛందంగా వ్యాపార వాణిజ్యాలు, దుకాణాలు, పాఠశాలలు, కళాశాలలు మూసివేయాలని పిలుపు నిచ్చారు.

  • 08 Dec 2020 08:36 AM (IST)

    విశాఖలో కదలని వాహనాలు

    విశాఖలో భారత్ బ౦ద్ కొనసాగుతోంది. దాదాపు అన్ని వర్గాలు బ౦ద్ కి మద్దతు పలుకుతున్నాయి. అధికార వైసీపీ సైతం స౦ఘీభావ౦ తెలిపట౦తో ప్రభుత్వ ఆదేశాలతో ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. గాజువాకలో ఆయిల్ ట్యాంకర్స్ అసోసియేషన్ సైతం బంద్ కు సంఘీభావం తెలిపింది. వాహనాలను నిలిపివేసి బ౦ద్‌లో పాల్గొ౦టున్నారు. దీ౦తో 1200కు పైగా ఆయిల్ ట్యాంకర్లు నిలిచిపోయాయి. మద్దిలపాలె౦ జ౦క్షన్ వద్ద వామపక్ష పార్టీలు, కార్మిక, విద్యార్థి స౦ఘాల నేతలు 16వ నె౦బర్ జాతీయ రహదారిని దిగ్బ౦ధ౦ చేసాయి. రోడ్డుపై బైఠాయి౦చి నిరసనలు తెలిపాయి. దీ౦తో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయి౦ది.

  • 08 Dec 2020 08:24 AM (IST)

    నల్లగొండ జిల్లాలో నిలిచిన ప్రజా రవాణా

    ఉమ్మడి నల్లగొండ జిల్లాలో భారత్ బంద్ విజయవంతంగా కొనసాగుతోంది. తెల్లవారుజాము నుంచే టిఆర్ఎస్, వామపక్షాలు, కాంగ్రెస్ నేతలు రోడ్లపైకి వచ్చి బంద్ పాటిస్తున్నారు. జిల్లాలోని ఏడు డిపోల్లోని 750 ఆర్టిసి బస్సులు రోడ్డు ఎక్కలేదు. జిల్లాలో ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. జిల్లాలోని హైదరాబాద్- విజయవాడ, హైదరాబాద్- వరంగల్, జడ్చర్ల – కోదాడ అ హైవేలను రైతుల దిగ్బంధించారు. చట్టాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. కొన్నిచోట్ల కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసే చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

  • 08 Dec 2020 08:22 AM (IST)

    అన్నదాతకు అండగా గులాబీ దళం

    గులాబీ పార్టీ పిడికిలెత్తింది. కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలపై పోరుకు దిగింది. అన్నదాతల ఆందోళనలో భాగమైంది. నేటి భారత్‌ బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. భారత్‌ బంద్‌లో పాల్గొనాలని టీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు తెలంగాణ సీఎం కేసీఆర్. తెలంగాణవ్యాప్తంగా ఉన్న ప్రజాసంఘాలు, ఇతర సంఘాలు, ఉద్యోగులు, నాయకులు, కార్మికులు.. బంద్‌కు మద్దతు ప్రకటించారు. బంద్‌తో కేంద్రానికి చెమటలు పట్టించాలని టీఆర్‌ఎస్‌ శ్రేణులకు పిలుపునిచ్చారు ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్. కార్పొరేట్‌ కంపెనీలకు దోచిపెట్టేందుకే కేంద్ర ప్రభుత్వం కొత్త వ్యవసాయ చట్టాన్ని తీసుకువచ్చిందన్నది టీఆర్ఎస్ ఆరోపణ. కొత్త

  • 08 Dec 2020 08:21 AM (IST)

    హైదరాబాద్‌లో ట్రాఫిక్ అంక్షలు

    భారత్ బంద్ సందర్భంగా తెలంగాణ పోలీసుల అప్రమత్తమయ్యారు. బంద్‌తో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదన్నారు డీజీపీ మహేందర్‌రెడ్డి. రాష్ట్రంలో అత్యవసర సర్వీసులకు అంతరాయం కలగకుండా చూడాలని ఆయన కోరారు. బంద్ సందర్బంగా శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ మహేందర్‌రెడ్డి సూచించారు.

    భారత్‌ బంద్‌ సందర్భంగా హైదరాబాద్‌లో పలు ఆంక్షలు విధించారు ట్రాఫిక్ పోలీసులు. ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే వాహనదారులు ఓఆర్‌ఆర్‌ ఉపయోగించుకోవాలని తెలిపారు. బంద్‌ సమయంలో ఎమర్జెన్సీ సర్వీసులు, అంబులెన్స్‌లకు అనుమతి ఉంటుందన్నారు. బంద్‌ సందర్భంగా ప్రజలంతా సహకరించాలన్న పోలీసులు

  • 08 Dec 2020 08:14 AM (IST)

    దేశవ్యాప్తంగా 4 గంటల పాటు బంద్‌

    కొత్త వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న అన్నదాతలకు దేశవ్యాప్తంగా సంపూర్ణ మద్దతు లభిస్తోంది. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నిరసనలు చేయాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. దేశవ్యాప్తంగా 4 గంటల పాటు బంద్‌ పాటించాలని రైతు సంఘాల పిలుపునిచ్చాయి. ఉ.11 నుంచి మ.3 గంటల వరకు మాత్రమే బంద్‌ కొనసాగుతుందని తెలిపాయి. భారత్ బంద్‌కు 25 రాజకీయ పార్టీలు తమ మద్దతు తెలిపాయి.దేశవ్యాప్తంగా రహదారుల దిగ్బంధం చేసి.. కేంద్రానికి తమ నిరసన తెలపాలని రైతు సంఘాలు, రాజకీయ పార్టీలు నిర్ణయించాయి. శాంతియుతంగా నిరసనలు తెలపాలని రైతు సంఘాల విజ్ఞప్తి చేశాయి. ఇప్పటికే రైతులతో ఐదుసార్లు చర్చలు జరిపిన కేంద్రం తుది నిర్ణయానికి రాలేకపోయింది. రేపు మరోసారి రైతు సంఘాలతో కేంద్రం చర్చలు జరుపనుంది.

  • 08 Dec 2020 08:09 AM (IST)

    పాలమూరులో రోడ్డెక్కని బస్సులు

    ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో బంద్‌ సంపూర్ణంగా కొనసాగుతోంది. ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయాయి. వాణిజ్య, వ్యాపార సంస్థలన్నీ మూతబడ్డాయి. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, వామపక్ష నేతలు బస్సు డిపోల ముందు బైఠాయించారు. వ్యవసాయ రంగానికి నష్టం కలిగించే చట్టాలను ఉపసంహరించేంత వరకు ఆందోళనలు కొనసాగుతాయని తేల్చి చెప్పారు.

  • 08 Dec 2020 08:08 AM (IST)

    కర్నూలులో సీపీఎం ఆధ్వర్యంలో బంద్

    కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ అఖిల భారత రైతు సంఘాల సమన్వయ కమిటీ పిలుపు మేరకు భారత్‌ బంద్‌ మంగళవారం కర్నూలులో ప్రశాంతంగా సాగుతోంది. కర్నూలు ఆర్‌టిసి బస్టాండ్‌ ఎదుట వామపక్షాలు, రైతు సంఘాలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఉదయం 6 గంటల నుండే ధర్నా నిర్వహిస్తున్నారు. రైతులకు ఉరితాల్లు వేసేలా ఉన్న వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులను అమలు చేయాలని కోరారు. ధర్నాలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ.గఫూర్‌ తదితరులు పాల్గొన్నారు. మరో వైపు జిల్లాలో భారత్‌ బంద్‌లో భాగంగా ఆటోల బంద్‌ కొనసాగుతోంది.

  • 08 Dec 2020 08:05 AM (IST)

    భారత్ బంద్‌కు ఉద్యోగ సంఘాల మద్దతు

    రైతు బంద్‌కు బీఎస్‌ఎన్‌ఎల్‌ ఎంప్లాయీస్, రైల్వే యూనియన్‌, ఏఐఆర్‌ఎఫ్‌, ఎన్‌ఎఫ్‌ఐఆర్‌లు సంఘీభావం ప్రకటించాయి. ఇక రైతు ఉద్యమానికి ఆల్‌ఇండియా మోటార్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కాంగ్రెస్‌ మద్దతు ప్రకటించింది. దీంతో దేశవ్యాప్తంగా సరుకు రవాణా సేవలపై తీవ్ర ప్రభావం పడనుంది. కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయి. ఇక గుజరాత్‌లో 23 రైతు సంఘాలు ఏకతాటిపైకి వచ్చారు. గుజరాత్‌ ఖేదత్‌ సంఘర్ష్‌ సమితిగా ఏర్పడ్డాయి. ఇక రేపు కూడా కిసాన్‌ సంసద్‌ నిర్వహించనున్నట్లు పేర్కొన్నాయి.

  • 08 Dec 2020 08:03 AM (IST)

    రైతులకు అండగా నిలుస్తున్న అఖిలపక్షాలు

    కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న భారత్‌ బంద్‌కు టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, వామపక్షాలు సహా పలు పార్టీలు మద్దతు ప్రకటించాయి. బంద్‌ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేయాలని రాష్ట్రాలకు సూచించింది కేంద్రం. చట్టాల రద్దు తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని..కేంద్రం అంగీకరించాల్సిందేనని పట్టుబడుతున్నారు. శాంతియుతంగా నిరసనలు తెలపాలని..ఎలాంటి హింసాత్మక ఘటనలకు పాల్పడొద్దని కోరారు.

  • 08 Dec 2020 08:02 AM (IST)

    డిపోలకే పరిమితమైన బస్సులు

    దేశవ్యాప్తంగా భారత్‌ బంద్‌ కొనసాగుతోంది. ఉదయం నుంచే నిరసనకారులు రోడ్లెక్కారు. డిపోల ముందు, రైల్వే ట్రాక్‌లపై బైఠాయించి తమ నిరసన తెలుపుతున్నారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనని డిమాండ్‌ చేస్తున్నారు. ఐతే 11నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బంద్‌ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు రైతు నేతలు. ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు..అత్యవసర సేవలకు మినహాయింపునిస్తున్నట్లు వెల్లడించారు.

  • 08 Dec 2020 08:00 AM (IST)

    భారత్ బంద్‌కు టీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు

    కొత్త వ్యవసాయ చట్టాలతో రైతులు రోడ్డున పడి, కూలీలుగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో ఇవాళ్టి బంద్‌కు టీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. వర్కింగ్‌ ప్రెసిడెంట్ మొదలు.. మంత్రులు నుంచి సాధారణ కార్యకర్తల వరకు అంతా రోడ్డెక్కనున్నారు. భారత్‌ బంద్‌ను విజయవంతం చేయడమే టార్గెట్‌గా గులాబీ పార్టీ ముందుకెళ్తోంది.

Published On - Dec 08,2020 5:18 PM

Follow us
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?